కోట్లు పెట్టి కొన్నరు.. మూలకు పడేసిన్రు

కోట్లు పెట్టి కొన్నరు.. మూలకు పడేసిన్రు

హనుమకొండ, వెలుగు: వరంగల్ బల్దియాలో  ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్ల ప్రజాధనం వృథా అవుతోంది. స్వచ్ఛ సర్వేక్షన్–2022లో భాగంగా సిటీలో చెత్త సేకరణ కోసం కొత్తగా స్వచ్ఛ ఆటోలు కొనుగోలు చేసిన ఆఫీసర్లు.. వాటిని  వినియోగంలోకి తేవడం లేదు. నెలలు గడుస్తున్నా రోడ్డెక్కించకపోవడంతో  అవన్నీ హనుమకొండ బాలసముద్రంలోని జీడబ్ల్యూఎంసీ షెడ్డులోనే మగ్గుతున్నాయి. తుప్పు పట్టి పాడై పోతున్నాయి. దీంతో సిటీతో పాటు విలీన గ్రామాలకు స్వచ్ఛ ఆటోలు సరిపోక చెత్త సేకరణకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రూ.కోట్లు పెట్టి వెహికిల్స్ కొన్న ఆఫీసర్లు.. చెబుతూ వాటిని వినియోగంలోకి తేవడం లేదు.

రూ.4 కోట్లతో కొత్త వెహికిల్స్..

గ్రేటర్​ వరంగల్​ లో విలీన గ్రామాలతో కలిసి 66 డివిజన్లు ఉండగా.. వాటి పరిధిలో  దాదాపు 2.5 లక్షల ఇండ్లున్నాయి.  నిత్యం జీడబ్ల్యూఎంసీ పరిధిలో  450 టన్నుల వరకు చెత్త పోగవుతోంది. ఇందులో తడి, పొడి చెత్తను వేరుగా సేకరించేందుకు నగరంలో ట్రాక్టర్లతో పాటు 162 స్వచ్ఛ ఆటోలను గతంలోనే తెప్పించారు. కాగా రోజురోజుకు చెత్త పెరిగిపోతుండటంతో స్వచ్ఛ సర్వేక్షన్​-2022లో భాగంగా అవసరాన్ని బట్టి మరిన్ని స్వచ్ఛ ఆటోలు సమకూర్చుకునేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ మేరకు ఒక్కో వెహికల్​ ను రూ.8 లక్షల చొప్పున.. మొత్తం రూ.4 కోట్ల నిధులతో 50 వెహికిల్స్​ కు గ్రేటర్​ ఆఫీసర్లు ఆర్డర్​ఇచ్చారు. హైదరాబాద్ కు చెందిన ఓ సంస్థ ద్వారా తడి, పొడి చెత్తతో పాటు  ప్రమాదకర వ్యర్థాలు ఏమైనా ఉంటే వాటినీ వేర్వేరుగా సేకరించేలా స్వచ్ఛ ఆటోలు తయారు చేయించారు. కాగా ఇందులో 26 వెహికల్స్​మూడు నెలల కిందటే వరంగల్ నగరానికి చేరాయి. ఈ మేరకు వాటికి రిజిస్ట్రేషన్​, ఇన్సూరెన్స్​ ప్రక్రియ కూడా కంప్లీట్​ చేసి బాలసముద్రంలోని షెడ్డుకు చేర్చారు. కానీ ఇంతవరకు వినియోగంలోకి తీసుకురాలేదు. కాగా రెండో విడతగా ఇంకో 24 వెహికల్స్​ బల్దియాకు చేరనున్నాయి.

సాకులు చెబుతూ మూలకు..

ఆఫీసర్లు డ్రైవర్ల కొరతను సాకుగా చూపి, స్వచ్ఛ ఆటోలను షెడ్డుకు పరిమితం చేస్తున్నారు. సిటీ పరిధిలో దాదాపు 2,500 మంది శానిటేషన్​ వర్కర్లు పని చేస్తుండగా.. అందులో డ్రైవింగ్​తెలిసిన వారిని స్వచ్ఛ ఆటోలను నడిపేందుకు డ్రైవర్లుగా నియమించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కానీ ఆ దిశగా ఇక్కడి ఆఫీసర్లు చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ఆ బండ్లన్నీ  ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్నాయి. ఇప్పటికే సరైన నిర్వహణ లేక జీడబ్ల్యూఎంసీలో రూ.కోట్లు విలువ చేసే టిప్పర్లు, ట్రాక్టర్లు, తదితర వెహికల్స్​మూలకుపడ్డాయి. ఇప్పుడు కొత్తగా తెచ్చిన వెహికల్స్​ కు కూడా మరుగునపడ్డాయి. ఈ విషయమై జీడబ్ల్యూఎంసీ చీఫ్​ మున్సిపల్​ హెల్త్​ ఆఫీసర్​ డా.జ్ఞానేశ్వర్​ను వివరణ కోరగా ఆయన స్పందించలేదు.