ఇవేకోను కొననున్న టాటా మోటార్స్‌‌‌‌..డీల్‌‌‌‌ విలువ రూ.39 వేల కోట్లు

ఇవేకోను కొననున్న టాటా మోటార్స్‌‌‌‌..డీల్‌‌‌‌ విలువ రూ.39 వేల కోట్లు

న్యూఢిల్లీ: ఇటలీకి చెందిన ట్రక్‌‌‌‌ల  తయారీ కంపెనీ ఇవేకోను 4.5 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.39 వేల కోట్ల) కు కొనుగోలు చేయాలని టాటా మోటార్స్‌‌‌‌ చూస్తోంది. కోరస్‌‌‌‌ను  12.1 బిలియన్ డాలర్లు (రూ.1.04 లక్షల కోట్లు)  పెట్టి 2007 లో టాటా గ్రూప్ కొనుగోలు చేసింది. ఇవేకోతో డీల్ పూర్తయితే టాటాకు ఇది  రెండో అతిపెద్ద డీల్‌‌‌‌గా నిలుస్తుంది.  2008లో జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌)ను 2.3 బిలియన్‌‌‌‌ డాలర్లకు కొనుగోలు చేసిన టాటా మోటార్స్, తాజా డీల్‌‌‌‌తో తన రికార్డును అధిగమించనుంది. అగ్నెల్లి కుటుంబం యాజమాన్యంలోని ఎక్సోర్ నుంచి 27.1శాతం వాటాను (43.1శాతం ఓటింగ్ హక్కులు) కొనుగోలు చేసి, మిగిలిన షేర్ల కోసం టెండర్ ఆఫర్ ప్రారంభించాలని టాటా మోటార్స్ చూస్తోంది. 

ఇవేకో డిఫెన్స్ విభాగం ఈ ఒప్పందంలో భాగం కాదు.  ఈ ఏడాది చివరిలో ఈ విభాగాన్ని సపరేట్‌‌‌‌గా అమ్మాలని చూస్తున్నారు.  ఇవేకోను కొనుగోలు చేస్తే  యూరప్ (ఇవేకో ఆదాయంలో 74శాతం), ఉత్తర, లాటిన్ అమెరికాలో మార్కెట్ విస్తరించడానికి టాటా మోటార్స్‌‌‌‌కు వీలుంటుంది.  గత 6 వారాలుగా చర్చలు జరుగుతున్నాయని,  ఆగస్టు 1న  ఒప్పందం జరగొచ్చని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. టాటా మోటార్స్ సబ్సిడరీ ద్వారా ఈ డీల్ జరుగుతుందని చెప్పారు.