క్యాన్సర్ మందులకు అడ్డగోలు ధరలు..కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్

క్యాన్సర్ మందులకు అడ్డగోలు ధరలు..కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్
  • రిటైల్ ధరపై 16% మించకుండా ఎమ్మార్పీపై క్యాప్!

న్యూఢిల్లీ: క్యాన్సర్ మందులతో పాటు ఇతర మందుల ధరల విషయంలో ఎమ్మార్పీకి, రిటైల్ ధరకు భారీగా వ్యత్యాసం ఉందని, అడ్డగోలు ధరలతో రోగుల కుటుంబాలపై పెను భారం మోపుతున్నారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ విషయంలో ధరల నియంత్రణకు, రిటైల్ ధరలపై 16 శాతం మించకుండా ఎమ్మార్పీ నిర్ణయించేలా నిబంధనను ఎందుకు తీసుకురాకూడదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈమేరకు మందుల ధరల నియంత్రణ, జెనెరిక్ ప్రిస్క్రిప్షన్లు, డ్రగ్స్ ప్రైసెస్ కంట్రోల్ ఆర్డర్ (డీపీసీఓ)-2013 పరిధిలోని వైద్య పరికరాల ధరల నియంత్రణకు సంబంధించిన పిటిషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. 

ఈ సందర్భంగా జస్టిస్ మెహతా మందుల ధరల్లోని తీవ్రమైన వ్యత్యాసాన్ని ఎత్తిచూపారు. సుమారు రూ. 27,000 ఎమ్మార్పీ ఉన్న ఒక క్యాన్సర్ మందు రిటైలర్‌‌‌‌కు కేవలం రూ.3,000లకే లభిస్తోందని ఉదహరించారు. ధరల్లో ఇంత భారీ స్థాయిలో వ్యత్యాసం ఉండడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కార్పొరేట్ ఆసుపత్రులు రోగులను తమ ఇన్‌‌‌‌హౌస్ ఫార్మసీల నుంచే మందులు కొనాలని బలవంతం చేస్తున్నాయని, ఆయుష్మాన్ భారత్ వంటి ప్రభుత్వ ఆరోగ్య పథకాల కింద చికిత్స అందించేటప్పుడు ఈ అదనపు భారం చివరికి పన్ను చెల్లింపుదారులపైనే పడుతోందని కోర్టు పేర్కొంది. 

ఈ అంశంపై కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ, దీనికి తగిన సమతుల్య పరిష్కారాన్ని కనుగొనాల్సి ఉంటుందని తెలిపారు. కాగా, ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను అక్టోబర్ 12కి కోర్టు వాయిదా వేసింది.