దశాబ్ద పాలనలో ఉద్యమ ఆకాంక్షల అణచివేత 

దశాబ్ద పాలనలో ఉద్యమ ఆకాంక్షల అణచివేత 

తొమ్మిదిన్నర ఏండ్ల కాలంలో మన ప్రయాణం ఉద్యమ ఆకాంక్షల సాధన దిశగా ముందడుగు వేసిందా అని ప్రతి తెలంగాణ బిడ్డ వివేచన చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమ ట్యాగ్‌‌లైన్‌‌గా నీళ్ళు, నిధులు, నియామకాలు అనే మూడు పదాల్ని స్థిరపరిచే ప్రయత్నం జరిగింది కానీ.. తెలంగాణ స్వేచ్ఛ కోసం పోరాడింది. ప్రజాస్వామ్యం కోసం , సామాజిక న్యాయం కోసం, అసమానతల నివారణ కోసం, స్వీయ గౌరవం కోసం పోరాడిన లక్ష్యాల అమలే ప్రశ్నార్థకమైంది. అరకొర అమలైన చోట అవినీతి, అణచివేత రాజ్యం ఏలాయి.  స్వరాష్ట్ర సాధనకు ప్రాణాలిచ్చిన వారిని లెక్కలోకి తీసుకోలేదు. కనీసం అ కుటుంబాలకు పరామర్శ కూడా దక్కలేదు.

తెలంగాణ స్వరాష్ట్ర సాధన పోరాటం.. ‘నయా ఉదారవాదంగా’ ముందుకు తెచ్చిన నూతన ఆర్థిక విధానాలకు ప్రయోగశాలగా మారింది. తీవ్ర నిర్బంధాన్ని కరువు కాటకాలను, వలసలను అనుభవించిన తెలంగాణ వేరుపడిపోతే కాస్తయినా స్వేచ్ఛ దొరుకుతుందని ప్రజలు ఆశపడ్డారు. భూస్వామ్య అణచివేత నుంచి బయటపడి స్వీయగౌరవంతో మానవ నాగరికతా వికాస చరిత్రలో భాగం కాగలుగుతామని ఆశపడ్డారు. అందుకే భిన్న అస్తిత్వాల తెలంగాణ సమాజమంతా ఏక కంఠంగా జై తెలంగాణ నినాదం అందుకుంది. ఆ నినాదం వెలుగులో తెలంగాణ తన చరిత్రనంతా తవ్వి తలకెత్తుకుంది. తన సాహసానికి, అణచివేతలో అనుభవించిన దైన్యానికి పాటలు కట్టి పాడుకుంది. పరిస్థితులు మారలేదు. కానీ, పదేండ్ల పాలన ఆ పాటలను, ఆ మాటలను, ఆ ఆకాంక్షలను కనుమరుగు చేసింది. అస్తిత్వాన్ని వ్యక్తిగత ఘనతగా చెప్పుకున్నారు.

అస్తిత్వాన్ని వ్యక్తిగత ఘనతగా..

ఒక జాతి యావత్తూ కదిలి నిర్మించిన పోరాట చరిత్రను తమ వ్యక్తిగత ఘనతగా చెప్పుకుంటున్న ఈ కాలపు పాలన.. తెలంగాణ త్యాగాల చరిత్రకు మసిబూసి మసకబార్చే ప్రయత్నం చేసింది. తన పొత్తిళ్ళలోని ఆటపాటల బిడ్డలు, పోరాట చరిత్రకు త్యాగాల చాలుపోసిన బిడ్డలు ఇందుకోసమేనా ఇంతటి త్యాగాలు చేసింది అని తెలంగాణ దు:ఖపడుతున్నది. 

