నేడు జింబాబ్వేతో ఇండియా కీలక పోరు

నేడు జింబాబ్వేతో ఇండియా కీలక పోరు
  •     రోహిత్‌, కార్తీక్‌ గాడిలో పడతారా?
  •     డెత్​ బౌలింగ్​పై పేసర్ల దృష్టి

 

మెల్‌‌‌‌బోర్న్‌‌: ఓవైపు చూడటానికి చిన్న ప్రత్యర్థి.. కానీ ఎప్పుడు ఎలా ఆడుతుందో అంచనా వేయలేని పరిస్థితి..! మరోవైపు సెమీస్‌‌ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌‌.. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్‌‌కప్‌‌లో ఇండి యా కీలక పోరుకు రెడీ అయ్యింది. ఆదివారం జరిగే సూపర్‌‌–12,  గ్రూప్‌‌–2 ఆఖరి లీగ్‌‌ మ్యాచ్‌‌లో టీమిం డియా జింబాబ్వేతో తలపడుతుంది. మెగా ఈవెంట్‌‌లో ఇరుజట్ల మధ్య ఇదే తొలి మ్యాచ్‌‌ అయినా.. టీమిండియానే ఫేవరెట్​గా బరిలోకి దిగుతున్నది. మొత్తానికి ఒక్క విజయం ఇండియాను గ్రూప్‌‌ టాపర్‌‌గా నిలబెడితే.. ఒక్క ఓటమి పాకిస్తాన్‌‌కు సెమీస్‌‌ మార్గాన్ని (బంగ్లాదేశ్‌‌ను ఓడిస్తే) క్లియర్‌‌ చేస్తుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రోహిత్‌‌సేన.. జింబాబ్వేను ఓడించి పాక్‌‌కు చెక్‌‌ పెడుతుందా? లేక గతేడాది లీగ్‌‌ దశలోనే వెనక్కి వచ్చినట్లు ఇప్పుడు కూడా అదే ఫలితాన్ని రిపీట్‌‌ చేస్తుందా? అన్న ఉత్కంఠ ఫ్యాన్స్‌‌ను ఊపేస్తోంది. 

రోహిత్‌‌ ఆడాల్సిందే..
ఈ మ్యాచ్‌‌ కోసం తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయడం లేదు. అయితే కెప్టెన్‌‌ రోహిత్‌‌ శర్మ బ్యాటింగ్‌‌పైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. ఆడిన 4 మ్యాచ్‌‌ల్లో హిట్‌‌మ్యాన్‌‌ 74 రన్స్‌‌ మాత్రమే చేశాడు. ఇది కీలక మ్యాచ్‌‌ కాబట్టి ఇందులో చెలరేగి భారీ ఇన్నింగ్స్‌‌ ఆడితే.. నాకౌట్‌‌లోనూ అతనిపై నమ్మకం పెట్టుకోవచ్చు. టాప్‌‌ ఆర్డర్‌‌లో కేఎల్‌‌ రాహుల్‌‌, సూర్య కుమార్‌‌ ఫామ్‌‌ను కొనసాగిస్తే.. జింబాబ్వే బౌలర్లకు కష్టాలు తప్పవు. ఇక శనివారం 34వ పడిలోకి అడుగుపెట్టిన కింగ్​ విరాట్​ కోహ్లీ.. ఎంసీజీలో పాకిస్తాన్​పై  ఆడిన ఇన్నింగ్స్‌‌ను రిపీట్‌‌ చేసేందుకు ‌‌ రెడీ అవుతున్నాడు. ఆల్‌‌రౌండర్‌‌గా హార్దిక్‌‌ పాండ్యా  ప్రభావం చూపిస్తుండటం కలిసొచ్చే అంశం. కానీ సూపర్‌‌ ఫినిషర్‌‌గా టీమ్‌‌లోకి వచ్చిన దినేశ్‌‌ కార్తీక్‌‌ ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. ఈ మ్యాచ్‌‌లో అతను చెలరేగకపోతే రిషబ్‌‌ పంత్‌‌కు లైన్‌‌ క్లియర్‌‌ అయినట్లే. స్పిన్నర్‌‌గా అక్షర్‌‌ పటేల్​ మ్యాజిక్‌‌ చేస్తున్నా.. బ్యాటర్‌‌గా తన పాత్రను మరింత సమర్థంగా పోషించాలి. జింబాబ్వేలో లెఫ్టాండర్లను బట్టి దీపక్‌‌ హుడాను ప్రయత్నించే చాన్స్‌‌ కూడా ఉంది. అశ్విన్‌‌ అనుభవం టీమ్‌‌కు అతిపెద్ద బలం. బౌలింగ్‌‌లో పేస్‌‌ త్రయం భువనేశ్వర్‌‌, షమీ, అర్ష్‌‌దీప్‌‌ చెలరేగుతున్నా.. డెత్‌‌ ఓవర్లపై మరింత దృష్టి పెట్టాలి. ఈ లోపాన్ని ఇక్కడ సవరించుకోకుంటే.. నాకౌట్‌‌లో ఇబ్బందులు తప్పవు. ఓవరాల్‌‌గా జింబాబ్వేనే అని అలసత్వం చూపిస్తే మాత్రం ఇండియా మూల్యం చెల్లించుకోక తప్పదు. 

