ఆసియాకప్ 2023పై సందిగ్దత టీమిండియా రాకుంటే వరల్డ్ కప్ను బహిష్కరిస్తాం

ఆసియాకప్ 2023పై సందిగ్దత టీమిండియా రాకుంటే వరల్డ్ కప్ను బహిష్కరిస్తాం

ఆసియాకప్ 2023 జరుగుతుందా లేదా..జరిగితే ఎక్కడ జరుగుతుంది. అసలు ఆసియాకప్ 2023లో భారత జట్టు పాల్గొంటుందా...ప్రస్తుతం ప్రేక్షకుల్లో ఉన్న కన్ఫ్యూజన్ ఇది. నిజానికి 2023 ఆసియాకప్ పాకిస్థాన్లో జరగాలి. కానీ పాక్ వెళ్లి ఆసియాకప్ ఆడేందుకు టీమిండియా సిద్ధంగా లేదు. ఎట్టి పరిస్థితుల్లో పాక్కు భారత జట్టును పంపేది లేదంటోంది బీసీసీఐ. ఇందుకు భద్రతా కారణాలే కారణమంటోంది. భారత ప్రభుత్వం కూడా టీమిండియాకు అనుమతిచ్చే అవకాశం లేకపోవడంతో ఆసియాకప్ వేదికను మార్చాలని పట్టుబడుతోంది. 

భారత్ వస్తేనే మేం పోతాం..

పాక్‌లో జరిగే ఆసియా కప్ ఆడేందుకు భారత్ రాకపోతే ప్రపంచకప్ ఆడేందుకు పాకిస్థాన్ జట్టు భారత్‌కు వెళ్లదని పీసీబీ చీఫ్ నజామ్ సేథీ మరోసారి చెప్పారు. ప్రపంచకప్‌లో జరిగే అన్ని మ్యాచ్‌లను తటస్థ వేదికల్లోనే నిర్వహించాలన్నారు. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా  తమ దేశంలో జరగబోయే ఆసియా కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీని ఆడేందుకు అనుమతిస్తేనే వన్డే ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ భారత్‌కు వెళుతుందన్నాడు. యూఏఈలో వేడిగా ఉంటుందని..అక్కడ ఆడటం కుదరదని పేర్కొంటున్నాయి. యూఏఈలో ఆడి మళ్లీ పాక్‌కు రావడం ఆటగాళ్లకు శ్రమతో కూడిన పనని తిరస్కరిస్తున్నాయి.

బీసీసీఐ అంగీకరించడం లేదు..

బీసీసీఐ నిర్ణయం పాకిస్థాన్కు తలనొప్పిగా మారింది. బీసీసీఐ ప్రపంచ క్రికెట్ను శాసిస్తుంది. బీసీసీఐ ఏం చెప్తే ఇతర దేశాల క్రికెట్ బోర్డులు పనిచేయాల్సిందే. దీనికి తోడు ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా బీసీసీఐ సెక్రటరీ జైషా ఉన్నాడు. దీంతో బీసీసీఐ ని పాకిస్థాన్ ఏం చేయలేకపోతుంది. అయితే బీసీసీఐ అభ్యంతరంతో పాక్ క్రికెట్ బోర్డు  హైబ్రిడ్ మోడల్‌ను సూచించింది.  యూఏఈని తటస్థ వేదికగా ఎంపిక చేసి భారత్ మ్యాచ్‌లు అక్కడ నిర్వహిస్తామని.. మిగతా మ్యాచ్‌లను పాక్‌లో ఆడిస్తామని పీసీబీ  ప్రతిపాదించింది. ఈ విధానానికి బీసీసీఐ సహా  ఇతర దేశాలు అంగీకరించడం లేదు.

శ్రీలంకకు తరలింపు..?

పాక్ మోడల్ను అంగకరీంచని ఆసియా క్రికెట్ దేశాలు..టోర్నీని శ్రీలంకకు తరలించాలని పట్టుబడుతున్నాయి. శ్రీలంక ఆర్థికంగా చితికిపోకయింది...ఆసియాకప్ నిర్వహణతో ఆదేశానికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని బీసీసీఐ  పట్టుపడుతోందని ఓ అధికారి  చెప్పారు. ఆసియాకప్‌ను శ్రీలంకకు తరలించకపోతే టోర్నీ రద్దు చేసుకోవాల్సిందేనని తెలిపాడు.