జగన్​ పాలనలో నాతో సహా అందరూ బాధితులే: చంద్రబాబు

జగన్​ పాలనలో నాతో సహా అందరూ బాధితులే: చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బెయిల్ పై బయటకు వచ్చిన తరువాత రాజకీయంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు.అందులో భాగంగానే రా.. కదలిరా పేరుతో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు.   తిరువూరులో జరిగిన సభలో జగన్​ పాలనలో నాతో సహా అంతా బాధితులే అన్నారు. ముందుగా ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో నిర్వహించిన ‘రా.. కదలి రా’ బహిరంగ సభకు చంద్రబాబుతో పాటు పలువురు పార్టీ ముఖ్యనేతలు, జిల్లా కో అర్డినేటర్లు, పార్టీ ఇన్ చార్జిలు పాల్గొన్నారు. అన్ని విధాలా నష్టపోయిన ఏపీని కాపాడుకునేందుకు ప్రజలందరూ కదలి రావాలని పిలుపునిచ్చారు.

సీఎం జగన్ (CM Jagan) పాలనలో ఏపీ 30 ఏళ్లు వెనక్కు వెళ్లిందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు  మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో (Tiruvuru) ఆదివారం నిర్వహించిన 'రా కదలిరా' బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. నాలుగున్నరేళ్ల కాలంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ కోలుకోలేని విధంగా దెబ్బతీశారని విమర్శించారు. జగన్ పాలనలో రాష్ట్రంలో నాతో సహా ప్రజలందరూ బాధితులేనని అన్నారు. ఓ పక్క హైదరాబాద్ వెలిగిపోతుంటే.. ఇక్కడ అమరావతి వెలవెలబోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజాస్వామ్యంలో ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాను. ఈ అరాచక పాలనకు చరమ గీతం పాడాలి.' అని పిలుపునిచ్చారు. 

అమరావతే రాజధాని 

టీడీపీ హయాంలో ఏపీ రాజధానిగా అమరావతిని (Amaravathi) ప్రకటించినప్పుడు, సీఎం జగన్ మద్దతు పలికారని.. ఇప్పుడు 3 రాజధానులంటూ మాట మార్చారని చంద్రబాబు దుయ్యబట్టారు. స్వయంగా ప్రధాని మోదీ (PM Modi) వచ్చి అమరావతికి ఫౌండేషన్ వేశారని.. ఇప్పుడు రాజధాని ఏదీ అంటే చెప్పుకోలేని స్థితిలో ఉన్నామని మండిపడ్డారు. రుషికొండను బోడిగుండును చేసి రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టారని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వస్తే రాజధానిగా అమరావతే ఉంటుందని స్పష్టం చేశారు.

మహిళలకు ఫ్రీ బస్ జర్నీ

 టీడీపీ అధికారంలోకి రాగానే మహిళలందరికీ మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు ప్రయాణంతో పాటు  కింద నెలకు రూ.1500 అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే, తల్లికి వందనం కింద రూ.15 వేలు, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు. సంక్షేమ పథకాలకు నాంది పలికింది టీడీపీయేనని.. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక వంద పథకాలను రద్దు చేశారని మండిపడ్డారు.

సూపర్ సిక్స్

 బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ పేరిట సూపర్ సిక్స్ అందిస్తామని అన్నారు. నిరుద్యోగులకు రూ.3 వేల భృతి అందిస్తామని.. ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు. 'జయహో బీసీ' కింద ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. 'అన్నదాత' కింద రైతులకు రూ.20 వేలు అందజేస్తామన్నారు. త్వరలోనే టీడీపీ - జనసేన ఆధ్వర్యంలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తామని చెప్పారు.

ప్రపంచంలో తెలుగుజాతి నంబర్‌ వన్‌గా ఉండాలనేదే తన ఆకాంక్ష అని చెప్పుకొచ్చారు. తెలుగు ప్రజలు ప్రపంచ రాజకీయాల్లో రాణించే పరిస్థితి వస్తుందని కితాబిచ్చారు. తెలుగుజాతి గ్లోబల్‌ నాయకులుగా ఎదిగేందుకు తెలుగుదేశం పార్టీ ఎంతగానో ఉపయోగపడిందని వివరించారు. రైతుల బ్రతుకులు మారాలంటే టీడీపీ-జనసేనల ప్రభుత్వం అధికారంలోకి రావాలని చెప్పారు. మరో మూడు నెలల్లో రైతు రాజ్యం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.