- ఒకరికి సీరియస్
- నాగర్ కర్నూలు జిల్లా జొన్నలబొగుడ వద్ద ప్రమాదం
కోడేరు, వెలుగు: నాగర్ కర్నూలు జిల్లాలో టైరు పేలి టాటా ఏస్ బోల్తా పడిన ఘటనలో ముగ్గురు విద్యార్థులు గాయపడగా ఒకరికి సీరియస్ గా ఉంది. పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ హైస్కూల్ కు చెందిన 9 వతరగతి విద్యార్థులు పార్ట్ టు బుక్స్ తీసుకొచ్చుకునేందుకు మంగళవారం మధ్యాహ్నం టాటా ఏస్ లో పెద్దకొత్తపల్లి ఎంఈవో ఆఫీసుకు వెళ్లారు.
తిరిగి వెళ్తుండగా బాచారం– జొన్నలబొగుడ శివారులో టాటాఏస్ టైరు పేలిపోవడంతో బోల్తా పడింది. దీంతో చిన్నప్పరావుపల్లికి చెందిన విద్యార్థులు శివ, నాని, ఖాసీం, కొత్తపేటకు చెందిన ఆనంద్, మారేడుమాన్ దిన్నెకు చెందిన నందు చరణ్ తేజ గాయపడ్డారు. వెంటనే నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శివకు సీరియస్ గా ఉండడంతో హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రికి పంపించారు.
తాతాపూర్ గ్రామానికి చెందిన డ్రైవర్ చౌకుల చంద్రశేఖర్ కు ఎలాంటి గాయాలు కాలేదు. పెద్దకొత్తపల్లి పీఎస్ లో విద్యార్థి ఆనంద్ తండ్రి నీరెడ్డి మల్లేశ్ ఫిర్యాదు చేయడంతో డ్రైవర్ చంద్రశేఖర్ పై కేసు నమోదు చేశామని ఎస్ఐ వి.సతీశ్ తెలిపారు. ఘటనపై కలెక్టర్ బాదావత్ సంతోష్ స్పందించారు. సాతాపూర్ హైస్కూల్ హెడ్మాస్టర్ ఎం.శ్రీశైలంను సస్పెండ్చేశారు. ఎంఈవో కె.శ్రీనివాసరెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
