టీడీపీ మనకు ఇన్‌‌స్పిరేషన్‌‌ : కేసీఆర్

టీడీపీ మనకు ఇన్‌‌స్పిరేషన్‌‌ : కేసీఆర్
  •  పాతాళానికి పడి, మళ్లీ గెలిచింది 
  • ఎన్టీఆర్​కే ఒడిదుడుకులు తప్పలేదు
  • కొన్నిసార్లు ఓటమి కూడా మంచిదే
  • గుర్రమేదో గాడిదేదో ప్రజలు తెలుసుకుంటరు
  • ఓటమిని మర్చిపోయి.. ధైర్యంగా ముందుకెళ్లాలని సూచన
  • నాలుగు ఎంపీ సీట్లకు అభ్యర్థుల ప్రకటన
  • మహబూబాబాద్‌‌ అభ్యర్థిగా మాలోతు కవిత, 
  • ఖమ్మం నుంచి నామా, పెద్దపల్లి  నుంచి కొప్పుల, 
  • కరీంనగర్‌‌‌‌ నుంచి వినోద్‌‌ పేర్లు ఖరారు

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల ఓటమిని తల్చుకుని కుంగిపోవద్దని, ఆ విషయాన్ని మర్చిపోయి ధైర్యంగా ముందుకు సాగాలని పార్టీ నాయకులకు బీఆర్‌‌‌‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సూచించారు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీని ఇన్‌‌స్పిరేషన్‌‌గా తీసుకోవాలన్నారు. ఆ పార్టీ పాతాళానికి పడిపోయి కూడా మళ్లీ గెలిచిందని గుర్తుచేశారు. ఎన్టీఆర్ వంటి మహా నాయకుడికే ఒడిదుడుకులు తప్పలేదని, ఆయన ముందు మనమెంత అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కొన్నిసార్లు ఓడిపోవడం కూడా మంచిదేనన్నారు.

 ఈ ఓటమితో గుర్రం ఏదో, గాడిద ఏదో తెలుసుకునే అవకాశం ప్రజలకు వచ్చిందన్నారు. ‘‘ప్రభుత్వంలో ఉండి చేయాల్సినంతా చేసినా, ప్రజలు మనల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. మన విలువ ఏంటో త్వరలోనే వాళ్లు తెలుసుకుంటారు. ఇప్పటికే కాంగ్రెస్ మీద వ్యతిరేకత మొదలైంది. దీన్ని మనకు అనుకూలంగా మల్చుకోవాలి. ఇందుకు అనుగుణంగా కసిగా పనిచేసి, పార్టీ అభ్యర్థులను గెలిపించాలి”అని మహబూబ్‌‌నగర్, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. 

ఆ రెండు నియోజకవర్గాల సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, ఇతర నాయకులతో తెలంగాణ భవన్‌‌లో కేసీఆర్‌‌‌‌ సోమవారం భేటీ అయ్యారు. మహబూబాబాద్‌‌లో సిట్టింగ్ ఎంపీ మాలోతు కవితకు, ఖమ్మంలో సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు టికెట్‌‌ ఇస్తున్నామని, వారి గెలుపు కోసం పనిచేయాలని కేసీఆర్ సూచించారు. 

ఈ రెండు సెగ్మెంట్​లకు ఎన్నికల ఇన్​చార్జ్‌‌లుగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి రెడ్డిని నియమించారు. వారితో కోఆర్డినేట్ చేసుకుని పనిచేయాలన్నారు. ఖమ్మంలో త్వరలోనే పార్టీ భారీ బహిరంగ సభ ఉంటుందని, ఆ సభను విజయవంతం చేయాలన్నారు.

భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు గైర్హాజరు

కేసీఆర్‌‌‌‌ సమావేశానికి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గైర్హాజరయ్యారు. ఆదివారం ఆయన  కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రేవంత్‌‌రెడ్డిని కలిసిన సంగతి తెలిసింది. ఈ విషయాన్ని కేసీఆర్​ పరోక్షంగా ప్రస్తావిస్తూ.. పార్టీని వీడి వెళ్లే నేతలతో నష్టమేమీ లేదని వ్యాఖ్యానించినట్టు సమావేశంలో పాల్గొన్న నాయకులు తెలిపారు. అంతకుముందు భద్రాచలం నియోజకవర్గానికి చెందిన బీఆర్‌‌‌‌ఎస్ నాయకులు హరీశ్‌‌ రావును కలిశారు. కేసీఆర్‌‌‌‌తో భేటీ తర్వాత ఖమ్మం, మహబూబాబాద్ నాయకులతో హరీశ్​ వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. 

ఆరుగ్యారంటీల అమలులో ప్రభుత్వ వైఫల్యం, రైతులకు నీళ్లు ఇవ్వకపోవడం, కరెంట్ కోతలు వంటి అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. ఈ నెల 17తో కాంగ్రెస్ 100 రోజుల పాలన పూర్తి చేసుకుంటుందని, ఆ తర్వాతి రోజు నుంచి కాంగ్రెస్‌‌ను ఎండగట్టాలని, వారు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేలా ఒత్తిడి చేయాలని సూచించారు.

కొప్పుల, వినోద్‌‌కు కన్ఫామ్‌‌

మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌‌‌‌కు పెద్దపల్లి టికెట్‌‌, మాజీ ఎంపీ బోయిన్‌‌పల్లి వినోద్‌‌ కుమార్‌‌‌‌కు కరీంనగర్‌‌‌‌ టికెట్ ఇస్తున్నట్టు కేసీఆర్ సోమవారం అధికారికంగా ప్రకటించారు. ఈ రెండు నియోజకవర్గాల నేతలతో కేసీఆర్ ఆదివారమే వేర్వేరుగా సమావేశమయ్యారు. ఆదివారం ముహూర్తం బాలేనందున, సోమవారం అధికారికంగా వారి పేర్లను ప్రకటించారు. సమావేశంలో పార్టీ జనరల్ సెక్రటరీ, ఎంపీ కే.కేశవరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు.