
పండుగొచ్చిందంటేచాలు పిండివంటలు, రకరకాల స్వీట్స్ చేసుకుంటారు చాలామంది. మరి వెలుగులు పంచే ఆనందాల దీపావళిని టపాసుల మోతలతో పాటు, ఈ సారి వెరైటీ స్వీట్లతో జరుపుకుందాం. ఇవి టేస్టీ అండ్ హెల్దీ కూడా..
కావాల్సినవి
కోవా– ఒక కప్పు, మైదా– అర కప్పు,
చక్కెర– ఒక కప్పు, యాలకుల పొడి– టీ స్పూన్, డ్రై ఫ్రూట్ పలుకులు కొన్ని, నెయ్యి– మూడు టేబుల్ స్పూన్లు, ఉప్పు– చిటికెడు, కుంకుమ పువ్వు– 4 రెమ్మలు, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ
ఒక కప్పు చక్కెరలో అర గ్లాసు నీళ్లు పోసి తీగ పాకం పట్టాలి. అందులో కుంకుమ పువ్వు, యాల కుల పొడి వేయాలి. కోవాలో 4 స్పూన్ల చక్కెర, తరిగిన డ్రై ఫ్రూట్స్ పలుకులు వేసి కలపాలి. మైదా పిండిలో చిటికెడు ఉప్పు, నెయ్యి, నీళ్లు పోసి కలిపి, అరగంట పక్కన పెట్టాలి. ఆ పిండిని కావాల్సిన సైజ్‌లో ఉండలు చేసి, వాటి మధ్యలో కోవా, డ్రై ఫ్రూట్ మిక్స్‌ని పెట్టి కచోరిల్లా చేయాలి.
తరువాత స్టవ్ సిమ్‌లో పెట్టి పాన్‌లో నూనె పోసి కచోరిలను డీప్ ఫ్రై చేయాలి. వాటిని తయారుచేసి పెట్టుకున్న పాకంలో వేస్తే మావా కచోరి రెడీ.
సాబుదాన ఖీర్
కావాల్సినవి
సాబుదాన– ఒక కప్పు, నీళ్లు – ఒక కప్పు, పాలు– లీటర్, చక్కెర– అరకప్పు, బాదం, పిస్తా పలుకులు– కొన్ని, జీడిపప్పు– సరిపడా, ఎండుకొబ్బరి ముక్కలు– 4, కుంకుమపువ్వు–
5 రెమ్మలు, యాలకులు పొడి కొంచెం
తయారీ
సాబుదానా (సగ్గు బియ్యం) కడిగి, ఒక కప్పు నీళ్లల్లో రెండు గంటలు నానబెట్టాలి. జీడిపప్పు, ఎండు కొబ్బరిని నేతిలో వేగించి పక్కన పెట్టాలి. తరువాత గ్యాస్ స్టవ్ హైలో పెట్టి, కడాయిలో పాలు పోసి మరిగించాలి. పాలు మీగడ కడుతున్నప్పుడు స్టవ్ సిమ్‌లో పెట్టి అందులో నానబెట్టిన సాబుదాన వేయాలి. సాబుదాన ఉడికి పైకి తేలాక అందులో చక్కెర, బాదం, పిస్తా, జీడిపప్పు, కుంకుమ పువ్వు వేసి కలపాలి. తరువాత యాలకుల పొడి, వేగించిన జీడిపప్పు, కొబ్బరిని నెయ్యితో సహా అందులో వేసి కలపాలి. పాలు దగ్గరికి రాగానే స్టవ్ ఆపేయాలి. అంతే టేస్టీ ఖీర్ రెడీ.
మోతీ పాక్
కావాల్సినవి
శెనగ పిండి– ఒక కప్పు , చక్కెర– ఒక కప్పు, యాలకులపొడి– రెండు టేబుల్ స్పూన్లు, నెయ్యి– నాలుగు స్పూన్లు, నూనె– వేగించేందుకు సరిపడా, స్వీట్ కోవా– ఒక కప్పు, ఫుడ్ కలర్ కొంచెం
తయారీ
ఒక గిన్నెలో శెనగ పిండి, ఒకటిన్నర కప్పు నీళ్లు పోసి బాగా కలపాలి. ఆ పిండితో బూందీ చేయాలి. ఈ బూందీ మోతీ చూర్ లడ్డూకి చేసే బూందీ సైజ్‌లో ఉండాలి. పాన్‌లో ఒక కప్పు నీళ్లు పోయాలి. చక్కెర వేసి తీగ పాకం పట్టాలి. అందులో ఫుడ్ కలర్, కోవా వేసి రెండింటినీ బాగా కలపాలి. తరువాత బూందీని పాకంలో వేసి, దానిపై నెయ్యి వేస్తూ కలపాలి. బూందీ పాకాన్ని బాగా పీల్చుకున్నాక స్టవ్ ఆపేసి, మిశ్రమాన్ని మైసూర్ పాక్‌లా ప్లేట్‌లో పోయాలి. చల్లారాక కావాల్సిన షేప్‌లో మోతీపాక్‌ని కట్ చేయాలి.