ఆగమైతమేమొనే రామక్కా : బీఆర్ఎస్ కు సిమిలర్ సింబల్స్ టెన్షన్

ఆగమైతమేమొనే రామక్కా : బీఆర్ఎస్ కు సిమిలర్ సింబల్స్ టెన్షన్

= యుగ తులసి ఫౌండేషన్ కు రోడ్ రోలర్
= ఇండిపెండెంట్లకు చపాతీ మేకర్, టీవీ, కెమెరా, సబ్బు పెట్టె, ఓడ, డోలి, కుట్టు షన్ గుర్తులు
= హోరా హోరీ పోరులో తారుమారైతే ఎలా?
= గులాబీ లీడర్లకు మళ్లీ అదే గుబులు
= ఈసీకి విజ్ఞప్తి చేసినా తప్పని ఇబ్బందులు

హైదరాబాద్: సిమిలర్ గుర్తుల టెన్షన్ గులాబీ పార్టీని వెంటాడుతోంది. కారును పోలిన పలు సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని గత కొంత కాలంగా ఈసీకి గులాబీ పార్టీ విజ్ఞప్తి చేస్తూ వస్తోంది. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ సైతం దాఖలు చేసి ఆ తర్వాత వెనక్కి తీసుకుంది. కారును పోలిన గుర్తుల కారణంగా తమ ఓట్లు ఇండిపెండెంట్లకు పడుతున్నాయని ఆ పార్టీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ సారి టఫ్ ఫైట్ జరగనుండటంతో ఈ గుర్తులు గెలుపోటములను శాసిస్తాయేమోననే భయం పట్టుకుంది. మునుగోడు ఉప ఎన్నికల్లో రోలర్ గుర్తుకు తమ ఓట్లు పడ్డాయని దీంతో తమ మెజార్టీ తగ్గిందని బీఆర్ఎస్ చెబుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ అదే జరిగిందని అంటోంది. ప్రస్తుతం యుగతులసీ ఫౌండేషన్ అనే పార్టీకి రోడ్ రోలర్ గుర్తును కేటాయించారు. దీంతో పాటు బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న చపాతీ మేకర్, టీవీ, కెమెరా, సబ్బు పెట్టె, డోలీ, కుట్టుమిషన్, ఓడ గుర్తులు స్వతంత్రులకు కేటాయించారు. వీటికి దగ్గరగా ఉన్న హర్మోనియం, కంప్యూటర్, ఆటో లాంటి గుర్తులు కూడా ఈసీ జాబితాలో ఉన్నాయి.

టఫ్ ఫైట్ ఆగం చేస్తుందా..?

ప్రస్తుతం 20 నుంచి 30 సెగ్మెంట్లలో టఫ్ ఫైట్ ఉంటుందని పలు సర్వేలు చెబుతున్నాయి. ఇక్కడ ఎవరు గెలిచినా వందల ఓట్లతోనే గట్టెక్కుతారని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కారును పోలిన గుర్తులపై బరిలో నిలిచిన స్వతంత్రులు ఓట్లు చీల్చితే భారీ నష్టం జరుగుతుందనే టెన్షన్ గులాబీ అభ్యర్థులకు పట్టుకుంది.