రూ.7 లక్షల రైతుబంధు కోసం ఈ స్థాయిలో పోరాటమా?..ఖమ్మం రైతుల న్యాయపోరాటంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం 

రూ.7 లక్షల రైతుబంధు కోసం ఈ స్థాయిలో పోరాటమా?..ఖమ్మం రైతుల న్యాయపోరాటంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం 
  •     ఖమ్మం రైతుల న్యాయపోరాటంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం
  •     తెలంగాణ ప్రభుత్వం, కలెక్టర్ సహా పలువురికి నోటీసులు
  •     తదుపరి విచారణ వచ్చే ఏడాది జనవరి 4కు వాయిదా

 

న్యూఢిల్లీ, వెలుగు: 2019లో 'రైతుబంధు' నిధులు అందని ఖమ్మం జిల్లా రైతుల సుదీర్ఘ న్యాయపోరాటంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కేవలం రూ.7 లక్షల పెట్టుబడి సాయం కోసం ఈ స్థాయిలో పోరాడటాన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. తెలంగాణ ప్రభుత్వం, వ్యవసాయ శాఖ కమిషనర్, ఖమ్మం కలెక్టర్, జిల్లా వ్యవసాయ, ట్రెజరీ అధికారులకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను జనవరి 4కు వాయిదా వేసింది.

అసలేం జరిగింది?

ఖమ్మం జిల్లా తల్లాడ, తెలగారం గ్రామాలకు చెందిన ఐదుగురు రైతులు (తూము వెంకట నారాయణ, విజయ్ కుమార్, జ్యోతి, షర్మిల, చంద్రిక)కు 2018 నుంచి 2023 వరకు అన్ని సీజన్లలో రైతుబంధు జమ అయింది. కానీ 2019 ఖరీఫ్, రబీ నిధులు మాత్రం నిలిపివేశారు. దీనిపై రైతులు హైకోర్టును ఆశ్రయించగా.. కొవిడ్ కారణంగా చిన్న రైతులకే ప్రాధాన్యత ఇచ్చామని ప్రభుత్వం బదులిచ్చింది. ఈ వాదనను తోసిపుచ్చిన సింగిల్ జడ్జి, రైతులకు నిధులు చెల్లించాలని 2024లో ఆదేశించారు. కానీ డివిజన్ బెంచ్ ఆ తీర్పును రద్దు చేయడంతో రైతులు సుప్రీంకోర్టుకు వెళ్లారు.

54 ఎకరాల రైతుకు ఇచ్చి.. మాకు ఆపారు

జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన ధర్మాసనం గురువారం ఈ పిటిషన్‌ను విచారించింది. గత ప్రభుత్వం వివక్ష చూపిందని, హుజూర్‌నగర్ ఉప ఎన్నిక సమయంలో సూర్యాపేట జిల్లాలో 54 ఎకరాలు ఉన్న రైతుకు కూడా రైతుబంధు ఇచ్చారని పిటిషనర్ల అడ్వకేట్ కోర్టు దృష్టికి తెచ్చారు. తమ హక్కు కోసమే పోరాడుతున్నామని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.