విజయ్​ మాల్యాకు సుప్రీంకోర్టు వార్నింగ్

 విజయ్​ మాల్యాకు సుప్రీంకోర్టు వార్నింగ్
  • రాకపోయినా ...తీర్పు ఇచ్చేస్తాం: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: విజయ్​ మాల్యాపై కోర్టు ధిక్కరణ కేసును సుప్రీం కోర్టు ఈ నెల 24 వ తేదీకి వాయిదా వేసింది. వ్యక్తిగతంగా లేదా తన లాయర్​ ద్వారా తన  ముందు హాజరవడానికి రెండు వారాల గడువు ఇచ్చింది. ఒకవేళ ఆయన కోర్టుకు హాజరు కాకపోయినా, తీర్పు ఇవ్వనున్నట్లు సుప్రీం కోర్టు గురువారం నాడు స్పష్టం చేసింది. బ్యాంకులను మోసగించడంతోపాటు, మనీలాండరింగ్​ ఆరోపణలూ ఎదుర్కొంటున్న విజయ్​ మాల్యా యూకేకి పారిపోయిన విషయం తెలిసిందే. ఆ దేశంలోనూ బెయిల్​పైనే విజయ్​ మాల్యా ఉంటున్నారు. ఈ కింగ్​ఫిషర్​ మాజీ బాస్​ గత ఐదేళ్లుగా బ్రిటన్​లోనే తలదాచుకున్నారు. లండన్​లోని విజయ్​ మాల్యా లగ్జరీ నివాసాన్ని స్వాధీనం చేసుకోవచ్చంటూ బ్యాంకుకు అక్కడి కోర్టు ఇటీవలే అనుమతి ఇచ్చింది. విజయ్​ మాల్యాను ఇండియాకు తిరిగి పంపేయడానికి తగిన ఉత్తర్వులను యూకే ప్రభుత్వం 2019 లోనే జారీ చేసింది. అప్పటి నుంచీ యూకే కోర్టులలో కేసులు వేయడం ద్వారా ఆ ప్రక్రియను మాల్యా జాప్యం చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఆ దారులన్నీ దాదాపుగా మూసుకుపోవడంతో, చిట్టచివరి ప్రయత్నంగా రాజకీయ ఆశ్రయం కావాలంటూ బ్రిటన్​ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నట్లు సమాచారం.