
న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీ, బైక్ ట్యాక్సీ కంపెనీ ర్యాపిడోలోని తన 12శాతం వాటాను అమ్మాలని చూస్తోంది. మూడేళ్ల కిందట ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసింది. వాటా అమ్మడంపై ఇంకా చర్చలు మొదలు కాలేదు. కానీ, స్విగ్గీకి మంచి లాభాలు వస్తాయని అంచనా. మరోవైపు ర్యాపిడో కూడా ఫుడ్ డెలివరీలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ర్యాపిడో వాల్యుయేషన్ ఒక బిలియన్ డాలర్‌గా (రూ.8,500 కోట్లుగా) ఉంది. ఈ విలువ వద్ద స్విగ్గీ వాటా రూ.1,020 కోట్లకు సమానం.
ఈ ఫుడ్ డెలివరీ కంపెనీ నష్టాలు ఈ ఏడాది జూన్ క్వార్టర్‌లో ఏడాది లెక్కన 96 శాతం పెరిగి రూ.1,197 కోట్లకు చేరాయి. గత ఏడాది జూన్ క్వార్టర్‌లో రూ.611 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. కంపెనీ నగదు నిల్వలు ఈ ఏడాది జూన్ 30 నాటికి రూ.5,354 కోట్లకు తగ్గాయి. ఈ ఏడాది మార్చి క్వార్టర్ నాటికి రికార్డ్ అయిన రూ.6,695 కోట్లతో పోలిస్తే ఇది 20 శాతం తక్కువ. జొమాటో నగదు నిల్వలు జూన్ క్వార్టర్ ముగిసే నాటికి రూ.18,857 కోట్లకు పెరిగాయి.