బీఆర్ఎస్​ గురించి మాట్లాడడం టైమ్ వేస్ట్​ : ​ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

బీఆర్ఎస్​ గురించి మాట్లాడడం టైమ్ వేస్ట్​ : ​ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
  •  ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 
  • కాంగ్రెస్​..కేసీఆర్​లెక్క దొంగమాటలు చెప్పదు  

మిర్యాలగూడ, వెలుగు : అసమర్థ, అవినీతి పాలనతో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన  బీఆర్ఎస్ పార్టీని జనమే బొంద పెట్టారని, ఆ పార్టీ గురించి మాట్లాడితే టైమ్​ వేస్ట్​అని నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్​చార్జి,   ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఎన్ఎస్ పీ క్యాంపులో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అధ్యక్షతన సాగిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే బీఆర్ఎస్ పనైపోయిందన్నారు. 

ప్రజల మనసుల నుంచి బీఆర్ఎస్ తొలగిపోయిందన్నారు. బీజేపీ ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమన్నారు. రాష్ట్రంలో ఏ రైతు నష్టపోకుండా ఎమ్మెస్పీకే ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి రఘువీర్​రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆర్అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుందని, కేసీఆర్ లాగ దొంగ మాటలు చెప్పదన్నారు. ఏకకాలంలో రూ. రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. అధికారం కోల్పోయి, బిడ్డ జైలుకు వెళ్లడంతో కేటీఆర్, కేసీఆర్ ల మతి భ్రమించి, ప్రభుత్వం పడిపోతుందని ప్రచారం చేస్తున్నారన్నారు. 

మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ, నాగార్జునసాగర్ సహా ఇతర ప్రాంతాల్లో  మిగిలి ఉన్న అభివృద్ధి పనులను  పూర్తిచేసేందుకు ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన రఘువీర్ రెడ్డిని గెలిపించాలన్నారు. ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ   జిల్లాకు చెందిన మాజీ మంత్రి తాను చేసిన అభివృద్ధి ఏమీ లేకపోవడంతో వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నాడన్నారు. 

ఎమ్మెల్యేలు జై వీర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడారు. అంతకుముందు తడకమళ్ల క్రాస్ రోడ్డు నుంచి బైక్ ర్యాలీ, పాదయాత్ర నిర్వహించారు. డీసీసీ  ప్రెసిడెంట్ కేతావత్ శంకర్ నాయక్, ధీరావత్ స్కైలాబ్ నాయక్, భారతీ రాగ్యా నాయక్, కొండేటి మల్లయ్య, తమ్మడబోయిన అర్జున్, చిలుకూరి బాలకృష్ణ, నర్సిరెడ్డి, మాధవి, వేణుగోపాల్ రెడ్డి, గాయం ఉపేందర్ రెడ్డి, తలకొప్పుల సైదులు, జానిపాష, సలీం, ఆరీఫ్  ఉన్నారు.