విశ్లేషణ: సీనియర్, జూనియర్​ అంటూ ఉద్యోగులు, టీచర్లను చీలుస్తరా?

విశ్లేషణ: సీనియర్, జూనియర్​ అంటూ ఉద్యోగులు, టీచర్లను చీలుస్తరా?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో పోరుబాట పట్టి.. సకల జనుల సమ్మె చేసి ప్రత్యేక తెలంగాణ సాధించుకున్న ఉద్యోగులు, టీచర్లకు స్వరాష్ట్రంలోనే అన్యాయం జరుగుతోంది. వారి సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పీఆర్సీని అమలు చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. పైగా వారికి న్యాయంగా రావాల్సిన ప్రమోషన్లు, బదిలీలు నిలిచిపోయాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 317 వ‌‌‌‌ల్ల ఉద్యోగులు, టీచర్ల స్థానికతకే ప్రమాదం ఏర్పడింది. ఈ జీవో కారణంగా స్థానికులైన ఉద్యోగులు.. జోనల్ విధానంతో వేరే జిల్లాలకు వెళ్లాల్సిన ప‌‌‌‌రిస్థితులు ఏర్పడ్డాయి. అలాగే సీనియర్, జూనియర్ అంటూ ఉద్యోగుల్లో చీలిక తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. జీవో 317ను వెంట‌‌‌‌నే వెనక్కి తీసుకుని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం చర్చించాలి. 

తెలంగాణ ఏర్పడే క్రమంలో రాజ్యాంగంలోని 371(డి) ఆర్టికల్ ను సవరించి, జిల్లా, జోనల్, మల్టీజోనల్ విధానం రద్దయి రాష్ట్ర ప్రభుత్వమే ఉద్యోగులు, టీచర్లకు సంబంధించిన క్యాడర్‌‌‌‌లను జిల్లా, జోనల్, మల్టీజోనల్ గా నిర్ణయిస్తుందని, దాంతోపాటు సర్వీస్ రూల్స్ కూడా రూపొందుతాయని అంతా భావించారు. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని 10 జిల్లాలతో ఏర్పాటు చేసి 371(డి) ఆర్టికల్​ను సవరించకుండా, రద్దు చేయకుండా అలాగే ఉంచేసింది పార్లమెంట్. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత పాలనా సంస్కరణల్లో భాగంగా 10 జిల్లాలను మొదట 31 జిల్లాలుగా ఆ తర్వాత 33 జిల్లాలుగా మార్చారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో కొత్త ఉద్యోగాలు చాలా వస్తాయని అంతా భావించినా ఆర్డర్ టు సర్వ్ లో భాగంగా పాత ఉద్యోగులపైనే పనిభారం మోపారు. రాష్ట్రపతి ద్వారా 2018లో జీఎస్ఈ (820) ఇ ఉత్తర్వు ద్వారా సవరణ అనుమతి పొందిన రాష్ట్ర ప్రభుత్వం జీవో 124 ద్వారా మొదట 31 జిల్లాలను 7 జోన్లుగా, 2 మల్టీ జోన్లుగా ఏర్పరిచి 36 నెలల్లోగా లోకల్ క్యాడరైజేషన్ చేస్తామని ఉత్తర్వులు ఇచ్చింది. 2021 జూన్​ 30న జారీ చేసిన జీవో 128 ద్వారా 33 జిల్లాలకు అనుమతిని కూడా పొందింది. ఈ ఉత్తర్వును అనుసరించి రాష్ట్రంలోని ఉద్యోగులు, టీచర్లను శాఖల వారీగా లోకల్ క్యాడరైజేషన్ చేస్తూ ఉత్తర్వులు వెలువరించారు. ఈ మొత్తం ప్రక్రియను చేపట్టే క్రమంలో ఇప్పటి వరకు ఉద్యోగాల్లో ఉన్నవారు ఆందోళన వ్యక్తం చేయగా పాత ఉద్యోగులకు లోకల్ క్యాడర్ ర్యాటిఫై చేసి రీటెయిన్ చేస్తామని, కొత్త ఉద్యోగాల నియామకాలకు కొత్త జిల్లాల వారీగా నోటిఫికేషన్ ఇచ్చి ఈ ఉత్తర్వులను వర్తింపచేసి నియామకాలు చేపడతామని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో ఉద్యోగులు, టీచర్లకు కొంత ఊరట లభించింది.

