
మాజీ కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ యజమాని, విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాను భారత్‌కు రప్పించడం కోసం యూనైటెడ్ కింగ్ డమ్‌లో పెండింగ్‌లో ఉన్న చర్యలపై 6 వారాల్లో స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది. యూనైటెడ్ కింగ్‌డమ్‌లో ప్రత్యేక చట్టపరమైన ప్రక్రియ జరిగే వరకు మాల్యాను భారత్‌కు రప్పించలేమని కేంద్రం అక్టోబర్ 5న సుప్రీంకు తెలిపింది. మాల్యాపై కోర్టు ధిక్కరణ కేసు విచారణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా.. జస్టిస్ యుయు లలిత్, అశోక్ భూషణ్ ధర్మాసనం జరిపారు. ఆరు వారాల్లో ఈ విషయంపై స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ధర్మాసనం కోరింది. వచ్చే ఏడాది జనవరి మొదటి వారం నాటికి విచారణ వాయిదా వేసింది. సుప్రీం కోర్టులో మాల్యా తరఫు న్యాయవాది ఈసీ అగర్వాల్ పిటిషన్‌ను అంగీక రించడానికి ధర్మాసనం నిరాకరించింది. మాల్యాను భారత్ దేశానికి రప్పించే అవకాశం ప్రస్తుతం లేదని యూకే ప్రభుత్వం సూచించింది. ఇందుకు చట్టబద్ధమైన సమస్యలు ఉన్నాయని, అతన్ని రప్పించే ముందు వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని తెలిపింది. బ్రిటన్‌లో జరుగుతున్న రహస్య కార్యకలాపాల గురించి తెలియదని..దీంతో మాల్యా రప్పించడం ఆలస్యమైందని కేంద్రం సుప్రీంకు తెలిపింది.