అంకిత్​శర్మను టార్గెట్​ చేసి చంపేశారు

అంకిత్​శర్మను టార్గెట్​ చేసి చంపేశారు
  • ఐబీ ఆఫీసర్​ హత్యపై క్రైం బ్రాంచ్​ పోలీసుల చార్జిషీట్​
  • ఆప్​ మాజీ కౌన్సిలర్​ తాహిర్​ హుస్సేన్​ కుట్రపన్నాడని ఆరోపణ
  • మత కలహాలను రెచ్చగొట్టి గుంపును ఉసిగొల్పిండు
  • సల్మాన్​ అనే వ్యక్తి అంకిత్​ను చంపిండు
  • ఒంటిపై 51 కత్తి పోట్లున్నయ్​.. పదునైన ఆయుధపు గాట్లున్నయ్​

న్యూఢిల్లీ: ఇంటెలిజెన్స్​ బ్యూరో (ఐబీ) ఆఫీసర్​ అంకిత్​ శర్మను కావాలని టార్గెట్​ చేసి, కుట్రపన్ని హత్య చేశారని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. అంకిత్​ను కత్తితో 51 సార్లు పొడిచారని, కర్రలు, రాళ్లతో కొట్టి చంపారని చెప్పారు. తర్వాత బాడీని అక్కడి నాలాలో పారేశారన్నారు. ఆమ్​ ఆద్మీ పార్టీ (ఆప్​) ఎక్స్​ కౌన్సిలర్​ తాహిర్​ హుస్సేన్​ గుంపును రెచ్చగొట్టి హత్యకు కారణమయ్యాడని పేర్కొన్నారు. హసీన్​ అలియాస్​ సల్మాన్​ అనే వ్యక్తి హత్యలో కీలకంగా ఉన్నాడని చెప్పారు. యాంటీ సీఏఏ నిరసనలతో ఫిబ్రవరి 24, 25వ తేదీల్లో నార్త్​ఈస్ట్​ ఢిల్లీలోని చాంద్​బాగ్​లో అంకిత్​ శర్మను కొందరు దుండగులు చంపేసి నాలాలో పడేసిన సంగతి తెలిసిందే. దానిపై బుధవారం ఢిల్లీ క్రైమ్​ బ్రాంచ్​ పోలీసులు మెట్రోపాలిటన్​ మెజిస్ట్రేట్​ కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. జూన్​ 16న కోర్టు కేసును విచారించనుంది.

తాహిర్​హుస్సేనే రెచ్చగొట్టాడు

అంకిత్​ హత్య కేసులో తాహిర్​ హుస్సేనే మాస్టర్​ మైండ్​ అని పోలీసులు చార్జిషీట్​లో పేర్కొన్నారు. ‘‘సీఏఏ అల్లర్లకు తాహిర్​ హుస్సేన్​ మతం రంగును పులిమాడు. మత కలహాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలోనే గుంపును జనాలపైకి ఉసిగొల్పాడు. దీంతో ఫిబ్రవరి 24న షేర్పూర్​ చౌక్​లో ఆ గుంపు షాపులపై దాడులకు దిగింది. ఆ గుంపులోని ఆందోళనకారులు రాళ్లు విసిరారు. షాపులను తగులబెట్టారు. ఇళ్లపైనా పెట్రోల్​ బాంబులు విసిరారు. అల్లర్లను కంట్రోల్​ చేసే డ్యూటీలో ఉన్న అంకిత్​ శర్మను పట్టుకుని చాంద్​బాగ్​ పూలియాలోకి ఈడ్చుకెళ్లారు. కత్తులతో పొడిచి చంపేశారు. తర్వాత బాడీని అక్కడి నాలాలో పడేశారు. తెల్లారి ఫిబ్రవరి 25న అంకిత్​ శర్మ బాడీని నాలా నుంచి బయటకు తీశారు. పోస్ట్​మార్టం చేసిన డాక్టర్లు 51 కత్తి పోట్లు, ఇతర పదునైన ఆయుధపు గాట్లు ఉన్నట్టు తేల్చారు’’ అని చార్జిషీట్​లో పేర్కొన్నారు.

ఓ సాక్షి ఇంటి టెర్రేస్​పై తీసిన వీడియో ఆధారంగా రెడ్​ షర్ట్​ వేసుకున్న వ్యక్తే ప్రధాన నిందితుడిగా నిర్ధారించి అరెస్ట్ చేశామని, అతడిని సల్మాన్​గా గుర్తించామని పోలీసులు తెలిపారు. తాహిర్​, సల్మాన్​ సహా పదిమందిని అరెస్ట్​ చేశామన్నారు. ఇంటరాగేషన్​లో సల్మాన్​ నేరాన్ని ఒప్పుకున్నట్టు వివరించారు. అంకిత్​ శర్మను చంపేసిన రోజే తాహిర్​ హుస్సేన్​ తన ఫ్యామిలీని సొంతూరైన ముస్తఫాబాద్​కు పంపించాడని పోలీసులు చార్జిషీట్​లో పేర్కొన్నారు. పోలీసులకు అప్పగించిన తన గన్​ను అల్లర్లు జరిగిన ముందురోజే విడిపించి తీసుకెళ్లాడని, వంద కార్ట్రిడ్జ్​లను కొన్నాడని చెప్పారు. అందులో 64 లైవ్​ కార్ట్రిడ్జ్​లు, 22 షెల్స్​ను స్వాధీనం చేసుకున్నామని, మిగతా వాటి గురించి అడిగితే తాహిర్​ నుంచి సరైన సమాధానం లేదని వెల్లడించారు. 96 మంది సాక్షులను విచారించాకే అంకిత్​ హత్యకు కారణం తాహిర్​ హుస్సేన్​, హత్య చేసింది సల్మాన్​ అన్న నిర్ధారణకు వచ్చామని చార్జిషీట్​లో పోలీసులు పేర్కొన్నారు.