1975లో ఏం జరిగిందంటే..
1974లో 32వ రాజ్యాంగ సవరణ ద్వారా 371-డి ఆర్టికల్ ను చేర్చి ఆరు సూత్రాలకు రక్షణ కల్పించారు. రాజ్యాంగ అధికరణ 371(డి) పేరా 1 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగుల క్యాడర్లు, నియామకాలు, బదిలీలు, విధివిధానాలు రాష్ట్రపతి మాత్రమే రూపొందించి నిర్వహించాలని నిర్ధేశించారు. తద్వారా ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యారంగంలో సమన్యాయం చేయటానికి నిర్ణయించారు. ఈ ఆర్టికల్ ద్వారా రాష్ట్రపతికి సంక్రమించిన అధికారాలను ఆధారంగా చేసుకొని ఆరు సూత్రాల పథకం అమలుకు విధి విధానాలు రూపొందించి 1975లో రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా అదే ఏడాది జీవో 674, 728, 729 విడుదలయ్యాయి. ఈ ఉత్తర్వుల ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ ను ఆరు జోన్లుగా విభజించగా, అందులోని తెలంగాణ ప్రాంతంలోని జిల్లాలను 5, 6 జోన్ల పరిధిలోకి తెచ్చారు. 5వ జోన్​లో వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్​ ఉండగా, 6వ జోన్ లో హైదరాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, రంగారెడ్డిని చేర్చారు. లోకల్ క్యాడరైజేషన్ జరిగిన ఉద్యోగులను, టీచర్లను స్థానికత ఆధారంగా నాడు ర్యాటిఫై మాత్రమే చేసి తిరిగి వారు పనిచేస్తున్న స్థానాలకే వారిని రీటెయిన్ చేశారు. ఎవరినీ కదిల్చే ప్రయత్నం చేయలేదు. ఒకటిఅరా విజ్ఞప్తులను స్వీకరించి బదిలీలు చేశారు.

అప్పటి మాదిరిగా చేస్తే సరిపోయేది
1975లో మాదిరిగానే ఉద్యోగులు, టీచర్లను వారి స్థానికత ఆధారంగా ఆయా జిల్లా పోస్టుల్లో, జోనల్ పోస్టుల్లో, మల్టీ జోన్ పోస్టుల్లో ర్యాటిఫై చేసి రీటెయిన్ చేస్తే సరిపోయేది. జనాభా ప్రాతిపదికన ఏ జిల్లాలోనైనా తక్కువగా పోస్టులుంటే, ఇతర జిల్లాల్లోని మిగులు ఖాళీలను ఆ జిల్లాలకు తరలించడం ద్వారా కావచ్చు లేదా సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించడం ద్వారా కావచ్చు వాటిని కొత్త రిక్రూట్మెంట్ ద్వారా నింపితే సరిపోయేది. కానీ పుండొక చోట ఉంటే మందొక చోట రాసిన చందంగా ఇప్పుడు స్థానికత ప్రస్తావన లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం జీవో 317ను విడుదల చేసింది. ఉద్యోగులు, టీచర్ల స్థానికత ఆధారంగా కాకుండా సీనియారిటీ ఆధారంగా వారిని వారి పూర్వపు స్థానిక జిల్లాతోపాటుగా అందులోని మండలాలతో కొత్తగా ఏర్పడ్డ జిల్లాకు కావచ్చు ఆ మండలాలతోపాటు ఇతర జిల్లాలోని మండలాలతో ఏర్పడ్డ కొత్త జిల్లాకు కావచ్చు సీనియారిటీ ప్రాతిపదికన వారిచ్చిన అప్షన్ ప్రకారంగా అలాట్ చేయాలని చూస్తున్నది. వాస్తవానికి జీవో 317లో ఈ ప్రస్తావన ఎక్కడా లేదు. ఈ విధంగా చేయడం వలన జూనియర్లకు ఎక్కువ నష్టం జరుగుతుంది. ఉదాహరణకు హన్మకొండ జిల్లాను ఏర్పరిచేటప్పుడు కరీంనగర్ లోని మూడు మండలాలతోపాటు వరంగల్ లోని 11 మండలాలను కలిపి మొత్తం 14 మండలాలను ఒక జిల్లాగా చేశారు. కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఒక జూనియర్ టీచర్ 8 ఏండ్ల పాటు కాటారం, మహాముత్తారం మండలాల్లో ఎటువంటి రోడ్డు సౌకర్యం లేని గ్రామంలో పనిచేయడం వల్ల అతనికి గత టీచర్ల బదిలీల్లో ఎక్కువ ఎంటైటిల్మెంట్ పాయింట్స్ వచ్చి అతను ప్రస్తుత హన్మకొండ జిల్లాలోని కమలాపూర్ మండలానికి అలాట్ చేయబడ్డాడు అనుకుందాం. ఇప్పుడు ఆ టీచర్​ జూనియర్ కాబట్టి మళ్లీ అడవుల పాలు కావాల్సి వస్తోంది.

