కూరగాయల సాగు పెరగలే.. మీటింగ్​లు, సర్వేలతో సరిపెట్టిన ఆఫీసర్లు

కూరగాయల సాగు పెరగలే.. మీటింగ్​లు, సర్వేలతో సరిపెట్టిన ఆఫీసర్లు

కామారెడ్డి జిల్లాలో అతి తక్కువ విస్తీర్ణంలో కూరగాయల సాగు
ఏడాది కింద శివాయిపల్లిని పైలట్​ప్రాజెక్టుగా ఎంపిక చేసిన కలెక్టర్​
రైతులకు అందని ప్రోత్సాహకాలు
ఎప్పట్లాగే ఇతర ప్రాంతాల నుంచి కూరగాయల దిగుమతి.. 

కామారెడ్డి , వెలుగు: కామారెడ్డి జిల్లాలో కూరగాయల సాగుకు అనువైన భూములు ఉన్నప్పటికీ రైతులకు ప్రోత్సాహం లేకుండా పోయింది. కూరగాయల సాగు విస్తీర్ణం పెంచాలని గతేడాది కలెక్టర్​చేసిన ఆలోచన నేటికీ కార్యరూపం దాల్చలేదు.  రాజంపేట మండలం శివాయిపల్లిని పైలట్​ ప్రాజెక్టుగా ఎంపిక చేసినప్పటికీ వ్యవసాయాధికారులు  మీటింగులు, సర్వేలతోనే సరిపెట్టారు. ఆధునాతన పద్ధతుల్లో కూరగాయల సాగుకు అవసరమైన సామగ్రి, టెక్నాలజీ తోపాటు  మార్కెటింగ్​ సౌకర్యం కల్పిస్తామన్న మాటలు కాగితాలకే పరిమితమయ్యాయి. లోకల్​ అగ్రికల్చర్​ ఆఫీసర్లు పంపిన ప్రపోజల్స్​ హార్టికల్చర్​ఉన్నతాధికారుల టేబుల్​మీదే ఉండిపోవడంతో శివాయిపల్లిలోనూ కూరగాయల సాగువిస్తీర్ణం పెరగలేదు.  పైలట్ ప్రాజెక్ట్​పరిస్థితే ఇట్లా ఉండడంతో ఎప్పట్లాగే ఈసారి కూడా జిల్లాలో కూరగాయలకు కరువొచ్చింది. పక్క రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి రావడంతో కూరగాయల రేట్లు సామాన్యులకు చుక్కలు చూపుతున్నాయి. 

8 వేల ఎకరాల్లో  కూరగాయల సాగు

జిల్లాలో  వ్యవసాయానికి అనుకూలంగా 5 లక్షల 40 వేల ఎకరాల భూమి ఉంది.  ఇందులో 8 వేల ఎకరాల్లో (1.5 శాతం) కూరగాయలు సాగు చేస్తున్నారు.  ప్రధానంగా  టమాట, బెండ, బీర, పచ్చి మిర్చి, చిక్కుడు,  ఉల్లి, వంకాయ,  కాకర, క్యాబేజీ, క్యాలిప్లవర్​, బిర్నీస్​, ఆకుకూరలు  పండిస్తున్నారు. అతి తక్కువ విస్తీర్ణంలో  సాగు చేయడంతో దిగుబడులు జిల్లా అవసరాలు తీర్చలేకపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇతర జిల్లాలు,  ఏపీ, మహారాష్ర్ట నుంచి  దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది.  రైతులను చైతన్య పర్చటం,   కూరగాయల సాగు మెళకువలపై   అవగాహన కల్పించే విషయంలో హార్టికల్చర్​ శాఖ చొరవ చూపడం లేదనే   విమర్శలు ఉన్నాయి.  దీనికి తోడూ  గవర్నమెంట్​పరంగా ప్రోత్సహకాలు అందట్లేదు.  ప్రస్తుతం మార్కెట్లో  కూరగాయల రేట్లు   కిలోకు రూ.60 నుంచి 80 పలుకుతున్నాయి.   టమాట కిలోకు రూ.100,   పచ్చి మిర్చి  రూ.120  పలుకుతున్నాయి. 

