చెరుకు సాగుకు రైతులు దూరం

చెరుకు సాగుకు రైతులు దూరం
  •     ఫ్యాక్టరీ నిర్వహణపై దృష్టి పెట్టని కృష్ణ వేణి షుగర్స్
  •     గిట్టుబాటు ధర లేక రైతులకు తప్పని నష్టం

వనపర్తి, వెలుగు: ప్రభుత్వ రాయితీతో ఏర్పాటైన షుగర్​ ఫ్యాక్టరీ నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో పాలమూరు జిల్లా రైతులు చెరుకు సాగుకు దూరమవుతున్నారు. కరువు జిల్లాగా పేరున్న పాలమూరులో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం భారీగా రాయితీలు ప్రకటించింది. ఇందులోభాగంగా వనపర్తి జిల్లాలో ఏర్పాటు చేసిన కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీ రైతులకు ఉపయోగపడడం లేదన్న విమర్శలున్నాయి. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడంతో పాటు ఫ్యాక్టరీ నిర్వహణపై  చేతులెత్తేస్తోంది. నష్టాలు వస్తున్నాయంటూ మూసి వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

పడిపోయిన సాగు విస్తీర్ణం..

కొత్తకోట మండలం రామకృష్ణాపురం, అప్పరాల శివారులో 150 ఎకరాల విస్తీర్ణంలో షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం అనుమతించింది. ఇందుకు రూ.100 కోట్ల వరకు ఖర్చు కాగా, అందులో సగం సబ్సిడీ కింద మంజూరు చేసింది. అట్టహాసంగా షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభించిన యాజమాన్యం ఆ తర్వాత విస్తీర్ణం తగ్గిస్తూ వస్తోంది. 6 లక్షల టన్నుల క్రషింగ్  కెపాసిటీ గల షుగర్ ఫ్యాక్టరీ ప్రస్తుతం 1.50 లక్షల టన్నుల క్రషింగ్ కే పరిమితమైంది. ఉమ్మడి జిల్లాలో గతంలో 20 వేల ఎకరాల సాగు విస్తీర్ణం ఉండగా, ప్రస్తుతం 8 వేలకు పడిపోయింది. దీంతో జహీరాబాద్ ప్రాంతం నుంచి చెరుకును తెప్పించి, ఇక్కడి చెరుకుతో కలిపి ప్రతి ఏటా 3 లక్షల టన్నులు క్రషింగ్ చేస్తున్నారు. చెరుకు విస్తీర్ణం పెరిగితే కంపెనీకి లాభాలు వస్తాయి. దీంతో రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. కంపెనీ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు లాభాలు రాకపోవడంతో టన్నుకు రూ.3,257 మాత్రమే ఇస్తున్నారు. టన్నుకు రూ.5,550 చెల్లించాలని రైతులు చాలా కాలంగా పోరాడుతున్నారు.

చెరుకు కోతలకు సమస్యే..

చెరుకు పండించే రైతులు పంట కోత సమయంలో తిప్పలు పడుతున్నారు. మహారాష్ట్ర, కర్నాటక, ఏపీ ప్రాంతాలకు చెందిన కూలీలను ఫ్యాక్టరీ యాజమాన్యం రప్పించి కోత పనులు చేయిస్తున్నారు. అయితే 150 టీమ్​లు అవసరం ఉండగా, 30 బృందాలు మాత్రమే పని చేస్తున్నారు. మరో రెండు కోత మిషన్ల ద్వారా కటింగ్​ మొదలు పెట్టారు. ప్రతి ఏడాది ఫిబ్రవరి  నుంచి ఏప్రిల్  వరకు కోతలు చేయాల్సి ఉంది. ఈ సారి కూలీలు దొరకరనే భయంతో చెరుకు గడలు ముదరక ముందే కోతలు ప్రారంభించారు. ఇది దిగుబడిపై ప్రభావం చూపుతోంది. వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలను సాగు చేయాలని రాష్ట్ర సర్కారు రైతులను కోరుతోంది. చెరుకు సాగు చేసే రైతులను మాత్రం ప్రభుత్వం ప్రోత్సహించడం లేదు. కేంద్రం ఇచ్చే మద్దతు ధరకు అదనంగా చెల్లిస్తే చెరుకు సాగు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. 

ఫ్యాక్టరీ తీరుపై రైతుల అసహనం

చెరుకు కోతలకు ముందు రైతులతో చర్చలు జరిపి గిట్టుబాటు ధరకు అదనంగా ఫ్యాక్టరీ ఎంత చెల్లిస్తుందనే విషయాన్ని చెప్పడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు 40 టన్నుల దిగుబడి వస్తే రైతులకు గిట్టుబాటు అవుతుంది. చెరుకు విత్తనాల పంపిణీ చేసి యాజమాన్యం పట్టించుకోకపోవడంతో దిగుబడులు అనుకున్నంత రావడం లేదు. ఎకరాకు 20 టన్నుల దిగుబడి వస్తుండడంతో ఏడాది పాటు ఒకే పంటను పండించడం వల్ల తమకు ఏమీ మిగలడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ధర పెంచకుంటే సాగు చేయలేం

మద్దతు ధరకు అదనంగా జిల్లా రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అదనంగా చెల్లించాలి. కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు ప్రోత్సాహ కాలు అందించాలి. కూలీల సమస్యను పరిష్కరించాలి. చెరుకు డబ్బులు వెంటనే అకౌంట్లలో జమ చేయాలి. -  రాజన్న, చెరుకు రైతుల సంఘం, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు

సాగు విస్తీర్ణం పెంచుతాం

చెరుకు విస్తీర్ణం తగ్గుతోంది. మంచి దిగుబడి సాధించేలా నాణ్యమైన విత్తనాలు, నిపుణుల సలహాలు అందించేందుకు చర్యలు తీసుకుంటాం. రైతులు చెరుకు సాగు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే లాభాలు పొందవచ్చు. డబ్బులు ఎప్పటికప్పుడు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. - రామ్మోహన్ , టీం హెడ్, కృష్ణ వేణి షుగర్​ ఫ్యాక్టరీ, అప్పరాల