లోకల్​ వారు.. నాన్​ లోకల్​గా మారుతున్నరు
ఒకవేళ సీనియర్లందరినీ వారు కోరుకున్న జిల్లాలకు అలాట్ చేస్తే.. ఉదాహరణకు పాత కరీంనగర్ జిల్లాను తీసుకుంటే చాలా మంది సీనియర్లు హన్మకొండ జిల్లాలో ఉన్న మూడు మండలాలకు, కొత్త కరీంనగర్ జిల్లాకు సహజంగా అధిక ప్రాధాన్యత ఇస్తారు. మిగిలిన జూనియర్లంతా ప్రస్తుత భూపాలపల్లి జిల్లాలోని కాటారం, మహాముతారం, మల్​హాల్​రావు, మహదేవ్​పూర్, పలిమెల లాంటి మండలాలకు అలాట్ అవుతారు. పట్టణ ప్రాంతానికి అలాట్ చేయబడిన వాళ్లలో 80% మంది 2027 నాటికి రిటైర్ అవుతారు. ఆ ప్రాంతాల్లో కొత్త ఉద్యోగాల భర్తీ కూడా జరుగుతుంది. కానీ జూనియర్లు అలాట్ అయిన జిల్లాలో లేదా ప్రాంతాల్లో మరో 25 ఏండ్ల వరకు ఎటువంటి రిక్రూట్మెంట్ ఉండదు. దీంతో ఆ ప్రాంతాల్లోని ముఖ్యంగా ఎజెన్సీలోని ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులు భారీగా నష్టపోయే అవకాశం ఉంది. ఇప్పటిదాకా స్థానికులైనవారు స్థానికేతరులు కాబోతున్నారు. తట్టాబుట్టా సర్దుకుని తన కుటుంబాన్ని, బంధువులను, కష్టపడి నిర్మించుకున్న కలల సౌధాన్ని వదులుకుని కొత్త జిల్లాలో స్థానికుడు కావడానికి బయలుదేరాల్సి వస్తోంది. తెలంగాణ కోసం కొట్లాడి.. సకల జనుల సమ్మె చేసిన ఉద్యోగులు, టీచర్లకు సొంత రాష్ట్రం ఇస్తున్న నజరానా ఇది.

రీటెయిన్​ చేయడమే మంచిది
స్థానికతను నిర్ధారించి ఆ ఉద్యోగులను ర్యాటిఫై చేసి రీటెయిన్ చేయడానికి బదులుగా సీనియర్లు, జూనియర్ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు బదిలీ చేయడం సరైన విధానం కాదు. లోకల్ క్యాడరైజేషన్​కు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వక్రభాష్యం చెబుతూ దాని ముసుగులో బదిలీలకు తెరలేపడం విస్తుగొలుపుతోంది. పీఆర్సీని సాగదీసి సాగదీసి మూడు సంవత్సరాల తర్వాత ఇచ్చి ఉద్యోగులు, టీచర్లలో చెడ్డ పేరును మూటగట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అదే తప్పిదానికి పాల్పడటం దురదృష్టకరం. ఇప్పటికైనా ఉద్యోగుల స్థానికతను నిర్థారించి, ర్యాటిఫై చేసి, వారు ప్రస్తుతం పనిచేస్తున్న ప్రదేశాల్లోనే రీటెయిన్ చేయడం మంచిది.
 

- ఎ.శ్రీదేవి, సోషల్​ ఎనలిస్ట్