- ప్రముఖ దర్శక, నిర్మాతలు ఎస్.వి. కృష్ణారెడ్డి, కె.అచ్చిరెడ్డి
తల్లాడ, వెలుగు: సరికొత్త సంకల్ప సాధన దిశగా కొత్త సంవత్సరంలో అడుగులు వేయాలని సుప్రసిద్ధ సినీ దర్శక, నిర్మాతలు ఎస్వీ కృష్ణారెడ్డి, కె.అచ్చిరెడ్డి ఆకాంక్షించారు. తల్లాడ మండలం, అన్నారుగూడెం గ్రామానికి చెందిన దాసరి పద్మ స్మారక యువజన సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో రూపొందించిన 2026 సంవత్సర క్యాలెండర్ ను హైదరాబాద్ లో గురువారం ప్రముఖ సినీ దర్శకుడు రేలంగి నరసింహారావుతో కలిసి ఆవిష్కరించారు.
ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కొత్త సంవత్సరం ఎప్పుడైనా గడిచిన కాలం అనుభవాలతో భవిష్యత్లోకి అడిగిడుతుందని, కాలంతో పాటు కదలడం మానవ లక్షణమని అన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో మంచి మార్పుకు నూతన సంవత్సరం నాంది పలకాలని కోరారు.
చలనచిత్రరంగంలో దర్శక దిగ్గజం, బహుముఖ ప్రజ్ఞాశాలి, సామాజిక సేవస్ఫూర్తి ప్రదాతలైన దర్శకరత్న దాసరి నారాయణరావు- పద్మ దంపతుల స్మారకార్థం దాసరి పద్మ స్మారక యువజన సాంస్కృతిక సమాఖ్యను స్థాపించి గుమ్మా నరేశ్ చేస్తున్న నిరంతర సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు.
కార్యక్రమంలో గుడా రామకృష్ణ, అడపాల వెంకటేశ్వరావు, దాసరి పద్మ స్మారక యువజన సాంస్కృతిక సమాఖ్య సమన్వయకర్త దుగ్గిదేవర అజయ్ కుమార్, కార్యదర్శి తిగుళ్లనరసింహారావు, రాయల శ్రీనివాసరావు (చంటి), కె.లక్ష్మణ్ పాల్గొన్నారు.
