
దేశవ్యాప్తంగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన 'ది కేరళ స్టోరీ' సినిమా విడుదల కాకుండా స్టే ఇవ్వాలన్న వినతిని కేరళ హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. ఇక కేరళ హైకోర్టు స్టే నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఇవాళ సుప్రీంకోర్టు విచారించనుంది. ఈ నెల 5న ది కేరళ స్టోరీ దేశవ్యాప్తంగా విడుదలైంది.
సినిమా రిలీజ్ కు ముందే అంటే మే 3వ తేదీనే విడుదలను ఆపేయాలంటూ సుప్రీంకోర్టులో చాలా పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే.. సినిమా టీజర్‌ను వీక్షించిన హైకోర్టు న్యాయమూర్తులు విడుదలపై స్టేను నిరాకరించి, ఈ అంశాన్ని కేరళ హైకోర్టులోనే తేల్చుకోవాలని ఆదేశించారు.
ఈ సినిమాలో కేరళ నుంచి 32 వేల మంది యువతులను ఐసిస్‌లో చేరేలా వారి ముస్లిం స్నేహితులు ప్రలోభపెట్టారని సినిమాలో పేర్కొనడాన్ని ఖుర్బాన్ అలీ పిటిషన్‌లో ఆక్షేపించారు. ఇది సమాజంలోని వివిధ సమూహాల మధ్య విద్వేషాన్ని పెంచే విదంగా ఉందని హైకోర్టులో వాదించారు. స్టే కు కేరళ హై కోర్టు నిరాకరించడంతో.. ఇప్పుడు ఆయన సుప్రీంకోర్టు తలుపుతట్టారు. అలీ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఈ కేసులో వాదనలు వినిపించనున్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్లను విననుంది.