
చదువుల కోసం ఇల్లు, ఊరు, తల్లిదండ్రులను వదిలి వచ్చిన విద్యార్థులను కంటికి రెప్పలా కాచుకోవాల్సిన టీచర్.. వాళ్ల పాలిట శాపంగా మారాడు. ప్రత్యేక అధికారిపై ఉన్న కోపాన్ని పిల్లలపై చూపించాడు. అదికూడా వారి చావును కోరుకున్నాడు ఈ కిరాతక టీచర్. పిల్లలు తాగే నీళ్లలో గడ్డిమందు కలిపిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలకలం రేపింది. శనివారం (ఆగస్టు 23)న జరిగిన ఈ ఘటనలో 11 మంది విద్యార్థులు అస్వస్థకు గురవ్వడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని గాంధీ నగర్ లో రెసిడెన్షియల్ స్కూల్ నడుస్తోంది. ఈ స్కూల్లో 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు 30 మంది విద్యార్థులు చదువుతున్నారు. శుక్రవారం ఉదయం టిఫిన్ చేసిన తర్వాత 11 మంది విదార్థులు నీటిని తాగి అస్వస్థతకు గురయ్యారు. ఆందోళన చెందిన టీచర్లు విద్యార్థులను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు.
విద్యార్థులు తాగిన నీటిలో విషం కలిసినట్లు డాక్టర్లు నిర్ధారించారు. నీళ్లలో గడ్డి మందు కలిసినట్లు తేలటంతో.. విచారణ చేపట్టారు. జిల్లా ఎస్పీ విద్యార్థులను అడిగి వివరాలు తెలసుకున్నారు. ఉపాధ్యాయునికి, అధికారికి మధ్య వివాదాలు ఉన్నట్లు విద్యార్థులు తెలిపారు. అదే విధంగా నీటిలో గడ్డి మందు కలిపినట్లు విద్యార్థులు చెప్పారు. మందు కలిపిన సీసా కూడా తమ గదిలో దొరికినట్టు విద్యార్థులు తెలిపారు.
ప్రత్యేక అధికారిని ఇరికించేందుకు ఆ ఉపాధ్యా యుడు నీళ్లల్లో గడ్డి మందు కలిపాడని ఆరోపిస్తున్నా రు. గడ్డి మందు నీళ్లల్లో కలిపిన ఆ ఉపాధ్యాయుడు ఆ నెపాన్ని తమపై నెట్టేయడానికి గడ్డిమందు వాసన వచ్చేలా తమ దుప్పట్లపై దాన్ని చల్లాడని తెలిపారు.
శనివారం ఉదయం హాస్టల్ ను సందర్శించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, అడిషనల్ కలెక్టర్ విజయ లక్ష్మి, డీఎస్పీ సంపత్ రావు విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యి వివరాలు సేకరించారు. పాఠశాలలో పనిచేస్తున్న ఎస్ వో, మరో ముగ్గురు ఉపాధ్యాయులకు తరచుగా గోడవలు జరుగుతున్నాయని విద్యార్థులు తెలిపారు. ముగ్గురు ఉపాధ్యాయులు తరచూ తమను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థులు ఇచ్చిన సమాచారం మేరకు.. ఈ ఘటనకు పాల్పడిన టీచర్ తో పాటు మరో ముగ్గురిని సస్పెండ్ చేశారు జిల్లా కలెక్టర్. గడ్డి మందు కలిపిన ఉపాధ్యాయుడు రాజేందర్తో పాటు మరో ఇద్దరు ఉపాధ్యాయులు వేణు, సూర్యప్రకాశ్, వంట కార్మికురాలు రాజేశ్వరిని విధుల నుంచి తొలగిస్తున్నట్టు శనివారం రాత్రి ఉత్త ర్వులు జారీ చేశారు.