వచ్చే ఎన్నికల్లో యూత్​కే 40% టికెట్లు

వచ్చే ఎన్నికల్లో యూత్​కే 40% టికెట్లు
  • 40 ఏళ్లలో రాజకీయాల్లో చరిత్ర సృష్టించినం: చంద్రబాబు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్టీ రామారావు తెలుగు దేశం పార్టీని స్థాపించారని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు గుర్తు చేశారు. మంగళవారం టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎన్టీఆర్ పార్టీ ప్రకటన చేసిన ప్లేస్ దగ్గర చంద్రబాబు మాట్లాడారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అంతకుముందు జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో టీడీపీ జెండాను ఎగురవేశారు. ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులు అర్పించి, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతం టికెట్లు యువతకే ఇస్తామని ప్రకటించారు. 1983 లో యూత్ రాజకీయాల్లోకి వచ్చినట్లు ఇపుడు కూడా రావాలని ఆయన పిలుపునిచ్చారు. టీడీపీ గెలుపు చారిత్రాత్మక అవసరమని ఆయన అన్నారు. అనంతరం ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద  మీడియాతో మాట్లాడారు. గత 40 ఏండ్లలో ఎన్నో రికార్డులతో చరిత్ర సృష్టించామని చంద్రబాబు అన్నారు.  తెలుగు వాళ్లు ఉన్నంతకాలం టీడీపీ ఉంటుందని, తెలుగు ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచే వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. పార్టీ ఆవిర్భావం సందర్భంగా తెలంగాణకు చెందిన 17 మంది పార్టీ కార్యకర్తలను, పలువురు నేతలను చంద్రబాబు సన్మానించారు.