ఈడీ విచారణకు రాలేను.. ఈడీ అధికారులకు రోహిత్ రెడ్డి మెయిల్ 

ఈడీ విచారణకు రాలేను.. ఈడీ అధికారులకు రోహిత్ రెడ్డి మెయిల్ 

హైదరాబాద్ : ఇవాళ విచారణకు హాజరుకాలేనని ఈడీ అధికారులకు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మెయిల్ ద్వారా సమాచారం అందించారు. తెలంగాణ రాష్ర్ట హైకోర్టులో తాను రిట్ పిటిషన్ దాఖలు చేశానంటూ ఈడీకి పంపిన మెయిల్ లో పేర్కొన్నారు. కోర్టులో పిటిషన్ ఉన్నందున తాను ఈడీ విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు తెలిపారు. హైకోర్టు విచారణ అనంతరం హాజరయ్యే విషయంపై తాను నిర్ణయం తీసుకుంటామని ఈడీ అధికారులకు పంపిన మెయిల్ లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. 

సిట్‌‌ దర్యాప్తును రద్దు చేసిన హైకోర్టు

మొయినాబాద్​ ఫామ్​హౌస్​ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్​ ఇన్వెస్టిగేషన్​ టీమ్​(సిట్​)ను హైకోర్టు రద్దు చేసింది. సిట్​ కోసం ప్రభుత్వం తెచ్చిన జీవో 63ను కొట్టేసింది. కేసు దర్యాప్తును వెంటనే సీబీఐ చేపట్టాలని జస్టిస్‌‌ బి.విజయ్‌‌సేన్‌‌రెడ్డి ధర్మాసనం ఆదేశించింది. 

కేసులో కీలక వివరాలను మీడియాకు సీఎం కేసీఆర్​ వెల్లడించడంతో నిందితులు పడుతున్న ఆందోళనను తాము పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిపింది. సిట్​ ఎంక్వైరీ పక్షపాత ధోరణిలో జరుగుతుందన్న నిందితుల వాదనలో అర్థం ఉందని పేర్కొంది. సిట్, మొయినాబాద్‌‌ పోలీసుల వద్ద ఉన్న డాక్యుమెంట్స్‌‌ అన్నిటినీ సీబీఐకి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. 

మూడు పిటిషన్లపై తీర్పు

సిట్‌‌ దర్యాప్తు రాజకీయ లక్ష్యంతో సాగుతున్నదని, దర్యాప్తును సీబీఐకి లేదా హైకోర్టు ఏర్పాటు చేసే ప్రత్యేక దర్యాప్తు సంస్థకు అప్పగించాలంటూ నిందితులు దాఖలు చేసిన పిటిషన్లపై ఈ నెల 16న వాదనలు పూర్తయ్యాయి. అదే రోజు తీర్పును రిజర్వ్​లో పెట్టిన హైకోర్టు.. సోమవారం తుది తీర్పు వెలువరించింది. 

కోర్టును బీజేపీ తప్పుదోవ పట్టిస్తున్నది: పైలెట్​ రోహిత్​రెడ్డి

బంజారాహిల్స్‌‌లోని తన ఆఫీస్‌‌లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తమ అధినేత, సీఎం కేసీఆర్‌‌కు వీడియోలు, ఆడియోలు తానే ఇచ్చానని ఎమ్మెల్యే పైలెట్​ రోహిత్ రెడ్డి చెప్పారు. కోర్టు ఇచ్చిన కాపీలను కూడా  కేసీఆర్‌‌కు అందజేశానని తెలిపారు. న్యాయస్థానాన్ని బీజేపీ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతో ఈడీకి సంబంధం లేకున్నా తనకు నోటీసులు ఇచ్చి విచారించారని, ఈడీ విచారణలో ఏమీ దొరకలేదు కాబట్టే సీబీఐని దింపుతున్నారనే అనుమానం కలుగుతోందని అన్నారు. కేసులో సీబీఐ విచారణే కరెక్ట్​ అని కోర్టు చెప్తే విచారణకు సహకరిస్తానని చెప్పారు. 

‘‘నన్ను  జైల్లో పెట్టినా భయపడేది లేదు.  అన్నింటికీ సిద్ధంగానే ఉన్న. ఈ కేసును సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై నా లీగల్‌‌ టీం ఒపీనియన్‌‌ తీసుకుంటున్న” అని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కోర్టు తీర్పు కాపీ అందిన తర్వాతే తదుపరి కార్యాచరణ ఉంటుందని అన్నారు. సింగిల్‌‌ బెంచ్‌‌ ఆదేశాలపై డివిజన్‌‌ బెంచ్​కు వెళ్లాలా.. సుప్రీంకోర్టుకు వెళ్లాలా అనేది న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సిట్‌‌ బాగానే విచారిస్తున్నదని, అయినా బీజేపీ నాయకత్వం న్యాయవ్యవస్థలో ఉన్న కొన్ని నిబంధనలను అడ్డుపెట్టుకొని తప్పుదోవ పట్టిస్తున్నదని దుయ్యబట్టారు.