అప్పులు, అమ్మకాలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మూడోసారి రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగబోతున్నాయి. ఎన్నికల తరువాత 2014 జూన్‌‌ నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినపుడు ప్రభుత్వం దగ్గర మిగులు బడ్జెట్‌‌ ఉంది. ఈ పదేండ్లలో ప్రభుత్వం ఆరులక్షల కోట్లకు పైబడి అప్పులు చేసింది. తెలంగాణ పౌరులందరి మీద అప్పుల భారం మోపింది. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికవర్గాల పొదుపు మొత్తాలన్నీ అప్పుగా తీసేసుకుంది. అందుకు ఎవరి అనుమతి తీసుకోలేదు. ఎవ్వరూ తాము దాచుకున్న డబ్బు తాము తీసుకోలేకపోతున్నారు. మెడికల్‌‌ బిల్లుల చెల్లింపులూ జరగటం లేదు. అప్పులెందుకు చేశారు అంటే కేంద్రం చేయటం లేదా అంటున్నారు. అటు బీజేపీ కేంద్రం, ఇటు రాష్ట్రం ప్రజల వనరులు, ఆస్తులు ప్రజలు అభివృద్ధి చేసిన ఆస్తులు అమ్ముతున్నారు. 

పథకాల కన్నా, అమ్ముతున్న మద్యం ఎక్కువ

విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు పెంచిన రాష్ట్రప్రభుత్వం ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాల కన్నా ప్రజల నుంచి ఎక్కువే లాగుతున్నది. విపరీతంగా పెరిగిపోతున్న అన్ని నిత్యావసరాల ధరలు ప్రజల నిజ ఆదాయాలను, కొనుగోలు శక్తిని దెబ్బతీస్తున్నాయి. కుటుంబాలు, నిత్య అవమానాల మధ్య జీవితం గడుపుతున్నాయి.గత్యంతరం లేని పరిస్థితిలో అత్మహత్యలకు పాల్పడుతున్నాయి. చిరుద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు, కౌలురైతులు, నిర్వాసితులుఈ పదేండ్లలో పెద్ద సంఖ్యలో ఆత్మహత్యల పాలయ్యారు.

ప్రభుత్వ విధానాల వైఫల్యంతో జరిగే ఈ ఆత్మహత్యలను తెలంగాణ సమాజం ప్రభుత్వ హత్యలుగానే పరిగణించింది. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిజాలు మరుగుపరిచి అబద్ధాలతో అభివృద్ధి ప్రచారం చేసుకుంది. మునుపెన్నటికన్నా కూడా తెలంగాణ సమాజం అబద్ధాలతో పోరాడవలసి వచ్చింది. నిజాల ప్రచారానికి ఎంతో శ్రమపడవలసి వచ్చింది.

పదేండ్లయినా కృష్ణా నీళ్లు దక్కింది లేదు

అసలు ఈ తెలంగాణ పోరాటమే కృష్ణానదీ జలాల వాటా కోసం మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వాటా నీరు సాధించలేకపోయింది. పైగా పక్క రాష్ట్రాలకు పోయి కృష్ణా, గోదావరి నీళ్ళు మలుపుకొని పొమ్మని చెప్పి వచ్చింది. ఇపుడు ఏకంగా లోలోపల నదుల అనుసంధానానికి తలూపుతున్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నీటి పంపిణీయే జరగకుండా నదుల అనుసంధానం జరిగితే ఎగువ తెలంగాణకు దక్కేదేమీ వుండదు. దక్షిణ తెలంగాణ ప్రధాన నీటివనరైన కృష్ణానది తీవ్ర వివాదాలలో ఉన్నా తెలంగాణ ప్రభుత్వం తొలి ప్రాధాన్యతతో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల చేపట్టలేదు.

