ఆక్సిజన్ సరఫరాకు ముందుకొచ్చిన టాటా స్టీల్, సెయిల్

ఆక్సిజన్ సరఫరాకు ముందుకొచ్చిన టాటా స్టీల్, సెయిల్

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్ రూపంలో మహమ్మారి విజృంభిస్తోంది. కొవిడ్ పేషెంట్లకు ట్రీట్‌‌మెంట్‌‌లో మెడికల్ ఆక్సిజన్ కీలకంగా మారింది. అయితే డిమాండ్‌కు తగ్గట్లుగా సప్లయ్ లేకపోవడంతో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్‌ఎంవో) కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేయడానికి ప్రముఖ సంస్థలు టాటా స్టీట్, సెయిల్, ఏఎంఎన్‌‌ఎస్‌‌లు ముందుకొచ్చాయి. రోజువారీగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు, ఆస్పత్రులకు 200 నుంచి 300 టన్నుల మెడికల్ ఆక్సిజన్‌‌ను సరఫరా చేస్తామని టాటా స్టీల్ ప్రకటించింది. కరోనాపై పోరులో పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని, ఉమ్మడిగా ఫైట్ చేస్తే వైరస్ పై గెలుస్తామని టాటా స్టీల్ ట్వీట్ చేసింది. 

సెయిల్ స్టీల్ కూడా లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌‌ను ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాలకు సరఫరా చేశామని తెలిపింది. జార్ఖండ్‌‌లోని బొకరో, ఛత్తీస్‌గఢ్‌‌లోని భిలాయి, ఒడిషాలోని రూర్కెలా, దుర్గాపూర్, బెంగాల్‌లోని బర్నాపూర్‌‌కు కలిపి మొత్తంగా 33 వేల టన్నులకు పైగా లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌‌ను సప్లయ్ చేశామని పేర్కొంది. కరోనాతో నెలకొన్న విషమ పరిస్థితుల్లో ట్రీమ్‌‌మెంట్‌కు అవసరమైన ఆక్సిజన్ సరఫరాకు తాము రెడీగా ఉన్నామని ఆర్కెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా (ఏఎంఎన్ఎస్ ఇండియా) తెలిపింది. గుజరాత్‌‌లో హెల్త్ ఫెసిలిటీస్‌‌లో భాగంగా రోజుకు 200 టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేశామని ఏఎంఎన్ఎస్ ఇండియా పేర్కొంది.