హైదరాబాద్‌‌లో షూర్‌‌ సాఫ్ట్‌‌వేర్‌‌ సెంటర్‌‌

హైదరాబాద్‌‌లో షూర్‌‌ సాఫ్ట్‌‌వేర్‌‌ సెంటర్‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: మైక్రోఫోన్లు, హెడ్‌‌‌‌ఫోన్ల వంటివి తయారు చేసే అమెరికాకు చెందిన ఆడియో ఎలక్ట్రానిక్స్‌‌‌‌ కంపెనీ షూర్‌‌‌‌ తన సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ డెవెలప్‌‌‌‌మెంట్‌‌‌‌ సెంటర్‌‌‌‌ను హైదరాబాద్‌‌‌‌లో గురువారం ప్రారంభించింది.  ఈ సంస్థ గత ఏడాది బెంగళూరులో సేల్స్‌‌‌‌, మార్కెటింగ్‌‌‌‌ సెంటర్‌‌‌‌నూ మొదలుపెట్టింది. షూర్‌‌‌‌కు ఇది వరకే కోపెన్‌‌‌‌ హేగన్‌‌‌‌, ఎడిన్‌‌‌‌బరో, ఇలినాయిస్‌‌‌‌, సుజు నగరాల్లో సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ డెవెలప్‌‌‌‌మెంట్‌‌‌‌ సెంటర్లు ఉండగా, హైదరాబాద్‌‌‌‌లో ఏర్పాటయింది ఐదవది. ఈ కొత్త సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ సెంటర్‌‌‌‌ తన ప్రొడక్ట్‌‌‌‌ పోర్ట్‌‌‌‌ఫోలియోను విస్తరించుకునేలా సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ ఇంటెలిజెన్స్‌‌‌‌ను అందిస్తుంది. 60 మంది ఇంజనీర్లు పనిచేసే ఈ కేంద్రానికి నీరజ్‌‌‌‌ రాయ్‌‌‌‌ హెడ్‌‌‌‌గా వ్యవహరిస్తారు. షూర్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌, సీఈఓ క్రిస్టిన్‌‌‌‌ షీవింక్‌‌‌‌, తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్‌‌‌‌రంజన్‌‌‌‌, టీసీఎస్‌‌‌‌ సీనియర్‌‌‌‌ వైస్‌‌‌‌–ప్రెసిడెంట్‌‌‌‌, గ్లోబల్‌‌‌‌ హెడ్‌‌‌‌ (టెక్నాలజీ) వి.రాజన్న, షూర్‌‌‌‌ ఎగ్జిక్యూటివ్‌‌‌‌ వైస్‌‌‌‌–ప్రెసిడెంట్‌‌‌‌, సీటీఓ డాక్టర్‌‌‌‌ అవినాశ్‌‌‌‌ వైద్య తదితరులు ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా వైద్య మాట్లాడుతూ ‘‘సాఫ్ట్‌‌‌‌వేర్ డెవెలప్‌‌‌‌మెంట్‌‌‌‌ కోసం మేం ఇది వరకే టీసీఎస్‌‌‌‌తో ఒప్పందం చేసుకున్నాం. ఇక్కడి ఆఫీసులో కొందరు టీసీఎస్‌‌‌‌ ఇంజనీర్లూ పనిచేస్తారు. షూర్‌‌‌‌ ప్రొడక్టులకు సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ చాలా కీలకం. వీటిని డెవలప్‌‌‌‌ చేయడంలో హైదరాబాద్‌‌‌‌ ఇంజనీర్లు కీలకం. ఇక్కడ సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ డిజైన్‌‌‌‌, ప్రొడక్టుల క్వాలిటీ టెస్టింగ్‌‌‌‌ వంటి పనులు చేస్తాం. షూర్‌‌‌‌ దాదాపు వెయ్యి దాకా ప్రొడక్టులను అమ్ముతోంది’’ అని వివరించారు. జయేశ్‌‌‌‌ రంజన్ మాట్లాడుతూ సాఫ్ట్‌‌‌‌వేర్, హార్డ్‌‌‌‌వేర్‌‌‌‌ ఇండస్ట్రీల స్థాపనకు అవసరమైన అన్ని వసతులూ హైదరాబాద్‌‌‌‌లో ఉన్నాయి కాబట్టి విదేశీ కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయని తెలిపారు. చైనాలో వ్యాపారం ఇబ్బందికరంగా మారినందున, చాలా కంపెనీలు ఇండియావైపు చూస్తున్నాయని, హైదరాబాద్‌‌‌‌కు ప్రాధాన్యం ఇస్తున్నాయని చెప్పారు. కేంద్రం కార్పొరేట్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌ తగ్గించడం కంపెనీలకు మరింత మేలు చేస్తుందన్నారు. ఎలక్ట్రానిక్‌‌‌‌ కంపెనీలకు సాయపడటానికి త్వరలోనే టి–వర్క్స్‌‌‌‌ ఇంక్యుబేటర్‌‌‌‌ను ప్రారంభిస్తామని జయేశ్‌‌‌‌ రంజన్‌‌‌‌ వెల్లడించారు.