
పాత పద్ధతి, కొత్త విధానం రెండూ ఉంటాయ్
80 సీ సహా డిడక్షన్స్ కుంటే
మధ్యతరగతి ప్రజలకు, వేతన జీవులకు ఊరటనిచ్చేలా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయపు పన్ను రేట్లలో భారీ మార్పులు చేశారు. కొత్త శ్లాబులను ప్రకటించడమే కాకుండా.. శ్లాబులపై ఉన్న పన్ను రేట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. పన్ను రేట్లను తగ్గిస్తూనే.. నిర్మలా పలు మెలికలు పెట్టారు. కొత్త పన్ను విధానం కావాలంటే.. మినహాయింపులను, డిడక్షన్లను వదులుకోవాలని షరతులు పెట్టారు. ఒకవేళ మినహాయింపులు, డిడక్షన్స్ కావాలంటే పాత పన్ను విధానాన్నే కొనసాగించుకోవచ్చని పన్ను చెల్లింపుదారులకు చెప్పారు. ఏది కావాలో ఎంపిక చేసుకునే స్వేచ్ఛ పన్ను చెల్లింపుదారులకే ఇస్తున్నట్టు తెలిపారు.
కొత్త ప్రపోజల్ ప్రకారం… జీరో నుంచి రూ.2.5 లక్షల ఆదాయం ఆర్జించే వారికి ఎలాంటి పన్ను లేదు. రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలు ఆదాయం వచ్చే వారికి 5 శాతం పన్ను ఉంది. అంతకుముందు కూడా వీరికి ఇదే పన్ను ఉండేది. రూ.5 లక్షల నుంచి రూ.7.5 లక్షల ఆదాయం ఉన్న వారికి కొత్త పన్ను విధానం ప్రకారం 10 శాతం ప్రపోజ్ చేశారు. అంతకుముందు వీరికి 20 శాతం పన్ను ఉండేది. అంటే 10 శాతం మేర వీరికి పన్నులు తగ్గాయి. రూ.7.5 లక్షల నుంచి రూ.10 లక్షల ఆదాయం ఉన్న వారిపై 15 శాతం… రూ.10 లక్షల నుంచి రూ.12.5 లక్షల ఆదాయం వచ్చే వారిపై 20 శాతం.. రూ.12.5 లక్షల నుంచి రూ.15 లక్షల ఆదాయం వచ్చే వారిపై 25 శాతం.. రూ.15 లక్షల పైన ఆదాయం వచ్చే వారిపై 30 శాతం పన్నులు వేయాలని ప్రతిపాదించారు. ఈ ప్రపోజల్స్‌తో ఏడాదికి రూ.40 వేల కోట్ల రెవెన్యూను వదులుకోవాల్సి వస్తుందని నిర్మలా అన్నారు.
పూర్తి స్వేచ్ఛ ట్యాక్స్‌పేయర్లకే…
గతంలో ఆదాయపు పన్ను శ్లాబులు ఐదే ఉండేవి. కొత్త విధానంలో ఏడు పన్ను శ్లాబులు వచ్చాయి. ఈ కొత్త విధానంలో 70 రకాల మినహాయింపులను, డిడక్షన్స్‌ను తొలగిస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఈ మినహాయింపులు, డిడక్షన్స్ కావాలంటే పాత విధానాన్నే ఎంపిక చేసుకోవచ్చని చెప్పారు. అంటే ఏ పన్ను విధానం ఎంపిక చేసుకోవాలో పూర్తి స్వేచ్ఛ పన్ను చెల్లింపుదారులకే ఇచ్చారు. మొత్తంగా పాత పన్ను విధానంలో 100 రకాల ట్యాక్స్ మినహాయింపులను, డిడక్షన్లను ప్రభుత్వం కల్పించేది. మిగత మినహాయింపులు, డిడక్షన్లను కూడా పరిశీలిస్తున్నామని నిర్మలా చెప్పారు. కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ విధానంలో తొలగించిన ముఖ్యమైన డిడక్షన్స్, మినహాయింపుల్లో లీవ్ ట్రావెల్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, సెక్షన్ 80సీ, సెక్షన్ 80డీలో ఉండే స్టాండర్డ్ డిడక్షన్, ఛాప్టర్ 6ఏ వంటివి ఉన్నాయి. కొత్త పన్ను విధానం ఎందుకు ఎంపిక చేసుకోవాలో చెబుతూ… ఏడాదికి రూ.15 లక్షల పైన ఆదాయం ఆర్జించే వారికి, ఈ కొత్త విధానంలో రూ.78 వేల వరకు పన్నుల్లో మిగులుతాయని చెప్పారు. కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ ప్రపోజల్స్ 2020–21 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వస్తాయని నిర్మలా ప్రకటించారు.
ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం సులభతరం….
ఐదు లక్షల వరకు ఆదాయం వచ్చే వారు, ఏ పన్ను విధానాన్ని ఎంపిక చేసుకున్నా ఎలాంటి తేడా ఉండదు. రెండు విధానాలోనూ ఒకే పన్ను ఉంది. ప్రస్తుత పన్ను విధానం పలు రకాల మినహాయింపులు, డిడక్షన్లతో పన్ను చెల్లింపుదారులకు క్లిష్టంగా ఉందని నిర్మలా అన్నారు. ట్యాక్స్ అథారిటీలకు కూడా ఈ ప్రాసెస్ భారంగా ఉందన్నారు. ప్రొఫిషనల్స్ సాయం తీసుకోకుండా.. ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టానికి కట్టుబడి ఉండటం ట్యాక్స్ పేయర్లకు సాధ్యం కావడం లేదని చెప్పారు. ఈ క్రమంలో భాగంగా ఇండివిడ్యువల్ ట్యాక్స్‌పేయర్లకు భారీ ఊరటనిచ్చేలా.. ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టాన్ని సులభతరం చేస్తున్నట్టు చెప్పారు. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలకు ఇది చాలా పెద్ద ఊరట అని పేర్కొన్నారు. ఇండివిడ్యువల్స్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్‌లో రెండు రేట్లలోకి మార్చుకునే అవకాశం ఉండగా.. వ్యాపారస్తులు మాత్రం ఒకేసారి నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అంటే ఏదైనా పద్ధతిని వారు ఎంచుకుంటే, దాన్నే ప్రతేడాది కొనసాగించాలి.