‘సబ్ కా సాత్.. సబ్ కా వికాస్’ అనడం బంద్ చేయండి: బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి

‘సబ్ కా సాత్.. సబ్ కా వికాస్’ అనడం బంద్ చేయండి: బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి

కోల్కత్తా: పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత సువేందు అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014 సాధారణ ఎన్నికల సందర్భంగా  ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ భుజానికెత్తుకున్న ‘సబ్ కా సాత్.. సబ్ కా వికాస్’ నినాదంపై సువేందు అధికారి తాజాగా అభ్యంతరం వ్యక్తం చేశారు. కోల్కత్తాలో జరిగిన పశ్చిమ బెంగాల్ రాష్ట్ర బీజేపీ కార్యనిర్వాహక సమావేశంలో సువేందు అధికారి సరికొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చారు. 'Jo Hamare Saath, Hum Unke Saath' (ఎవరు మాతో ఉంటారో.. వాళ్లతోనే మేముంటాం) అని నినదించారు. నేషనలిస్ట్ ముస్లింల గురించి తాను మాట్లాడుతున్నానని సువేందు అధికారి మొదలుపెట్టారు. అక్కడ ఉన్న బీజేపీ కేడర్ను ఉద్దేశించి మాట్లాడుతూ.. మీరు కూడా ‘సబ్ కా సాత్.. సబ్ కా వికాస్’ అని అంటున్నారని.. ఇకపై తాను ఆ నినాదాన్ని భుజానికెత్తుకునేది లేదని సువేందు స్పష్టం చేశారు. 'Sabka Saath, Sabka Vikas' అనే నినాదం ఇకపై ఆపాలని.. అందుకు బదులుగా ఇక నుంచి 'Jo Hamare Saath, Hum Unke Saath' అని నినదించాలని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మైనార్టీ మోర్చా అవసరం బీజేపీకి లేదని చెప్పుకొచ్చారు. మైనార్టీ సెల్కు బీజేపీ మంగళం పాడాలని ఈ నందిగ్రాం ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు.

ALSO READ | హల్వా తయారు చేసిన ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్

‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’ నినాదాన్ని ప్రధాని నరేంద్ర మోదీ 2014లోనే భుజానికెత్తుకున్నప్పటికీ ముస్లిం అభ్యర్థులకు పోటీ చేసే అవకాశం ఇప్పటికీ రాలేదనేది తృణముల్ కాంగ్రెస్ వాదన. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో ఎలాంటి మంత్రి పదవి కూడా ముస్లింలకు దక్కలేదనే విమర్శలు కూడా బీజేపీపై ఉన్నాయి. బెంగాల్ బీజేపీ మైనార్టీ సెల్కు నాయకత్వం వహిస్తోంది కూడా ముస్లిం కాకపోవడం కొసమెరుపు. బెంగాల్ బీజేపీ మైనార్టీ సెల్కు మాజీ జర్నలిస్ట్ చార్లెస్ నంది నాయకత్వం వహిస్తున్నారు. 

ALSO READ | జవాన్ల మరణాలు ఇంకెంత కాలం..?: ప్రియాంక గాంధీ ఆవేదన

ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ లో మైనార్టీలు బీజేపీకి అండగా నిలవలేదనే విశ్లేషణలొచ్చిన తరుణంలో సువేందు అధికారి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. పశ్చిమ బెంగాల్ లోని 42 పార్లమెంట్ స్థానాలకు గానూ 30 స్థానాలను బీజేపీ టార్గెట్ గా పెట్టుకుని పనిచేసింది. కేవలం 12 స్థానాల్లో మాత్రమే బీజేపీ గెలవడం, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన 18 స్థానాల కంటే తగ్గిపోవడాన్ని బెంగాల్ బీజేపీ జీర్ణించుకోలేకపోయింది. సువేందు అధికారి తాజా వ్యాఖ్యలతో ఈ విషయం స్పష్టమైందని తృణముల్ ఆరోపిస్తోంది. 50 లక్షల మంది హిందువులు లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేసే పరిస్థితి లేకుండా పోయిందని, పశ్చిమ బెంగాల్ లో నాలుగు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో 2 లక్షల మంది హిందువులకు ఓటు వేసే అవకాశం దక్కలేదని సువేందు అధికారి ఇటీవల ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.