
న్యూఢిల్లీ : ప్రభుత్వం చేపట్టిన నోట్ల రద్దు వలన వ్యవస్థలో క్యాష్ వాడకం తగ్గకపోగా పెరిగింది. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తూ 2016, నవంబర్ 8 న ప్రభుత్వం ప్రకటన చేసింది. ఆ తర్వాత నుంచి వ్యవస్థలో క్యాష్ వాడకం తగ్గుతుందని అందరూ భావించారు. దీనికి విరుద్ధంగా క్యాష్ వాడకం ఏకంగా 83 శాతం పెరిగింది. నోట్ల రద్దు వలన డిజిటల్ పేమెంట్స్ పెరుగుతాయని, బ్లాక్ మనీని అరికట్టొచ్చని గతంలో ప్రభుత్వం చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ఆర్‌బీఐ డేటా ప్రకారం, సర్క్యులేషన్‌లో ఉన్న కరెన్సీ విలువ కిందటి నెల 23 నాటికి రూ.32.42 లక్షల కోట్లకు పెరిగింది. 2016, నవంబర్ 4 న ఇది 17.74 లక్షల కోట్లుగా ఉంది. ఫిజికల్ ట్రాన్సాక్షన్లలో వాడే పేపర్ నోట్లు, కాయిన్లను కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ (సీఐసీ) గా పిలుస్తారు. కాగా, డీమానిటైజేషన్ జరిగిన తర్వాత వ్యవస్థలో క్యాష్ సర్క్యులేషన్ భారీగా పడిపోయింది కూడా. జనవరి 6, 2017 నాటికి రూ.9 లక్షల కోట్ల కరెన్సీ మాత్రమే సర్క్యులేషన్‌లో ఉంది. గత ఆరేళ్లలో ఇదే అత్యంత తక్కువ లెవెల్. నోట్లను రద్దు చేసే టైమ్‌లో సర్క్యులేషన్‌లోని కరెన్సీలో రూ.500, రూ.1,000 నోట్ల వాటా 86 శాతంగా ఉంది. జనవరి 6, 2017 లో చూసిన లెవెల్‌తో పోలిస్తే ప్రస్తుతం సర్క్యులేషన్‌లో ఉన్న కరెన్సీ ఏకంగా 260 % పెరిగింది. అదే నవంబర్ 4, 2016 న చూసిన కరెన్సీ సర్క్యులేషన్‌తో పోలిస్తే 83 % ఎగిసింది. సర్క్యులేషన్‌లోని కరెన్సీ కిందటేడాది మార్చి 31 నాటికి రూ.31.33 లక్షల కోట్లుగా ఉంది.
నోట్ల రద్దు తర్వాత 8 నెలల్లోనే..
డీమానిటైజేషన్ తర్వాత కొన్ని నెలల పాటు కరెన్సీ సర్క్యులేషన్ తక్కువ స్థాయిలోనే కొనసాగింది. కానీ, కేవలం 8 నెలల్లోనే డీమానిటైజేషన్ ముందు స్థాయిలో 85 శాతానికి చేరుకుంది. నోట్ల రద్దు తర్వాత వ్యవస్థలో క్యాష్ తగ్గిందని, బ్యాంకుల దగ్గర లిక్విడిటీ పెరిగిందని ఎనలిస్టులు పేర్కొన్నారు. బ్యాంకింగ్ సిస్టమ్‌లో లిక్విడిటీ పెరగడంతో 2016 తర్వాత వడ్డీ రేట్లు కూడా తక్కువ స్థాయిలోనే కొనసాగాయి. రిజర్వ్ బ్యాంక్ దగ్గర క్యాష్ రిజర్వ్‌లు పెరిగిపోవడం వలన ఎల్‌ఏఎఫ్, రివర్స్ రెపో రేటు ఆక్షన్ వంటివి తీసుకొచ్చి వ్యవస్థలో మిగులుగా ఉన్న కరెన్సీని అబ్జార్బ్ చేసుకోవడాన్ని ఆర్‌బీఐ మొదలు పెట్టింది.
రూ.17.74 లక్షల కోట్ల నుంచి రూ.32.42 లక్షల కోట్లకు పెరిగిన క్యాష్ ..
నోట్ల రద్దు తర్వాత నుంచి పెరుగుతూనే..
క్యాష్ సర్క్యులేషన్ డీమానిటైజేషన్ జరిగిన ఏడాది మాత్రమే తగ్గింది. తర్వాత సంవత్సరాల్లో పెరుగుతూ వస్తోంది. 2017 లో క్యాష్ సర్క్యులేషన్ 38 శాతం పెరిగి రూ.18.03 లక్షల కోట్లకు, 2019, మార్చి 31 నాటికి 17 శాతం పెరిగి రూ.21 లక్షల కోట్లకు, 2020 ముగిసే నాటికి రూ.24.20 లక్షల కోట్లకు చేరుకుంది. 2021 మార్చి 31 నాటికి రూ.28 లక్షల కోట్లకు, కిందటేడాది మార్చి 31, నాటికి రూ. 31.05 లక్షల కోట్లకు ఎగిసింది.