సంశయం లేకుండా పని చేస్తే.. విజయం వరిస్తుంది

సంశయం లేకుండా పని చేస్తే.. విజయం వరిస్తుంది

కార్యసాధకునికి సమయస్ఫూర్తి, విచక్షణా జ్ఞానం, ఆలోచన, మంచిచెడుల గురించిన పూర్తి అవగాహన, జయాపజయాలకు సిద్ధపడటం.. ఇటువంటి ఎన్నో లక్షణాలు ఉండితీరాలి. అప్పుడు తలపెట్టిన పని విజయవంతంగా పూర్తవుతుంది. ఇందుకు చక్కని ఉదాహరణ రామాయణంలో హనుమంతుడు. 

హనుమంతుడిని అనుసరించి, ఆయన వెంట నడుస్తుంటే, పనులను ఏ విధంగా సఫలం చేసుకోవాలో అర్థం అవుతుంది. వాల్మీకి రామాయణం సుందరకాండలో హనుమంతుడు సీతమ్మవారిని వెతకటం కోసం లంకా నగరం చేరుకున్నాడు. లంక అంతా వెతికాడు. ఎక్కడా కనపడలేదు. సీతమ్మ కనపడకుండా వెనుకకు వెళితే, సుగ్రీవుడు కోప్పడతాడు.. అని ఆలోచిస్తుండగా, సీతమ్మవారు అశోకవనంలో శింశుపా వృక్షపు నీడలో కనిపించింది. ఆనందంతో మనసు పరవశించింది. కానీ ఆవిడ దగ్గరకు వెంటనే వెళ్లడానికి కుదరదు. ఏ విధంగా ప్రవర్తిస్తే సీతమ్మను చూశాననే విషయం రాముడికి చెప్పగలను అని ఆలోచించాడు.

‘నేను ఇక్కడే ఉండి, ఆ రాక్షస స్త్రీలు కొంచెం ఏమరుపాటుగా ఉన్న సమయంలో దుఃఖిస్తున్న సీతమ్మను ఓదారుస్తాను. ఆ సమయంలో నేను సంస్కృతంలో మాట్లాడితే, రావణాసురుడని సీతమ్మ భయపడవచ్చు. అందువల్ల నేను స్పష్టంగా అర్థమయ్యేలా మనుష్యవాక్కులో మాట్లాడాలి. అలా కాకుండా వేరేలా మాట్లాడితే, నా రూపం చూసి... సీత మరింత భయపడుతుంది. నన్ను రావణాసురుడని భావించవచ్చు కూడా. ఆ భయంలో సీతమ్మ బిగ్గరగా అరిస్తే, అక్కడే ఉన్న రాక్షస స్త్రీలంతా ఆయుధాలు ధరించి గుమిగూడి, నన్ను చంపడానికి ప్రయత్నం చేయవచ్చు.

 రావణాసురుని భవనంలో ఉండే మిగిలిన రాక్షసులు కూడా వెంటనే శూలాలు, ఖడ్గాలు, శక్తులు వంటి ఆయుధాలు ధరించి రావచ్చు. వారందరూ నన్ను చుట్టుముట్టడంతో నేను సముద్రపు ఆవలి తీరానికి చేరుకోలేకపోతాను. లేదంటే రాక్షసులలో కొందరు నా మీదకు దూకి నన్ను పట్టుకుంటే, సీతమ్మకు నేను వచ్చిన సంగతి కూడా తెలియకుండాపోతుంది. ఈ రాక్షసులు సీతమ్మను చంపివేయవచ్చును. అలా జరిగితే రామసుగ్రీవులు ఏ పని మీద నన్ను పంపారో, ఆ పని నెరవేరదు. సీతమ్మ లంకలో రహస్యమైన ప్రదేశంలో ఉంది. నేను వెళ్లి చెప్పకపోతే ఈ ప్రదేశాన్ని ఎవ్వరూ కనిపెట్టలేకపోతారు. 

ఇక్కడ ఉన్న రాక్షసులను సంహరించగలిగే శక్తి నాకుంది. అంత యుద్ధం చేశాక, నేను సముద్రం దాటలేకపోవచ్చు. యుద్ధంలో జయాపజయాలు దైవాధీనాలు. నాకు సంశయం ఇష్టం లేదు. బుద్ధిమంతుడెవడైనా సంశయం లేని పనిని సంశయాస్పదంగా చేయునా? అని భావించాడు. ఇంకా నేను సీతమ్మతో మాట్లాడకుండా వెళితే, ఆమె ప్రాణత్యాగం చేసే అవకాశం ఉంది. ఇప్పుడు సీతమ్మతో మాట్లాడితే నాకు ఆపద కలగవచ్చు. ఫలితం లభించగల కార్యం, వివేకం లేని దూత చేతిలో పడితే, అది విఫలం అవుతుంది. 

ఎందుకంటే... పండితులం అనే దురభిమానం గల దూతలు పనిని చెడగొడతారు. ఇప్పుడు నేను ఏ విధంగా ప్రవర్తిస్తే కార్యం చెడిపోకుండా ఉంటుందో సరిగ్గా ఆలోచించాలి. నేను సముద్రం దాటి ఇంత దూరం వచ్చినందుకు ప్రయోజనం కలిగేలా చూసుకోవాలి. సీతమ్మ నా మాటలు విని భయపడకుండా ఉండేలా మాట్లాడాలి’’ అని పరిపరివిధాలుగా ఆలోచిస్తున్న హనుమంతుడు..  చెట్టు కొమ్మల మధ్య దాగుండి, సీతమ్మను చూస్తున్నాడు.

రామాయణం, సుందరకాండలోని ఇరవై తొమ్మిదో సర్గలో హనుమంతుని ఆలోచన గురించి ఈ విధంగా వివరించాడు వాల్మీకి. ఇది హనుమంతునికే కాదు, కార్యసాధకులందరికీ ఉపయుక్తంగా ఉంటుంది. ఎవరితో, ఎక్కడ, ఎంత, ఎలా మాట్లాడాలి అనే విషయాన్ని హనుమంతుడు తన ప్రవర్తన ద్వారా చూపాడు. అందుకే రాయబారులుగా వెళ్లేవారు, యుద్ధ సమయాలలో సంధి కుదర్చడానికి వెళ్లేవారు ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలి. ఒక్క అక్షరం కాని, ఒక్క పదం కాని తేడా రాకుండా జాగ్రత్తపడాలి. అప్పుడే కార్యం సఫలం అవుతుంది. 

పంచతంత్రంలో ‘సింహము – కుందేలు’ కథ తెలిసినదే. తన చాకచక్యమైన మాటలతో ప్రాణాపాయం నుండి తప్పించుకుంది. అలాగే ‘కొంగ – ఎండ్రకాయ’ ‘మొసలి – కోతి ’... ఇటువంటి ఎన్నో కథలు మనకు వ్యక్తిత్వ వికాసాన్ని బోధిస్తూ, ఆపదలలో ఏ విధంగా ప్రవర్తిస్తే బయటపడతామో తెలియజేస్తాయి. .

- డా. పురాణపండ వైజయంతి-