తెలంగాణకు ఎండల హై అలర్ట్.. టెంపరేచర్లు 45 దాటొచ్చు

తెలంగాణకు ఎండల హై అలర్ట్.. టెంపరేచర్లు 45 దాటొచ్చు

హైదరాబాద్, వెలుగు : ఏప్రిల్, మే నెలల్లో ఎండలు 45 డిగ్రీలు దాటే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో వడదెబ్బ, డీ-హైడ్రేషన్ కు గురికాకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లాల కలెక్టర్లను సీఎస్  శాంతి కుమారి ఆదేశించారు. రాష్ట్రంలో తాగునీటి సరఫరా, అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో చేపట్టాల్సిన ముందుజాగ్రత్త చర్యలు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, ధాన్యం కొనుగోలు అంశాలపై కలెక్టర్లతో సోమవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

ఈ రెండు నెలల్లో ఉమ్మడి జిల్లాలైన ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంలో టెంపరేచర్లు 45 డిగ్రీలకు చేరవచ్చని, వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా ముందుజాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే రాష్ట్రంలో మంచినీటి సరఫరాను మరింత సమర్థవంతంగా చేసేందుకు ప్రతి మండల, గ్రామ స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమిస్తామని సీఎస్  తెలిపారు. స్థానిక సంస్థల అడిషనల్  కలెక్టర్  ఆధ్వర్యంలో మొత్తం జిల్లాలో మంచినీటి సరఫరాను అధికారులు పర్యవేక్షించాలన్నారు. 

ధాన్యం కొనుగోలుకు 7,149 కేంద్రాల ఏర్పాటు

రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోలుకు 7,149 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, మరో నాలుగైదు రోజుల్లో ఈ కేంద్రాలన్నీ ప్రారంభమవుతాయని సీఎస్  చెప్పారు. ఇప్పటికే, ప్రారంభమైన కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. గ్రామాల్లో ప్రైవేటు కాంటాలను తెరిచి ఎంఎస్పీ కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేసే వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్  ఆదేశించారు. రాష్ట్రంలో ‘మనఊరు -మనబడి’ కార్యక్రమం కింద అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో  చేపడుతున్న పనులన్నింటినీ సంబంధిత ఏజెన్సీల ద్వారా వెంటనే ప్రారంభించి, వాటి పురోగతిని పర్యవేక్షించాలని కలెక్టర్లను సీఎస్  ఆదేశించారు.