
- 3,500 కిలోల డ్రగ్స్ ఆస్ట్రేలియాకు స్మగుల్ చేశాడు: ఎన్సీబీ
- నాలుగు దేశాల డ్రగ్స్ నెట్వర్క్ మాస్టర్‌మైండ్ గా గుర్తింపు
- డీఎంకే ముఖ్య నేతకు సాదిక్‌తో సంబంధాలున్నట్లు వెల్లడి
రూ. రెండు వేల కోట్ల విలువైన డ్రగ్స్ స్మగ్లింగ్ చేశాడనే ఆరోపణలపై తమిళ సినీ నిర్మాత జాఫర్ సాదిక్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అరెస్టు చేసింది. నాలుగు దేశాల డ్రగ్స్ నెట్వర్క్ తో ఆయనకు సంబంధాలు ఉన్నాయని వెల్లడించింది.
న్యూఢిల్లీ: రూ. 2 వేల కోట్ల డ్రగ్స్ స్మగ్లింగ్ చేశాడనే ఆరోపణలపై తమిళ సినీ నిర్మాత జాఫర్ సాదిక్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అరెస్టు చేసింది. శనివారం ఢిల్లీలో ఎన్సీబీ డెరెక్టర్ జనరల్ జ్ఞానేశ్వర్ సింగ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక ఇంటర్నేషనల్ డ్రగ్స్ నెట్‌వర్క్‌కు సాదిక్ మాస్టర్‌మైండ్ అని చెప్పారు. నిందితుడు ఇప్పటి వరకు ఆస్ట్రేలియాకు 3,500 కిలోల సూడో ఎఫెడ్రిన్‌ను స్మగుల్ చేసినట్లు తెలిపారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలకు అతను అక్రమంగా రవాణా చేసిన డ్రగ్స్ విలువ రూ.2 వేల కోట్లకు పైగా ఉంటుందన్నారు. డ్రగ్స్ స్మగ్లింగ్‌లో సంపాదించిన డబ్బును అతను రియల్ఎస్టేట్, ఫిల్మ్ ప్రొడక్షన్ లో పెట్టుబడులు పెట్టినట్టు చెప్పారు. చైన్నైలో ఒక హోటల్ కూడా నిర్మించాడన్నారు. డీఎంకే పార్టీ ఓవర్సీస్ విభాగంలో సాదిక్ కొన్ని రోజులు బాధ్యతలు నిర్వహించినట్లు చెప్పారు. డ్రగ్స్ స్మగ్లింగ్‌లో అతని పేరు బయటికి రావడంతో గతంలోనే పార్టీ అతన్ని బహిష్కరించింది. అయితే డీఎంకే ముఖ్య నేత ఒకరితో అతనికి సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తర్వలోనే సదరు నేతకు ఎన్సీబీ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది.
నాలుగు నెలలుగా పరారీలో..
సాదిక్ ఇప్పటి వరకు 45 పార్శిళ్లలో 3,500 కిలోల సూడో ఎఫెడ్రిన్‌ను ఆస్ట్రేలియాకు పంపాడని డీజీ జ్ఞానేశ్వర్ సింగ్ తెలిపారు. ‘‘కొబ్బరికాయలు, డ్రై ఫ్రూట్స్‌లో సూడో ఎఫెడ్రిన్ దాచి విదేశాలకు పంపించారు. దీనిని మెథాంఫేటమిన్ లేదా క్రిస్టల్ మెత్ ఉత్పత్తిలో ఉపయోగిస్తారు. నాలుగు నెలల కింద ఢిల్లీలో చేసిన రైడ్స్‌లో ఈ డ్రగ్స్ నెట్వర్క్ కింగ్‌పిన్ గా సాదిక్ పేరు తెలిసింది. అప్పటి నుంచి అతను పరారీలో ఉన్నాడు. వారం కింద మదురైలో 6 కిలోలు, చెన్నైలో 36 కిలోల మెథాంఫెటమిన్ పట్టుకున్నట్లు చెప్పారు. రూ.180 కోట్ల విలువైన ఈ డ్రగ్స్‌ను సాదిక్ శ్రీలంకకు స్మగ్లింగ్ చేస్తున్నట్లు తేలిందన్నారు. తాజాగా అతను ఢిల్లీలోనే ఉన్నట్లు తెలియడంతో రైడ్ చేసి అరెస్టు చేశామన్నారు.
డీజీపీ నుంచి బహుమతి
డీఎంకే పాలనలో తమిళనాడు ఇండియాకే డ్రగ్ డెన్‌గా మారిందని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై విమర్శించారు. డీఎంకే నేత డ్రగ్స్ కేసులో అరెస్టు కావడంపై ఆ పార్టీ చీఫ్, సీఎం స్టాలిన్ వివరణ ఇవ్వాలన్నారు. రాష్ట్ర డీజీపీ చేతుల మీదుగా సాదిక్ బహుమతి కూడా అందుకున్నారని, ఇది మరింత దురదృష్టకరమన్నారు.