ఎమ్మెల్యే రాజా సింగ్​కు సుప్రీం నోటీసులు

ఎమ్మెల్యే రాజా సింగ్​కు సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ/హైదరాబాద్​, వెలుగు: తనపై ఉన్న క్రిమినల్ కేసులను ఎన్నికల అఫిడవిట్​లో ప్రస్తావించలేదని దాఖలైన పిటిషన్ పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్​కు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది.  నవంబర్ ఒకటి లోపు కౌంటర్ ఫైల్ చేయాలని ఆదేశించింది. ఎన్నికల అఫిడవిట్ లో కేసుల వివరాలు తెలుపలేదంటూ రాజాసింగ్​పై టీఆర్ఎస్ అభ్యర్థి  ప్రేమ్ సింగ్ రాథోడ్ వేసిన పిటిషన్ ను గతంలో రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ రాథోడ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీన్ని చీఫ్ జస్టిస్ యు.యు. లలిత్ తో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారించింది. రాజాసింగ్ పై  ఎనిమిది క్రిమినల్ కేసులు ఉన్నాయని, రెండు కేసులో చార్జ్​షీటు కూడా నమోదైందని పిటిషనర్ తరఫున సీనియర్ అడ్వకేట్ వినయ్ నవ్రే వాదనలు వినిపించారు. 

పీడీ యాక్ట్​ కేసులో నేడు అడ్వయిజరీ బోర్డు ముందుకు

రాజాసింగ్​పై పోలీసులు పెట్టిన పీడీ యాక్ట్ కేసు అడ్వయిజరీ బోర్డు ముందుకు వచ్చింది. ఎర్రమంజిల్ లోని ముగ్గురు రిటైర్డ్ జడ్జిలు, ఓ సామాజిక కార్యకర్తతో ఏర్పాటు చేసిన అడ్వయిజరీ బోర్డు కేసును పరిశీలించనుంది. ప్రొసీజర్ ప్రకారమే పీడీ యాక్ట్ ను పోలీసులు ఇంప్లిమెంట్ చేశారా..  రూల్స్ కు విరుద్ధంగా యాక్ట్ ప్రయోగించారా.. అనే వివరాలు సేకరించనుంది. ఇందుకోసం చర్లపల్లి జైలులోని రాజాసింగ్ ను గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బోర్డు సభ్యులు ప్రశ్నించనున్నారు. ఆయన స్టేట్ మెంట్ ను రికార్డ్ చేసి పోలీసులు అందజేసిన డాక్యుమెంట్లను పరిశీలిస్తారు. రాజాసింగ్ పై సిటీ పోలీసులు పీడీ యాక్ట్ పెట్టడంతో గత నెల 25 నుంచి ఆయన చర్లపల్లి జైలులోనే ఉన్నారు.