సాగు పెంపుపై నిర్లక్ష్యం

రాజంపేట మండలం బసన్నపల్లి, శివాయిపల్లి,  కామారెడ్డి మండలం కొటాల్​పల్లి, లింగాపూర్, సదాశివనగర్​ మండలం కుప్రియాల్,  మర్కల్,  తాడ్వాయి మండలం బ్రహ్మన్​పల్లి,  దేవాయిపల్లి,  కృష్జాజీవాడి,  భిక్కనూరు మండలం గుర్జకుంట, రామేశ్వర్​పల్లిల్లో  కూరగాయల సాగు  ఎక్కువగా ఉంది.  ఇక్కడి  రైతులు  పండిస్తున్న  కూరగాయలు  జిల్లా అవసరాలను తీర్చలేకపోతున్నాయి.   ఈ గ్రామాలు జిల్లా  కేంద్రంతో పాటు,  హైదరాబాద్​కు సమీపంలో  ఉన్నాయి.  ఇక్కడి  రైతులను  ప్రోత్సహించి సాగు విస్తీర్ణం పెంచటంతో  పాటు  సరైన  సాగు పద్ధతులు పాటించడం, మార్కెటింగ్​  సౌకర్యాలు మెరుగు పర్చటం వంటి వాటిపై  దృష్టి పెడితే దిగుబడి పెరిగే అవకాశముందని  కలెక్టర్​ జితేశ్​ పాటిల్​ భావించి కింద   చర్యలు  చేపట్టారు.

పైలట్ ప్రాజెక్టుగా శివాయిపల్లి

రాజంపేట మండలం శివాయిపల్లిని పైలట్​  ప్రాజెక్టుగా సెలక్ట్ చేసి కూరగాయల సాగు పెంచాలని నిర్ణయించారు.  ప్రస్తుతం ఈ ఊరిలో 50 ఎకరాల్లో  కూరగాయలు పండిస్తున్నారు.  గ్రామంలో రైతులతో కలెక్టర్​ మీటింగ్​ నిర్వహించారు. అగ్రికల్చర్​​ ఆఫీసర్ల ద్వారా  పూర్తి  వివరాలుసేకరించారు.  వీరితో  ఓ సారి ట్రైనింగ్​కూడా  ఏర్పాటు  చేశారు.   రైతులతో,  నిపుణులతో  ట్రైనింగ్​ క్లాసులు నిర్వహించటం,  తీగ జాతి కూరగాయల సాగుకు అవసరమైన పందిళ్లు,   కూరగాయల నిల్వకు బుట్టలు ,  మల్చింగ్​కవర్లు,  సోలార్​ సిస్టమ్​,  స్థానికంగా  మార్కెటింగ్​ సౌకర్యం కల్పించేందుకు  ప్లాన్​ తయారు చేశారు.  హార్టికల్చర్​ ఉన్నతాధికారులకు  ప్రపోజల్స్​  వెళ్లినప్పటికీ  ఇప్పటి వరకు  కార్యరూపం దాల్చలేదు.   ప్రస్తుతం ఇక్కడ ట్రైనింగ్​లు కూడా నిర్వహించటం లేదు.    దీంతో ఈ గ్రామంలో కూరగాయల సాగు విస్తీర్ణం పెరగలేదు.

రైతులకు అవగాహన కల్పిస్తున్నాం

కూరగాయాల సాగు పెంచేందుకు  రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. శివాయిపల్లిని  పైలట్  ప్రాజెక్టుగా  ఎంపిక చేసి  ప్రపొజల్స్​  పంపాం.  రైతులకు ట్రైనింగ్​ ఇచ్చాం.  ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే  పక్రియ షూరు చేస్తాం.  

రాజు, హార్టికల్చర్ ఆఫీసర్,  కామారెడ్డి  డివిజన్​  ​