రీ డిజైన్‌‌ పేరిట దిగువకు మార్చింది. ఇపుడు మహబూబ్‌‌నగర్‌‌ పార్లమెంటు నియోజకవర్గానికి ప్రక్కన చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గానికి చుక్కనీరు దక్కకుండా చేసింది. ఇంకోవైపు ప్రాణహిత చేవెళ్ళను కాళేశ్వరం పేరున రీడిజైన్‌‌చేసి చేవెళ్ళకు నీళ్ళు రాకుండా చేసింది. కేవలం రియల్‌‌ ఎస్టేట్‌‌ మాఫియా ప్రయోజనం కోసం రైతులకు నీరు దక్కకుండా పోయింది. కాళేశ్వరం కుంగిపోతున్నది. ఎనిమిదేండ్ల పాటు పనులు జరుగుతున్నట్టు చేసి, ముప్పై శాతం పనులు చేసి అసంపూర్తి పాలమూరు పథకాన్ని కోట్ల ప్రచారంతో అట్టహాసంగా ప్రారంభించింది. ఆ మరునాడే ఆ పంపు దుంకడం ఆగిపోయింది. అవినీతి ప్రవాహం తెలిసిందే కదా.

నిర్బంధ పాలన

తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు ప్రభుత్వ పాలనా విధానాలు వేరు కావటం వల్ల పాలనలో అవినీతికి, బంధుప్రీతికి, మాఫియాల ప్రయోజనాలకి ప్రాధాన్యత పెరగటం వల్ల ప్రభుత్వం అబద్దాన్ని, నిర్బంధాన్ని ఆశ్రయించింది. ప్రశ్నలు తలెత్తకుండా చూసుకుంది.  ప్రభుత్వం తెలంగాణ సమాజాన్ని పలు విధాలుగా లోబరుచుకుంది. అణచివేతకు గురిచేసింది. రౌడీషీట్లు తెరవటం, బైండోవర్లు చేయటం, అక్రమ కేసులు పెట్టటం,  సంఘాల మీద నిషేధాలు, ప్రజాస్వామిక చైతన్యం గలవారి మీదికి ఎన్​ఐఏ ప్రయోగాలు, ఉపా కేసులు ఇలా తెలంగాణను తమ బందీగా మార్చుకున్నారు. నారాయణపేట జిల్లా రైతాంగం చిత్తనూరు ఇథనాల్‌‌ కంపెనీ ఎత్తివేయాలని శాంతియుతంగా చేసిన ఆందోళనపై పోలీసులు జరిపిన పాశవిక హింసాకాండ, అక్రమ కేసులు పరాకాష్టగా మారాయి. పోరాడి సాధించుకున్న తెలంగాణ ఇట్లవుతుందని ఏ ఉద్యమకారుడూ అనుకోలేదు.

ఇప్పటికీ కరువు జిల్లాలే..

విశ్వవిద్యాలయాల చర్చలో ఉండిన తెలంగాణ రాష్ట్ర సాధన చర్చ 1995లో మహబూబ్‌‌నగర్‌‌ బీడు భూములకు సాగునీటి కోసం నేలమీదికి రాక తప్పలేదు. తెలంగాణ ఉద్యమకాలమంతా మహబూబ్‌‌నగర్‌‌ కరువు, వలసలు, ఆర్‌‌డీఎస్​ దుస్థితి, కృష్ణా నది నీటి వాటా కేంద్రంగా విస్తారమైన చర్చ జరిగింది. ఆ చివరన మంచి వర్షపాతం ఉండి ఆదిలాబాద్​, ఈ చివరన అరకొర వర్షపాతం ఉండి మహబూబ్‌‌నగర్‌‌  రెండూ ఈ నాటికీ కరువు జిల్లాలే. ఇటీవల నీతి ఆయోగ్‌‌ నివేదిక అంకెలతో ఈ నిజం చెప్పినా తగు న్యాయం కోసం ఏ ప్రభుత్వమూ ఒక్క ప్రత్యేక చర్య కూడా చేపట్టలేదు. ఈ పదేండ్లపాటు మహబూబ్‌‌నగర్‌‌ వలసలు ఆగిపోయినాయి అని ప్రచారం చేసిన పాలకులు ఇపుడు తమ తమ నియోజక వర్గాల వలస ప్రజలను కలుసుకోవటానికి హైదరాబాదులో పొరుగు రాష్ట్రాల్లో ఆత్మీయ సమ్మేళనాలు జరుపుతున్నారు. ప్రతిపక్ష పార్టీలు కూడా ఇదే పనిలో ఉన్నాయి.

