కేశవానంద భారతి కేసు..న్యాయవ్యవస్థకు దిక్సూచి

కేశవానంద భారతి కేసు..న్యాయవ్యవస్థకు దిక్సూచి

భారత న్యాయవ్యవస్థ చరిత్రలో  24 ఏప్రిల్ 1973 చిరస్థాయిగా నిలిచిపోయే రోజు.  సరిగ్గా 51 ఏండ్ల కింద భారత అత్యున్నత న్యాయస్థానం కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో తన తీర్పును వెలువరించింది.  ఒక కేసు తీర్పు వచ్చి అర్ధ శతాబ్దపు కాలం అయినా కూడా దాని గురించి ఇంకా ఎన్నో సందర్భాల్లో గుర్తు చేసుకుంటున్నాం అంటే దాని గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ కేసు తీర్పు భారత న్యాయ వ్యవస్థలో మైలురాయిగా నిలిచిపోయింది. 

స్వాతంత్ర్య  భారతదేశంలో శాసనశాఖ రాజ్యాంగాన్ని అతిక్రమించినప్పుడు ఆ రాజ్యాంగ రక్షణకు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రముఖ పాత్ర పోషిస్తోంది. రాజ్యాంగాన్ని అమలుపరిచే సమయంలో ప్రభుత్వం, న్యాయశాఖ మధ్య పలు సందర్భాల్లో వివాదాలు ఏర్పడినప్పుడు 
సుప్రీంకోర్టు  పలుమార్లు  చారిత్రాత్మ క తీర్పులు వెలురించింది. భారతదేశ న్యాయ చరిత్రలోనే,  భారత న్యాయ వ్యవస్థ మలుపు తిప్పిన అత్యంత అరుదైన కేసుగా, 
ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ రక్షణకి ఆయువు పట్టుగా నిలిచిన కేసుల్లో కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ  కేసు అగ్రభాగాన నిలుస్తోంది.  ప్రపంచ దేశాల రాజ్యాంగాలు, న్యాయ వ్యవస్థలూ ఉన్నంత కాలం ఈ కేసు ఒక దిక్సూచిగా ఉంటుంది.  కేశవానంద భారతి కేసు తీర్పు వచ్చి నేటికి 51 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

ఏమిటీ కేశవానంద భారతి కేసు?

స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో కేంద్ర ప్రభుత్వం గానీ,  రాష్ట్ర ప్రభుత్వాలు గానీ ప్రజా సంక్షేమం దృష్ట్యా, ప్రభుత్వ అవసరాల దృష్ట్యా, సంపద  కొద్దిమంది వద్ద మాత్రమే కేంద్రీకృతమై ఉండకూడదనే ఉద్దేశ్యంతో పలు భూ సంస్కరణ చట్టాలు రూపొందాయి. భూస్వాముల నుంచి భూముల్ని ప్రభుత్వాలు స్వాధీనం చేసుకున్నాయి.  భూ సంస్కరణల చట్టం- 1963 (1969 లో సవరణ) ప్రకారం కేసర్​గడ్​ జిల్లాలోని ఎదనీర్ మఠానికి చెందిన 300 ఎకరాల భూమి నుంచి దాదాపు 200 ఎకరాలను 1969లో కేరళ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.

 దీంతో  మఠానికి చెందిన 'కేశవానంద భారతి శ్రీపాద గాల్వారు' అనే స్వామీజీ  కేరళ హైకోర్టును ఆశ్రయించారు.  అప్పుడు కోర్టు 1951 రాజ్యాంగ సవరణ ప్రకారం 9వ షెడ్యూల్ లోని  భూ సంస్కరణ చట్టాల ప్రకారం ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం దృష్ట్యా భూములు స్వాధీనం చేసుకోవడం తప్పు కాదని తీర్పు ఇచ్చింది. ఈక్రమంలో కేశవానంద భారతి  'నాని భాయి పాల్కేవాలా' అనే సుప్రీంకోర్టు న్యాయవాది సహాయంతో సుప్రీంకోర్టులో 1970 మార్చి 21న రిట్ పిటిషన్ దాఖలు చేశారు. 

ఆనాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి S.N  సిక్రీ అధ్యక్షతన  దేశచరిత్రలోనే తొలిసారిగా 13 మంది న్యాయమూర్తులతో  కూడిన అతిపెద్ద రాజ్యాంగ ధర్మాసనం, 68 రోజుల సుదీర్ఘ వాదనల అనంతరం1973 ఏప్రిల్ 24 న 703 పేజీల తీర్పును వెలువరించింది.  ఈ కేసులోని 13 మంది న్యాయమూర్తులలో 7:6 నిష్పత్తిలో  అతి తక్కువ మెజారిటీతో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. 

ప్రామాణికమైన కేసు

భారత న్యాయ వ్యవస్థలో పలు న్యాయస్థానాలు చరిత్రలో నిలిచిపోయే కేసు తీర్పులు ఎన్నో ఉన్నాయి.  కానీ, ఈ కేశవానంద భారతి కేసు మాత్రం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది.  ఇప్పటికీ కూడా హైకోర్టులు గానీ,  సుప్రీంకోర్టు గానీ ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల మధ్య సంఘర్షణాయుత కేసులకు కేశవానంద భారతి  కేసును ప్రామాణికంగా తీసుకొని తీర్పులు ఇస్తున్నాయి. ఈ కేసు తీర్పు కేవలం భారత న్యాయ వ్యవస్థను మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల్లోని పలు దేశాల న్యాయ వ్యవస్థలను కూడా ప్రభావితం చేశాయి. ఆయా దేశాల న్యాయ వ్యవస్థలు సైతం పలుమార్లు కేశవానంద భారతి కేసుని ప్రామాణికంగా తీసుకొని తీర్పును వెలువరించాయి..

న్యాయ నిపుణుల భిన్నాభిప్రాయం 

సుప్రీం తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చినప్పటికీ రాజకీయ న్యాయ నిపుణులు ప్రభుత్వానికి ఈ తీర్పు చెంపపెట్టు వంటిదని భావిస్తారు. ఈ కేసులో సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం తన తీర్పును వెలువరిస్తూ..పార్లమెంట్​కి భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులతో  సహా ఏ భాగాన్ని అయినా సవరించే అధికారం ఉన్నప్పటికీ, అది రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలిగించే విధంగాఉండకూడదని  తీర్పును వెలువరించింది. ఈ కేసులో పార్లమెంట్​కి  గల రాజ్యాంగ సవరణ అధికారాలు పరిమితమైనవి  మాత్రమేనని సుప్రీంకోర్టు పేర్కొన్నది.  

అయితే, పార్లమెంట్​కి  అపరిమిత అధికారాలు ఉన్నాయని,  కోర్టులు పరిమితులు విధించడం అంటే పార్లమెంట్ రెక్కల్ని కట్టి పడెయ్యడమే అని వ్యాఖ్యానించింది. ఈ కేసు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చినప్పటికీ ఇది యావత్తు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.  ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పును ఇచ్చినందున జస్టిస్ షేలత్, జస్టిస్ హెగ్డే,  జస్టిస్. గ్రోవర్ లు  సీనియారిటీ ప్రకారం తదుపరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అర్హత ఉన్నప్పటికీ పదోన్నతి పొందలేదు. సీనియారిటీపరంగా నాలుగో స్థానంలో ఉన్న.. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన జస్టిస్ ఎ.ఎన్​. రే   ప్రధాన న్యాయమూర్తి పదవి పొందారు. ఈ అపవాదును నాటి భారత ప్రధాని ఇందిరా గాంధీ మూటగట్టుకుందని రాజకీయ విశ్లేషకుల వాదన.

నేరడిగొండ సచిన్, ఎంఏ, జర్నలిజం
 

  • Beta
Beta feature
  • Beta
Beta feature