అక్రమార్కులకు అనుకూలంగా ఎన్వోసీలు,రిపోర్టులు

అక్రమార్కులకు అనుకూలంగా ఎన్వోసీలు,రిపోర్టులు

సంగారెడ్డి/రామచంద్రాపురం, వెలుగు :  సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​ పరిధిలో ఇరిగేషన్ ​ఆఫీసర్ల నిర్లక్ష్యంతో చెరువు, కుంటలు కనుమరుగవుతున్నాయి. ఇదే అదునుగా కొందరు రూ.కోట్లు విలువ చేసే భూములను కబ్జా చేస్తున్నారు. ఎకరాల కొద్దీ ఎఫ్​టీఎల్, బఫర్ జోన్లు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్తున్నాయి. కొన్నేండ్లుగా అమీన్​పూర్ మున్సిపాలిటీ పరిధిలో మాయమవుతున్న ఎఫ్​టీఎల్​జాగల తతంగంలో కొందరు ఇరిగేషన్ ఆఫీసర్ల చేతివాటం ఉందనే చర్చ నడుస్తోంది. విలువైన ప్రభుత్వ స్థలాలు కబ్జాలు కావడంతోపాటు భవిష్యత్​తరాలను సమస్యల వలయంలోకి నెట్టే పరిస్థితులు నెలకొంటున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

అమీన్​పూర్​ మండలం కిష్టారెడ్డిపేట పరిధిలోని నక్కలపాడు కుంట అలియాస్ దూదేకుల కుంట ఎఫ్​టీఎల్​ లిమిట్​ను ఇరిగేషన్​అధికారులు పూర్తిగా మార్చేశారు. సర్వే నంబర్ 131, 132 లో ఉన్న దాదాపు 30 గుంటల భూమిని ఎఫ్​టీఎల్​లో ఉన్నట్లుగా హెచ్​ఎండీఏ గుర్తించింది. అయినా కొందరు లోకల్​ఇరిగేషన్ అధికారులు కాసులకు కక్కుర్తి పడి ఎఫ్​టీఎల్​లో ఉన్న సదరు భూములకు ఎన్​వోసీలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే హెచ్​ఎండీఏ రిపోర్ట్​ ఆధారంగా అక్కడ నిర్మాణాలకు ఇచ్చిన పర్మిషన్లను గతంలో గ్రామ పంచాయతీ రద్దు చేసినా ఇప్పుడు తప్పుడు ఎన్​వోసీతో యథేచ్ఛగా నిర్మాణాలు కొనసాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. 

అమీన్​పూర్​ మున్సిపాలిటీ పరిధిలోని బంధంకొమ్ము చెరువు, పరీవాహాక ప్రాంతాలు, కాల్వలు, ఎఫ్​టీఎల్​ పరిధిలో కొందరు ఇరిగేషన్​ అధికారుల తప్పిదంతో వాటి స్వరూపాన్ని కోల్పోతున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం క్షేత్ర స్థాయి పరిశీలన కూడా చేయకుండా బంధంకొమ్ము ఎఫ్​టీఎల్​కు క్లియరెన్స్​ ఇచ్చి జేబులు నింపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వే నంబర్ 276, 277, 314, 315 లోని ఇన్ ​ఫ్లో కాల్వలను ఓ కన్​స్ర్టక్షన్స్​ సంస్థ, అలాగే సర్వే నంబర్లు 469, 470, 475 లో ఉన్న అవుట్​ ఫ్లో కాల్వలను మరో కన్​స్ర్టక్షన్​ సంస్థ పూర్తిగా ఆక్రమించిన వ్యవహారంలో కొందరి ఇరిగేషన్ అధికారులదే కీలక పాత్ర ఉన్నట్లు సమాచారం. మరోవైపు బంధంకొమ్ము ఎఫ్​టీఎల్​ను దాదాపు రెండకరాల మేర ఆక్రమించి నిర్మించిన ఇళ్లకు కూడా ఆ ఆఫీసర్లే ఎన్​వోసీలు ఇచ్చినట్లు చర్చ నడుస్తోంది. 

హెచ్​ఎండీఏ మ్యాప్​లను లెక్కచేయట్లే.. 

అమీన్​పూర్ మండలం పటేల్​గూడ గ్రామంలోని పటేల్ చెరువు బఫర్ ​జోన్ వ్యవహారంలో హెచ్​ఎండీఏ అధికారులు ఫైనల్​ చేసిన మ్యాప్​ను లోకల్​ ఇరిగేషన్ శాఖ పూర్తిగా మార్చివేసిందనే విమర్శలు ఉన్నాయి. చెరువు చుట్టూ బఫర్​ జోన్​ను 30 మీటర్లుగా హెచ్​ఎండీఏ గుర్తిస్తే, స్థానిక ఇరిగేషన్ అధికారులు దానిని 10 మీటర్లకు కుదించి అక్రమార్కులకు దోచి పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, దానికి ఎన్​వోసీలు కూడా జారీ చేశారని  పలువురు ఆరోపిస్తున్నారు. సర్వే నంబర్ 993/40లో లేని చెరువును సృష్టించిన ఘనత ఇక్కడి ఇరిగేషన్ అధికారులకే దక్కిందని మండిపడుతున్నారు.  2014 వరకు లేని చెరువును తీసుకొచ్చి అక్కడ బీహెచ్​ఈఎల్​ లేక్​ ఉన్నట్లు ఇష్టానుసారం నివేదిక ఇవ్వడంతో ప్రభుత్వం నుంచి 1970 లో స్థలాలు పొందిన పేదలకు అన్యాయం జరుగుతోందంటున్నారు. 

చర్యలు తీసుకుంటున్నాం.. 
ఎఫ్​టీఎల్, బఫర్​జోన్ల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. క్షేత్ర స్థాయిలో పర్యటించి బౌండరీస్ ఫిక్స్ చేస్తాం. తమ దృష్టికి వచ్చిన ప్రతి ఫిర్యాదుపై స్పందిస్తున్నాం. ఇరిగేషన్ శాఖ నుంచి జారీ చేసిన ఎన్​వోసీలను మరోసారి పరిశీలిస్తాం. చెరువులు, కుంటలు కబ్జాలు కాకుండా ఇప్పటికే పరిధులు ఏర్పాటు చేశాం. 
-  ప్రసాద్, ఏఈ, ఇరిగేషన్, అమీన్​పూర్​