రీట్వీట్ చేసి తప్పుచేశా .. క్షమాపణ చెప్పిన కేజ్రీవాల్

రీట్వీట్ చేసి తప్పుచేశా .. క్షమాపణ చెప్పిన కేజ్రీవాల్

న్యూఢిల్లీ:  బీజేపీ ఐటీ సెల్ పరువుకు భంగం కలిగించే వీడియోను రీ ట్వీట్ చేసి తప్పు చేశానని సుప్రీంకోర్టు ఎదుట ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ సోమవారం అంగీకరించారు.  పరువు నష్టం కేసులో తనకు జారీ అయిన సమన్లను ఢిల్లీ హైకోర్టు సమర్థించడాన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంను ఆశ్రయించారు. ఈ పిటిషన్​ను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ విచారించింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పారు. 

దీంతో బెంచ్.. సీఎం క్షమాపణలు చెప్పారు కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలనుకుంటున్నారా అని ఫిర్యాదుదారుడిని ప్రశ్నించింది. ఈ కేసులో మార్చి 11 వరకు ట్రయల్ కోర్టు విచారణ చేపట్టవద్దని ఆదేశించింది. బీజేపీ ఐటీ సెల్​కు పరువు నష్టం కలిగించే విధంగా యూట్యూబర్ ధ్రువ్ రాఠీ ఓ వీడియోను రూపొందించారు. దీనిని కేజ్రీవాల్ రీ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై క్రిమినల్ కేసు దాఖలైంది. దీనిని విచారించిన హైకోర్టు ఇతరుల పరువుకు భంగం కలిగించేలా ఉన్న వీడియోను రీ ట్వీట్ చేయడం కూడా నేరమే అవుతుందని పేర్కొంది. ట్రయల్ కోర్టు సమన్లను కొట్టివేయడానికి నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం అర్వింద్​ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఈడీ విచారణకు ఏడోసారి డుమ్మా

ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ఈడీ విచారణకు ఏడోసారి డుమ్మా కొట్టారు. ముందుగా జారీ చేసిన సమన్ల ప్రకారం సోమవారం ఆయన విచారణకు హాజరు కావాలి. కానీ, తాను విచారణకు హాజరు కావడంలేదని ఆయన సమాచారమిచ్చారు. ప్రస్తుతం కోర్టులో కేసు పెండింగ్ లో ఉందని తీర్పు వచ్చే దాకా ఆగాలని కోరారు. “ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. మార్చి 16న విచారణ జరగనుంది”అని ఆప్ పార్టీ తెలిపింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అర్వింద్ కేజ్రీవాల్ ను విచారించాలని ఈడీ అధికారులు ఇప్పటి వరకు ఏడుసార్లు సమన్లు జారీ చేశారు. కానీ, ఆయన  ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు.