
న్యూఢిల్లీ: అతిగా ఆలోచించడం (ఓవర్‌థింకింగ్) మనదేశంలో సర్వసాధారణ అలవాటుగా మారిందని, ఈ సమస్యతో బాధపడుతున్న భారతీయులు టెక్నాలజీ సాయం తీసుకుంటున్నారని సెంటర్ ఫ్రెష్–యూగవ్ చేసిన సర్వేలో తేలింది. దీని ప్రకారం.. ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు అతిగా ఆలోచించడం తగ్గించుకోవడానికి చాట్‌జీపీటీ, గూగుల్‌వంటి టెక్ టూల్స్‌ను వాడుతున్నారు.
దాదాపు 33 శాతం మంది భారతీయులు తమ రోజువారీ ఆలోచనల నుంచి బయటపడటానికి, పరిష్కారాలు వెతకడానికి ఏఐ టూల్స్, సెర్చ్ ఇంజిన్‌లను ఉపయోగిస్తున్నారు. కెరీర్, ఆర్థిక విషయాలు, వ్యక్తిగత సంబంధాలు వంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. భవిష్యత్తు గురించి ఆందోళన, నిర్ణయాలు తీసుకోలేకపోవడం, గతంలో జరిగిన వాటి గురించి పదేపదే ఆలోచించడం వంటివి ఈ సమస్యకు ప్రధాన కారణాలు.
ఏఐ టూల్స్ కొత్త ఆలోచనలు, భిన్నమైన అభిప్రాయాలను అందిస్తాయి. గూగుల్‌లో సమాచారం వెతకడం వల్ల సమస్యపై స్పష్టత వస్తుంది. ఇలా టెక్నాలజీని వాడుకుంటూ మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటున్నారు. ఈ సర్వే కోసం 2వేల మంది నుంచి వివరాలు సేకరించారు.