రజాతో ప్రమాదం..
ఈ మ్యాచ్‌‌లో జింబాబ్వే.. ఇండియాను ఓడిస్తే అతిపెద్ద సంచలనం అవుతుంది. కాబట్టి ప్రస్తుతం ఎర్విన్‌‌ బృందం దీనిపైనే ఎక్కువగా దృష్టి పెట్టింది. అందుకు తగినట్లుగానే బలమైన తుది జట్టును రంగంలోకి దించుతున్నది. ప్రస్తుతం ఉన్న టీమ్‌‌లో సికిందర్‌‌ రజాతోనే అతిపెద్ద ప్రమాదం పొంచి ఉంది. తన స్పిన్‌‌ మ్యాజిక్‌‌తో ఇప్పటికే సంచలనాలు సృష్టించాడు. ఇప్పుడు ఇండియా టాప్‌‌ ఆర్డర్‌‌ను అతను లక్ష్యంగా చేసుకున్నాడు. బ్యాటింగ్‌‌లో క్రెయిగ్‌‌ ఎర్విన్‌‌, ర్యాన్‌‌ బర్ల్‌‌, సీన్‌‌ విలియమ్స్‌‌, చకబ్వాపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. ప్రపంచ స్థాయి బౌలింగ్‌‌ వనరులు లేకపోయినా పరిస్థితులకు తగినట్లుగా ఆడే ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు. 

68 టీ20ల్లో 4 వేల రన్స్‌ పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డులకెక్కడానికి కోహ్లీకి కావాల్సిన రన్స్‌. 

35మరో 35 రన్స్‌ చేస్తే సూర్య కుమార్‌.. ఈ ఏడాది టీ20ల్లో వెయ్యి రన్స్‌ పూర్తవుతాయి.

 జట్లు (అంచనా)
ఇండియా: రోహిత్‌‌‌‌ (కెప్టెన్‌‌), రాహుల్‌‌, కోహ్లీ, సూర్యకుమార్‌‌, హార్దిక్‌‌ పాండ్యా, దినేశ్‌‌ కార్తీక్‌‌, అక్షర్‌‌ పటేల్‌‌, అశ్విన్‌‌, భువనేశ్వర్‌‌, షమీ, అర్ష్‌‌దీప్‌‌ సింగ్‌‌.

జింబాబ్వే: ఎర్విన్‌‌ (కెప్టెన్‌‌), వెస్లీ మదెవరె, చకబ్వా, సీన్‌‌ విలియమ్స్‌‌, రజా, మిల్టన్‌‌ షుంబా, ర్యాన్‌‌ బర్ల్‌‌, జోంగ్వీ, రిచర్డ్‌‌ నగరవా, టెండి చటారా, బ్లెస్సింగ్‌‌ ముజరబాని.