‘బెల్ట్’ దందాపై నజర్..!​

‘బెల్ట్’ దందాపై నజర్..!​
  •    వరంగల్​ కమిషనరేట్ పరిధిలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు
  •     వైన్స్ లను తలపిస్తున్న కిరాణ షాపులు 
  •     లిక్కర్ దందాను లైట్ తీసుకుంటున్న లోకల్ పోలీసులు
  •     టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో బయటపడుతున్న బాటిళ్లు
  •     15  రోజుల్లోనే  66 మందిపై కేసులు

హనుమకొండ, వెలుగు : బెల్ట్​దందాపై టాస్క్​ ఫోర్స్​ ఉక్కుపాదం మోపుతోంది. ప్రధానంగా వరంగల్​ కమిషనరేట్​ పరిధిలోని కిరా ణా దుకాణాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగుతుండడంతో ఆయా షాపులపై కొరఢా ఝుళిపిస్తున్నారు.  ప్రధానంగా అర్బన్ ఏరియాల్లో గల్లీకో బెల్ట్ షాప్ దర్శనమిస్తుండగా, ఊర్లల్లోని కిరాణ షాపులు వైన్స్​, బార్ షాపులను తలపిస్తున్నాయి. వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బెల్ట్ షాపులపై నజర్​పెట్టారు. 

కమిషనరేట్ పరిధిలోని కిరాణ షాపులను జల్లెడపడుతూ కొద్దిరోజులుగా ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో పెద్ద ఎత్తున మద్యం బాటిళ్లు లభ్యమవుతుండటంతో, సంబంధిత దుకాణ యజమానులపై కేసులు కూడా నమోదు చేస్తున్నారు. స్థానిక పోలీసులు బెల్ట్​దందాను లైట్​తీసుకుంటుండటంతో, టాస్క్​ఫోర్స్​టీమ్​ల ఆధ్వర్యంలో దాడులు నిర్వహిస్తూ బెల్ట్ దందాకు చెక్ పెడుతున్నారు. 

గల్లీకో  షాప్.. 24 గంటలు సేల్స్..​

కమిషనరేట్ పరిధిలో వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాలున్నాయి. ఇందులో హనుమకొండ, వరంగల్ జిల్లాల కేంద్రంగా ఉన్న గ్రేటర్ సిటీ ప్రధానమైనది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తంగా 294 వైన్స్​లు ఉండగా, అందులో వరంగల్ జిల్లాలో 63, హనుమకొండలో 65, జనగామలో 47, మహబూబాబాద్ 59, ములుగు, భూపాలపల్లి కంబైన్డ్ జిల్లాలో 60 షాప్​లు ఉన్నాయి. వాటికి అదనంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరో 125 బార్లు కూడా ఉన్నాయి. వీటిద్వారా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజుకు సగటున రూ.15 కోట్ల వరకు మద్యం సేల్స్​ జరుగుతుండగా, బెల్ట్​షాపుల షేర్​ఎక్కువగా ఉంటోందని తెలుస్తోంది. ప్రతి ఊరిలో కనీసం ఏడెనిమిది బెల్ట్​షాపులుండగా

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 15 వేలకు పైగా బెల్ట్​ షాపులు ఉన్నట్లు అప్పట్లో ఆఫీసర్లు అంచనా వేశారు. వైన్స్ లో ముందస్తుగా రూ.10 వేల డిపాజిట్ తో బెల్ట్​షాప్​గా మెంబర్​షిప్ తీసుకుంటున్న యజమానులు, ఆ తర్వాత ప్రతి బాటిల్ పై వైన్స్ కు రూ.10 ఎక్కువ చెల్లించి, సరుకు తీసుకొస్తున్నారు. అనంతరం లిక్కర్ బాటిల్ పై రూ.20 నుంచి రూ.30, కూలింగ్ అవసరం ఉండే బీర్ బాటిల్స్ పై రూ.30 నుంచి రూ.40 ఎక్కువ చేసి అమ్ముతున్నారు. 

