ఉగ్రదాడి రోజు డాక్యుమెంటరీ షూటింగ్ లో ప్రధాని : కాంగ్రెస్

ఉగ్రదాడి రోజు డాక్యుమెంటరీ షూటింగ్ లో ప్రధాని : కాంగ్రెస్

పుల్వామా ఉగ్రదాడి జాతి సమైక్యతపై జరిగిన దాడి అనీ.. దీనిపై ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాజకీయం చేస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్ దీప్ సింగ్ సుర్జేవాలా. ఈ ఘటనను అడ్డుపెట్టుకుని మళ్లీ అధికారంలోకి ఎలా రావాలో అని మాత్రమే బీజేపీ ఆలోచిస్తోందని విమర్శించారు. రాహుల్ గాంధీ చెప్పినట్టు మేం సైనిక బలగాలకు మద్దతుగా ఉన్నామనీ… బాధిత అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. 1947, 1971, 1975, 1999లలో పాకిస్థాన్ కు కాంగ్రెస్ ప్రభుత్వం సరైన రీతిలో బదులిచ్చిందని చెప్పారు.

పుల్వామా ఉగ్రదాడి జరిగిన ఫిబ్రవరి 14 నాడు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ …. డిస్కవరీ ఛానెల్ డాక్యుమెంటరీ షూటింగ్ లో ఉన్నారని విమర్శించారు. దాడి జరిగిన రోజు మధ్యాహ్నం 3.10 నుంచి… సాయంత్రం 6.40 వరకు.. ఢిల్లీలోని కోర్బెట్ నేషనల్ పార్కులో షూటింగ్ లో పాల్గొన్నారని అన్నారు. అందుకు తగిన ఆధారాలు కూడా తమ దగ్గర ఉన్నాయని చెప్పారు. దేశమంతా బాధపడుతుంటే ప్రధాని బోటింగ్ చేస్తూ ఫొటోలకు పోజులిచ్చారని అన్నారు. ప్రపంచంలో ఏ ప్రధాని అయినా ఇలా ప్రవర్తిస్తారా అని ప్రశ్నించారు సుర్జేవాలా.

ఓ జవాను అంతమయాత్రలో ఎంపీ సాక్షి మహరాజ్ నవ్వుతూ కనిపించారనీ.. పర్యాటక మంత్రి అల్ఫోన్స్ అమరుడి పార్థివదేహంతో సెల్ఫీ దిగారని.. ఇది పద్ధతికాదని విమర్శించారు.