నేడు టీచర్స్​ డే .. గురువులే భావితరం నిర్మాతలు

నేడు టీచర్స్​ డే .. గురువులే భావితరం నిర్మాతలు

ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం తప్పనిసరి తంతుగా మారింది. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో కొంతమంది టీచర్లకు సన్మానం చేసి, ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించామని చెప్పుకునే స్థితికి వచ్చేశాం. స్వరాష్ట్రం సిద్ధించాక, టీచర్స్ డే ఉత్సవాలు మరీ నామమాత్రం అయ్యాయి. ఈ తొమ్మిదేళ్లలో ఒకట్రెండుసార్లు మినహా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉపాధ్యాయ దినోత్సవాలకు రావడమే బంద్ చేశారు. గతంలో ఎప్పుడూ ఈ పరిస్థితి లేదు. ఉమ్మడి రాష్ట్రంలో టీచర్స్ డే సెలెబ్రేషన్స్ కి ముఖ్యమంత్రులు విధిగా హాజరయ్యే వారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ టీచర్లుగా ఎంపికైన వారు సీఎం చేతుల మీదుగా అవార్డు తీసుకోవాలని ఆశపడుతుంటారు. కనీసం ఈసారైనా సీఎం వస్తారని సంఘాలు ఆశిస్తున్నాయి. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగానైనా సమాజంలో ఉపాధ్యాయుడి స్థాయిని పెంచే చర్యలు ప్రభుత్వాలు తీసుకోవడం లేదు.  ఒకప్పుడు గురువులంటే సమాజంలో ఎంతో గౌరవం, మర్యాద ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ అందరికీ స్పష్టంగా తెల్సిన నేటి సమాజంలో గురువుల స్థాయి మరింత పెరగాల్సి ఉండగా, అందుకు భిన్నంగా ఎందుకు జరుగుతోంది? దీని గురించి పాలకులు, అధికారులు ఉపాధ్యాయ సంఘాలు, విద్యారంగ అభిమానులు అందరూ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

భయాలను తొలగించాలి, ఉత్తముడిగా మార్చాలి

ఎవరు ఔనన్నా, కాదన్నా ఒక్కటి మాత్రం వాస్తవం. గతంలో గురువులకు సమాజంలో దక్కిన గౌరవ మర్యాదలు ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్లకు దక్కడం లేదు. ఇది కొంతమందికి చేదుగా అనిపించవచ్చేమో కానీ, కళ్ళముందు కనిపిస్తున్న వాస్తవం ఇదే. ఈ పరిస్థితి పూర్తిగా మారాలి.  విధి నిర్వహణలో ఉపాధ్యాయుల్లో అంకితభావం మరింత పెరగాల్సి ఉంది. కేవలం నైన్ టు ఫైవ్ పనిచేస్తే సరిపోదు. మారుతున్న సమాజానికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన గురుతర బాధ్యత గురువుదే. సకాలంలో సిలబస్ పూర్తి చేయడం, పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధపరచడం, మంచి రిజల్ట్స్ సాధించడం గురువుల బాధ్యతల్లో ఒకటి మాత్రమే. కానీ, ప్రస్తుతం అవే సర్వస్వంగా మారిపోవడం దురదృష్టకరం. ఒక రకంగా ఉపాధ్యాయుడి బాధ్యతలను కుదించడమే ఇది. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేలా విద్యార్థులకు మెరుగైన శిక్షణ ఇవ్వాల్సిందే. కానీ, విద్యతోపాటు చాలా అంశాలపై ముఖ్యంగా, భావి జీవితంలో విద్యార్థులు ఎదుర్కొబోయే సవాళ్ళను చెప్పి, అందుకు వారిని సన్నద్ధం చేయడం కూడా గురువుల బాధ్యతే. చిన్నచిన్న విషయాలకే కొందరు విద్యార్థులు విపరీతంగా ప్రవర్తిస్తున్నారు. తల్లిదండ్రులు సెల్ ఫోన్ కొనివ్వలేదని పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్న దురదృష్టకరమైన సంఘటలను చూస్తున్నాం. పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమో అనే భయంతో విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్న బాధాకరమైన ఇన్సిడెంట్లను చూస్తున్నాం. ఇలాంటి విపరీత చర్యలకు పాల్పడకుండా ఉపాధ్యాయులే పిల్లల్ని మానసికంగా సిద్ధం చేయాలి. సమస్యను, సవాళ్ళను ఎదుర్కొనే దృఢ సంకల్పం విద్యార్థుల్లో అలవడేలా గురువులే చర్యలు తీసుకోవాలి. తల్లిదండ్రులను, వారి ఆర్ధిక పరిస్థితిని, సమాజాన్ని అర్థం చేసుకునే రీతిలో విద్యార్థులకు తర్ఫీదునివ్వాలి. పెద్దయ్యాక ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో పిల్లలకు సరైన శిక్షణ ఇవ్వాలి. కేవలం టీచర్లతో మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఇది జరిగినప్పుడు ఉపాధ్యాయుల పేరు, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి.

స్వీయ ప్రవర్తనా నియమావళి!

అక్కడక్కడ జరుగుతున్న సంఘటనలు సమాజంలో గురువుల స్థాయిని  దిగజార్చుతున్నాయి. అవి ఒకట్రెండు సంఘటనలే కావచ్చు. అయినా, ఉపాధ్యాయలోకం తలదించుకునే సంఘటనలే. ఇలాంటి వాటితోనే టీచర్లంటే, సమాజంలో తేలికభావం ఏర్పడుతుంది. అలా జరగకుండా ఉండటానికి ఉపాధ్యాయ సంఘాలు సత్వరం చొరవ తీసుకోవాల్సి ఉంది. స్వీయ ప్రవర్తనా నియమావళి రూపొందించుకొని, ఉపాధ్యాయులందరూ వాటిని ఖచ్చితంగా ఆచరించేలా చూడాలి. ఆరోపణలకు అతీతంగా ఉపాధ్యాయులు పనిచేయాలి. అంకితభావంతో తమ విధులు నిర్వర్తించాలి. కేవలం తరగతి బోధనకే కాకుండా, విద్యార్థి సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి. సమాజంలో ఎదురయ్యే సమస్యలను, సవాళ్ళను ఎదుర్కొనే సత్తా విద్యార్థుల్లో కలిగేలా చూడాలి. ప్రభుత్వాలు, అధికారులు సైతం సెప్టెంబర్ 5 నాడు కొంతమంది టీచర్లకు సన్మానం చేసి, ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించామని చెప్పుకునే స్థితి మారాలి. పాఠశాలలు సందర్శించే సందర్భంలో అధికారులు ఉపాధ్యాయులతో స్నేహపూర్వకంగా మెలగాలి. ఉపాధ్యాయుల గౌరవం, ప్రతిష్ట పెరిగేలా చూడాల్సిన బాధ్యత విద్యారంగంలోని స్టేక్ హోల్డర్స్ అందరిపైనా ఉంది.

- మానేటి ప్రతాపరెడ్డి,గౌరవాదక్షుడు,టీఆర్ టీఎఫ్