ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలి : తేజస్ నందలాల్ పవార్

 ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలి : తేజస్ నందలాల్ పవార్
  • కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

సూర్యాపేట, వెలుగు : భారీ వర్షాలు కురిసినా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సూర్యాపేట కలెక్టరేట్​లో ఎస్పీ కె.నరసింహ, అడిషనల్ కలెక్టర్ పి.రాంబాబుతో కలిసి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు 24 గంటలపాటు అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. బుధవారం 17 మంది ఫోన్ చేసి సమస్య తెలియజేయగా, వాటిని పరిష్కరించామని చెప్పారు. మరో 48 గంటలపాటు ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. 

గోడలు తడిసి ఉండడం వల్ల విద్యుత్ షాక్ తగలకుండా ఎలక్ట్రిసిటీ సిబ్బంది ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. కల్వర్టు, బ్రిడ్జిల పైనుంచి నీరు ప్రవహిస్తే అక్కడ సిబ్బందిని నియమించాలని, ఎక్కడైనా రోడ్లు తెగితే వెంటనే సమాచారాన్ని కంట్రోల్ రూమ్ కి తెలియజేయాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. 

అనంతరం కలెక్టరేట్​లో ప్రమాదకర పరిశ్రమలు( హజార్డస్ ఇండస్ట్రీస్ -కెమికల్, ఫార్మా ), వివిధ భాగాల ఉన్నత స్థాయి అధికారులతో కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. పరిశ్రమల్లో ఉద్యోగుల భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో డీఆర్డీఏ పీడీ అప్పారావు, ఆర్డీవో వేణుమాధవ్, డీపీవో యాదగిరి, ఆర్ & బీఎస్ సీతారామయ్య, వివిధ శాఖాల అధికారులు పాల్గొన్నారు.