పాలమూరు అధ్యయన వేదిక ఎజెండా

పాలమూరు అధ్యయన వేదిక 2014లో, 2018లో మహబూబ్​నగర్‌‌ భవిష్యత్తు కోసం ఒక ప్రజా ఎజెండా విడుదల చేసింది. ఈసారి కూడా అక్టోబర్‌‌ 2, 3 తేదీలలో  సత్యాగ్రహ శిబిరంలో 100 డిమాండ్లతో ఒక ఎజెండా విడుదల చేసింది. ఆ డిమాండ్లు అన్ని పార్టీలకు, అభ్యర్థులకు పంపించాం. తెలంగాణలో ఈ తొమ్మిదేండ్ల పాలన మీద చాలా చర్చ జరుగుతున్నది. మత విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీలు కానీ, మాఫియాల వర్గ పునాదితో పనిచేసే పార్టీలు కానీ తెలంగాణకు మేలు చేయవని ప్రజల మధ్య చర్చ కోసం తెలంగాణ పీపుల్స్‌‌ జేఏసీ, జాగో తెలంగాణ, భారత్‌‌ బచావో, టీఎస్‌‌డీఎఫ్‌‌, సమూహ, టిఎస్‌‌ఎంఎఫ్‌‌ వంటి అనేక వేదికలు ఏర్పడి పనిచేస్తున్నాయి.

ALSO READ : టీడీపీ ఓట్ల కోసం బీఆర్​ఎస్ ​vs కాంగ్రెస్​.. పచ్చ జెండాలతో పోటాపోటీ ప్రచారం

పాలమూరు అధ్యయన వేదిక కూడా తెలంగాణ ఉద్యమకాలంలో లాగే ఈ అన్ని వేదికలతో సంఘీభావంగా ఉంటూ ఉమ్మడి జిల్లా పరిధిలో సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తున్నది. ప్రత్యేకమైన కృషి జరగకుండా 119 నియోజకవర్గాల వసతులలో, సౌకర్యాలలో అసమాన పరిస్థితులు మారవు. అసమానతల తీవ్రత కారణంగానే మనం పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణలో అంతర్గత అసమానతల నివారణ కోసం, అణచివేత, హింసలేని స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పోరాడుదాం. 

వనరులు చేతులు  మారడమే మోడలా?

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలలో పోటీపడుతున్న పార్టీలు సంక్షేమ పథకాల ప్రకటనలో కొంత పోటీపడుతున్నాయి. తమ జీవన పరిస్థితుల వల్ల ప్రజలే పార్టీలను సంక్షేమ పథకాలు ప్రకటించక తప్పని అనివార్యతలోకి లాగారు. దోపిడీ, మాఫియా వర్గాల ప్రయోజనాలకు భిన్నంగా తెలంగాణ నిరుపేద అణగారిన ప్రజల ప్రయోజనాల కోసం ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాలను పదేండ్లుగా పాలిస్తున్న అధికార పార్టీ నుంచి ఆశించటం మరోసారి మోసపోవటమే అవుతుంది. తెలంగాణ మోడల్‌‌ అనగానే మద్యం ఏరులై పారటం, వనరులు చేతులు మారటం అని ప్రజలకు అర్థమైంది. ఇతర పార్టీలు అధికారం చేపడితే ఏం చేస్తాయో తెలంగాణ సమాజం గట్టిగా నిలదీయాలి.

 – ఎం. రాఘవాచారి,  కన్వీనర్‌‌,పాలమూరు అధ్యయన వేదిక