కొబ్బరి పీచు మధ్యలో గంజాయి అక్రమ రవాణా

కొబ్బరి పీచు మధ్యలో గంజాయి అక్రమ రవాణా
  • ఒక్కో లోడ్‌‌‌‌‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ చేస్తే రూ. లక్షా 50 వేలు 
  • హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ నుంచి కేరళ, తమిళనాడు, శ్రీలంకకు తరలింపు
  • ఇద్దరు సప్లయర్లు అరెస్ట్.. పరారీలో మరో ఇద్దరు 
  • 250 కిలోల సరుకు స్వాధీనం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌,వెలుగు: కొబ్బరి పీచు మధ్యలో గంజాయిని పెట్టి తరలిస్తున్న తమిళనాడు గ్యాంగ్‌‌‌‌‌‌‌‌ను మహేశ్వరం ఎస్‌‌‌‌‌‌‌‌ వోటీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. 250 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.75 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఒడిశా, కేరళకు చెందిన మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. ఈ గ్యాంగ్ వివరాలను రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్‌‌‌‌‌‌‌‌ శనివారం వెల్లడించారు. తమిళనాడుకు చెందిన మలయాలి స్వామి(31) కొంతకాలం కిందట హైదరాబాద్ వచ్చాడు. 

చాంద్రాయణగుట్ట పరిధి బండ్లగూడలో ఉంటున్నాడు. స్థానికంగా చిరువ్యాపారాలు చేసేవాడు. ఆశించిన స్థాయిలో ఆదాయం లేకపోవడంతో తమిళనాడుకు చెందిన రామర్‌‌‌‌‌‌‌‌(39)తో కలిసి గంజాయి ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్ చేసేందుకు ప్లాన్ చేశాడు. ఇందుకోసం అదే రాష్ట్రానికి చెందిన గంజాయి పెడ్లర్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌రాజ స్టాలిన్‌‌‌‌‌‌‌‌ను సంప్రదించాడు. రాజ స్టాలిన్ సహకారంతో స్వామి, రామర్ ఇద్దరూ కేరళకు చెందిన గంజాయి సప్లయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజేశ్​ను కలిశారు. గంజాయిని ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్ చేసేందుకు రాజేశ్​తో డీల్‌‌‌‌‌‌‌‌ కుదుర్చుకున్నారు.

ఒడిశా నుంచి సిటీకి..

ఒక లోడ్ గంజాయిని కంటెయినర్​లో తరలిస్తే లక్షా 50 వేలు ఇచ్చేలా రామర్, స్వామి ఇద్దరూ రాజేశ్​తో ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరు ఒడిశా నుంచి సిటీకి గంజాయిని తరలించేవారు. మొదట కంటెయినర్ లారీలో కొబ్బరి పీచును లోడ్ చేసి వాటి మధ్యలో గంజాయి ప్యాకెట్లను పెట్టేవారు. ఇలా ఒడిశా నుంచి సిటీకి తీసుకొచ్చిన గంజాయిని రాజేశ్​కు అప్పగించేవారు. ఇటీవల రెండు లోడ్స్‌‌‌‌‌‌‌‌లో 500 కిలోల గంజాయిని రామర్, స్వామి సిటీకి తరలించారు. ఆ సరుకును రాజేశ్ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, మహారాష్ట్ర, తమిళనాడు, శ్రీలంకకు తరలించాడు. ఈ క్రమంలోనే రామర్, స్వామికి రాజేశ్ మరో ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చాడు. దీంతో గత సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 24న మలయాలి స్వామి, రామర్‌‌‌‌‌‌‌‌ ఒడిశాకు వెళ్ళారు.

పక్కా సమాచారంతో..

ఒడిశాలోని లోకల్ గంజాయి సప్లయర్ చంద్రశేఖర్ వద్ద రామర్, స్వామి 250 కిలోల సరుకును కొన్నారు. దాన్ని 2.5 కిలోల చొప్పున 120 ప్యాకెట్లుగా చేశారు. ఆ గంజాయిని కంటెయినర్​లో లోడ్ చేసి హైదరాబాద్​కు బయలుదేరారు. దీని గురించి సమాచారం అందుకున్న మహేశ్వరం ఎస్​వోటీ , మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట పోలీసులు కర్మన్​ఘాట్ ​క్రాస్ రోడ్​లోని టీకేఆర్ కమాన్ వద్ద నిఘా పెట్టారు. గంజాయి లోడ్​తో వస్తున్న కంటెయినర్​ను అడ్డుకున్నారు. మలయాలి స్వామి, రామర్​ను అదుపులోకి తీసుకున్నారు. కంటెయినర్​ను సీజ్ చేశారు. 

గంజాయిని అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు.  సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 17 మంది కస్టమర్లను, ఈ ఏడాదిలో మొత్తం 100 మందికి పైగా సప్లయర్లను అరెస్ట్ చేశామని ఆయన వెల్లడించారు.