జనాల అవసరాన్ని బట్టి 24 గంటల పాటు నిర్వహించడంతోపాటు డిమాండ్​ను బట్టి రేటు పెంచి అమ్ముతూ లిక్కర్​దందా నడిపిస్తున్నారు. ప్రస్తుతం వేసవి నేపథ్యంలో వైన్స్​లు బీర్లలో ఎక్కువ శాతం బెల్ట్ షాపులకే అప్పగిస్తున్నాయి. దీంతోనే వైన్స్​ల్లో కొన్నిరకాల బీర్లకు కొరత ఏర్పడుతుండగా, బెల్ట్​షాపుల్లో అవే బీర్లు పుష్కలంగా లభిస్తుండటం గమనార్హం. 

15 రోజులు, 68 మందిపై కేసులు..

ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నా, గ్రామాలతోపాటు సిటీలోని కొన్ని ఏరియాల్లో బెల్ట్​షాపుల దందా నడుస్తూనే ఉంది. దీంతో ఇటీవల టాస్క్​ఫోర్స్​పోలీసులు బెల్ట్​ షాపుల దందాపై స్పెషల్​ ఫోకస్ పెట్టారు. ఏసీపీ మధుసూదన్ నేతృత్వంలో దాడులు నిర్వహిస్తున్నారు. కమిషనరేట్ పరిధిలో రైడ్స్ నిర్వహిస్తూ పెద్ద మొత్తంలో లిక్కర్, బీర్​బాటిల్స్​ సీజ్​చేస్తూ, నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తున్నారు. హసన్​పర్తి లోని బెల్ట్ షాపులపై శుక్రవారం రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు చేశారు. మద్యం అమ్ముతున్న ఇద్దరిపై కేసు నమోదు చేసి

రూ.17,590 విలువైన మద్యం సీసాలు సీజ్ చేసి స్థానిక పోలీసులకు అప్పగించారు. గడిచిన నాలుగైదు ఏండ్లను పరిశీలిస్తే టాస్క్​ఫోర్స్​ పోలీసులు ఏడాది మొత్తం మీద బెల్ట్​షాపుల నుంచి సగటున రూ.6 లక్షల విలువైన మద్యం సీజ్ చేయగా, గత నెల 22 నుంచి 15 రోజుల్లోనే 68 మందిపై కేసు నమోదు చేసి, రూ.5.84 లక్షల విలువైన మద్యం సీసాలను సీజ్ చేశారు.

మద్యం వ్యాపారుల్లో హడల్..

ఇదివరకు బెల్ట్​ షాపులు 24 గంటల పాటు నడిచేవి. ఎనీ టైం మందు లభిస్తూ బెల్ట్​షాపులన్నీ బార్లను తలపించేవి. వరంగల్ నగరంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో బెల్ట్​షాపుల వల్ల గొడవలైన సందర్భాలు ఉన్నాయి. బెల్ట్​షాపులపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే, ఇదివరకు కొంతమంది పోలీసులు నిర్వాహకులకు సమాచారం ఇచ్చి, నామమాత్రపు దాడులు చేసేవారు. ఆ తరువాత వారి నుంచి మామూళ్లు వసూలు చేసి బెల్ట్ దందాకు సపోర్ట్​ చేసేవారు. దీంతో నిర్వాహకులు ఎలాంటి భయం లేకుండానే దందా సాగించేవారు. 

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బెల్ట్​షాపులు క్లోజ్​చేస్తామని కాంగ్రెస్​ నేతలు హామీ ఇచ్చారు. ఉమ్మడి నల్గొండ జిల్లా మునుగోడు లో రెండు నెలల కిందట దాదాపు 2 వేల బెల్ట్​షాపులు క్లోజ్​ చేయించారు. అదే ఆదర్శంగా ఇక్కడ కూడా బెల్ట్​ షాపులను నియంత్రణ చేస్తుండటంతో మద్యం వ్యాపారులు హడలెత్తిపోతున్నారు. లిక్కర్ సేల్స్ చేయాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. 

కొంతమంది ఇదే సాగిస్తున్న నేపథ్యంలో టాస్క్​ఫోర్స్​పోలీసులు రంగంలోకి దిగి చెక్ పెడుతున్నారు. బెల్ట్​ దందాకు పూర్తిగా ఫుల్​స్టాప్​పెట్టేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటుండగా, గ్రామాల్లో పూర్తిస్థాయిలో బెల్ట్​ షాపులను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్​ చేస్తున్నారు.