24 గంటల్లోగా ఎలక్టోరల్​ బాండ్స్ ​.. వివరాలు ఇవ్వాల్సిందే : సుప్రీంకోర్టు

24 గంటల్లోగా ఎలక్టోరల్​ బాండ్స్ ​.. వివరాలు ఇవ్వాల్సిందే : సుప్రీంకోర్టు
  • ఎస్​బీఐకి సుప్రీంకోర్టు ఆదేశం
  • బాండ్ల వివరాల వెల్లడికి గడువు కావాలన్న బ్యాంకు అభ్యర్థన కొట్టివేత
  • మార్చి 6లోగా బాండ్ల వివరాలు వెల్లడించాలని ఆదేశించినా గడువు కోరడమేంటని అసహనం
  • ఎస్​బీఐ సమర్పించిన వివరాలను మార్చి 15న ప్రకటించాలని ఈసీకి కోర్టు ఆదేశాలు

న్యూఢిల్లీ : ప్రముఖ ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా ( ఎస్​బీఐ)కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 24 గంటల్లోగా (మార్చి 12 సాయంత్రం) ఎన్నికల బాండ్ల వివరాలను సమర్పించాల్సిందేనని  కోర్టు ఆదేశించింది. ఎలక్టోరల్​ బాండ్​ వివరాల వెల్లడికి గడువు ఇవ్వాలంటూ ఎస్​బీఐ చేసిన అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈ విషయంలో గడువు కోరడంపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది.  అలాగే,  బ్యాంకు ఇచ్చే వివరాలను మార్చి 15వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా ప్రకటించాలని ఎన్నికల కమిషన్​ను ఆదేశించింది.

ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడి చేయడానికి గడువును జూన్​ 30 వరకు పొడిగించాలని కోరుతూ ఎస్​బీఐ దాఖలు చేసిన పిటిషన్​పై కోర్టు సోమవారం విచారణ జరిపింది. రాజకీయ పార్టీలకు రహస్యంగా నిధులు అందించేందుకు వీలు కల్పించే ఎలక్టోరల్​ బాండ్స్​ పథకాన్ని గత నెల 15న సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ బాండ్ల ద్వారా 2019 ఏప్రిల్​ 12 నుంచి  పార్టీలకు అందిన సొమ్ము , ఇచ్చిన దాతల వివరాలను ఈ నెల 6లోగా ఎన్నికల సంఘానికి అందించాలని ఆదేశించింది. అయితే, తాము దాతలు, గ్రహీతల వివరాలను వేర్వేరుగా భద్రపర్చామని, వాటిని సరిపోల్చి ఇచ్చేందుకు సమయం కావాలంటూ సుప్రీంకోర్టులో ఎస్​బీఐ పిటిషన్​ దాఖలు చేసింది. 

ఈ పిటిషన్​పై సీజేఐ డీవై చంద్రచూడ్​ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ జరిపింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అంత స్పష్టంగా ఉన్నా మళ్లీ గడువు పొడిగించాలంటూ పిటిషన్​దాఖలు చేయడమేంటని ధర్మాసనం అసహనం వ్యక్తంచేసింది. ఏ దాతనుంచి ఎంత మొత్తం విరాళాలు సేకరించారో తాము చెప్పమనలేదని, ఎన్ని ఎన్నికల బాండ్లు జారీచేశారో ఈసీకి వెల్లడించాలని ఆదేశించినట్లు పేర్కొన్నది.  

కోర్టు ఆదేశాలు జారీ అయ్యాక 26 రోజులపాటు మీరేం చేశారు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు. ఆ సమాచారమేది మీరు చెప్పలేదు’ అంటూ ఎస్​బీఐపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. మార్చి 12 న బ్యాంకు పనివేళలు ముగిసేలోగా ఎలక్టోరల్​ బాండ్ల వివరాలు ఈసీకి వెల్లడించాల్సిందేనంటూ తీర్పు చెప్పింది.

ఎలక్టోరల్​ బాండ్​ కేసు వివరాలు
 
2017: ఫైనాన్స్​ బిల్లులో కేంద్రం ఎలక్టోరల్​ బాండ్​ పథకాన్ని ప్రవేశపెట్టింది. 
2017 సెప్టెంబర్​ 14: ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ ‘అసోసియేషన్​ ఫర్​ డెమొక్రటిక్​ రీఫార్మ్స్’​ అనే ఎన్జీవో సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
2017 అక్టోబర్​ 3: ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. 
2018 జనవరి 2: ఎలక్టోరల్​ బాండ్​ పథకాన్ని కేంద్రం నోటిఫై చేసింది.
2022 నవంబర్​ 7:  ఏ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనైనా ఎన్నికల బాండ్లను విక్రయించే సమయాన్ని 70 నుంచి 85 రోజులకు పెంచుతూ పథకంలో కేంద్రం సవరణలు చేసింది.
2023 అక్టోబర్​ 16: ఈ పథకంపై దాఖలైన పిటిషన్లను సీజేఐ డీవై చంద్రచూడ్​ ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి  రెఫర్​ చేశారు.
2023 అక్టోబర్​ 31: సీజేఐ డీవై చంద్రచూడ్​ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణను ప్రారంభించింది.
2023 నవంబర్​ 2: తీర్పు రిజర్వ్​ చేసిన సుప్రీం
2024 ఫిబ్రవరి 15: ఈ పథకాన్ని రద్దు చేస్తూ బెంచ్​ ఏకగ్రీవ తీర్పునిచ్చింది. ఇది రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛ, సమాచారం పొందే హక్కులను ఉల్లంఘిస్తున్నదని పేర్కొంది. 
2024 మార్చి 4: రాజకీయ పార్టీలు ఎన్​క్యాష్​ చేసుకున్న ఎలక్టోరల్​ బాండ్ల వివరాలు వెల్లడించేందుకు జూన్​ 30వరకు గడువు ఇవ్వాలని ఎస్​బీఐ పిటిషన్​ దాఖలు చేసింది. 
2024 మార్చి 7: రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్​ బాండ్ల ద్వారా అందిన నిధుల వివరాలను మార్చి 6 లోగా అందించాలనే ఆదేశాలను ధిక్కరించిందని ఎస్​బీఐకి వ్యతిరేకంగా పిటిషన్​ దాఖలైంది.
 2024 మార్చి 11: ఎలక్టోరల్​ బాండ్ల వివరాల వెల్లడికి గడువు కోరుతూ ఎస్​బీఐ దాఖలు చేసిన పిటిషన్​ను సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల బెంచ్​ తిరస్కరించింది. మార్చి 12 సాయంత్రంలోగా ఆ వివరాలను వెల్లడించాలని ఆదేశించింది.