ఏ అన్యాయం జరిగినా ధైర్యంగా ఎదుర్కోవాలి: సునీతాలక్ష్మారెడ్డి

ఏ అన్యాయం జరిగినా ధైర్యంగా ఎదుర్కోవాలి: సునీతాలక్ష్మారెడ్డి

నిజామాబాద్ సిటీ, వెలుగు: మహిళల రక్షణ, భద్రత కోసం అమలు చేస్తున్న చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, అలాంటప్పుడు ఏ అన్యాయం జరిగినా ధైర్యంగా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వి.సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. మహిళల హక్కులు, జీవన స్థితిగతులు మెరుగుపర్చేందుకు కమిషన్  కృషి చేస్తోందన్నారు. మహిళలకు అన్యాయం జరిగిన సందర్భాల్లో బాధితులకు భరోసా కల్పిస్తున్నామన్నారు. సోమవారం నిజామాబాద్ కలెక్టరేట్​లో వివిధ శాఖల అధికారులతో ఆమె రివ్యూ చేశారు. మహిళల రక్షణపై జరిగిన సెమినార్ లో మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో కమిషన్​ మెంబర్లు  షాహీన్, రేవతి, సూదం లక్ష్మీ, పద్మ, ఈశ్వరీ బాయి, ఉమాదేవి పాల్గొన్నారు. మహిళలు  అందరితో సమానంగా చదువుకుని అన్ని రంగాల్లో రాణిస్తున్నారని,  అయినా  అక్కడక్కడ  వివక్ష కొనసాగుతోందన్నారు.  మహిళలపై  దాడులు, దౌర్జన్యాలను అరికట్టేందుకు  ప్రత్యేక చట్టాలున్నాయని,  వీటి  గురించి పూర్తిగా తెలియక చాలామంది తమకు జరిగిన అన్యాయాన్ని  బయటకు చెప్పుకోలేకపోతున్నారని అన్నారు. ఈ పరిస్థితి మారాలని, ఇందుకు అధికారులు, మహిళాసంఘాలు కృషి చేయాలన్నారు. మహిళలతో పాటు  పురుషులకు కూడా ఈ చట్టాలపై  అవగాహన ఉన్నప్పుడే మంచి  ఫలితాలు వస్తాయని అన్నారు. బాలికల పట్ల వివక్ష మానేయాలని,  వారికి నచ్చిన రంగాల్లో  ఎదిగేందుకు సహకరించాలని  సూచించారు. మహిళాచట్టాలు దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. కాలేజీల దగ్గర షీ టీం నిఘా ఏర్పాటు చేయాలని, యాంటీ ర్యాగింగ్ కమిటీలను నెలకొల్పాలని సంబంధిత అధికారులకు సూచించారు.

వివాహాల రిజిస్ట్రేషన్ చేసుకుంటే  విదేశాలకు వెళ్లిన సమయాల్లోనూ వేధింపులు, అన్యాయాలు జరిగితే రక్షణ పొందే వీలుంటుందన్నారు.   వరకట్న హత్యలు, అత్యాచార ఘటనల్లో బాధితులకు పరిహారం అందేలా  సంబంధిత అధికారులు చొరవ చూపాలన్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇ-మెయిల్,  వాట్స్ యాప్  ద్వారా మహిళలు కమిషన్ కు ఫిర్యాదు చేయవచ్చని చైర్ పర్సన్ సూచించారు. 181 హెల్ప్ లైన్  ద్వారా  సహాయం పొందవచ్చని అన్నారు.   షాదీముబారక్, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, ఆరోగ్య లక్ష్మిస్కీమ్​ల్లో  లోటుపాట్లు ఉంటే కమిషన్ దృష్టికి తేవాలన్నారు. జడ్పీ  చైర్మన్ డి. విఠల్ రావు, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్ ఆకుల లలిత, నగర మేయర్ దండు నీతూకిరణ్, అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్,  మహిళా కమిషన్ డైరెక్టర్ శారద, జిల్లా కమిటీ చైర్ పర్సన్ నీరజారెడ్డి,  అధికారులు,  పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని బాలసదన్ శిశు గృహం, సఖి సెంటర్, స్వధర్ హోం లను మహిళా కమిషన్ బృందం సందర్శించింది. వసతి పొందుతున్న చిన్నారుల బాగోగుల గురించి ఆరా తీశారు. హోంలలో  మెనూ పరిశీలించారు.  వంటగది, స్టోర్ రూమ్​లు  తనిఖీ చేశారు. చిన్నారులను ఆప్యాయంగా పలకరిస్తూ చైర్​పర్సన్ సునీత లక్ష్మారెడ్డి చాక్లెట్లను పంచిపెట్టారు.