టాటా క్యాపిటల్ ఐపీఓ ధర రూ.326

టాటా క్యాపిటల్ ఐపీఓ ధర రూ.326
  • ఈ నెల 6న ఓపెనై, 8 న ముగియనున్న ఇష్యూ

న్యూఢిల్లీ: టాటా క్యాపిటల్‌‌‌‌ తన ఐపీఓ ప్రైస్ రేంజ్‌‌‌‌ను  రూ.310–రూ.326గా నిర్ణయించింది. ఈ ఏడాది జులైలో జరిగిన కంపెనీ రైట్స్ ఇష్యూలో షేరు ధర రూ.343 గా ఉంది. దీంతో పోలిస్తే ఐపీఓ ధర  5శాతం తక్కువ. ఈ పబ్లిక్ ఇష్యూ ఈ నెల  6న ఓపెనై, 8న ముగుస్తుంది.  “ఇన్‌‌‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు షేర్లను ఎక్కువ ధరకు కొనుగోలు చేయడానికి   సిద్ధంగా ఉన్నా, మా బోర్డు రిటైల్‌‌‌‌కు అనుకూలంగా ధరను నిర్ణయించింది” అని టాటా క్యాపిటల్‌‌‌‌ సీఈఓ రాజీవ్ సబర్వాల్ తెలిపారు.  కంపెనీ రూ.2.3 లక్షల కోట్లకు పైగా లోన్ బుక్‌‌‌‌ను నిర్వహిస్తోంది.  ఇందులో 88శాతం వాటా రిటైల్, ఎస్‌‌‌‌ఎంఈ లోన్లది ఉంది.  

రిటైల్‌‌‌‌ లోన్ బుక్‌‌‌‌లో హోమ్‌‌‌‌ లోన్ల వాటా మూడో వంతుకు పైనే ఉంటుంది. ఈ ఐపీఓ ద్వారా రూ.15,512 కోట్ల వరకు సమీకరించాలనే టాటా క్యాపిటల్ టార్గెట్ పెట్టుకుంది.  ఇది ఈ సంవత్సరంలో వచ్చిన అతిపెద్ద ఐపీఓ కానుంది. ఐపీఓలో 47.58 కోట్ల షేర్లను అమ్ముతారు.  21 కోట్ల ఫ్రెష్ షేర్ల ఇష్యూ,  26.58 కోట్ల ఆఫర్ ఫర్ సేల్ ఇష్యూ ఉంటాయి. టాటా సన్స్  23 కోట్ల షేర్లను, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్  3.58 కోట్ల షేర్లను అమ్మనున్నాయి.  

ప్రస్తుతం కంపెనీలో టాటా సన్స్‌‌‌‌ వద్ద 88.6శాతం, ఐఎఫ్‌‌‌‌సీ వద్ద 1.8శాతం వాటా ఉంది.  ఐపీఓ ద్వారా వచ్చిన నిధులను టైర్‌‌‌‌‌‌‌‌1 మూలధనాన్ని బలపర్చేందుకు, భవిష్యత్ అవసరాలకు వినియోగించనున్నారు. ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ  నియమాల ప్రకారం,  పెద్ద ఎన్‌‌‌‌బీఎఫ్‌‌‌‌సీగా గుర్తింపు పొందిన టాటా క్యాపిటల్‌‌‌‌ మూడేళ్లలో మార్కెట్‌‌‌‌లో లిస్టింగ్ కావాలి.