వన్డే సిరీస్ను కైవసం చేసుకున్న భారత్

వన్డే సిరీస్ను కైవసం చేసుకున్న భారత్

టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలోనూ టీమిండియా ఘన విజయం సాధించింది. ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో అద‌ర‌గొట్టిన ఇండియా 317 ప‌రుగుల తేడాతో శ్రీ‌లంక‌ను చిత్తుగా ఓడిచింది. దాంతో, మూడు వ‌న్డేల సిరీస్‌ను 3-0తో టీమిండియా గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో భార‌త్ వ‌న్డే చరిత్ర‌తో అతి పెద్ద విజ‌యం న‌మోదు చేసింది. ఇంత‌కుమందు 2008లో న్యూజిలాండ్‌పై 290 ప‌రుగ‌లు తేడాతో గెలిచింది.

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ సెంచరీలు చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 390 పరుగులు చేసింది. దీంతో  శ్రీలంకకు 391 పరుగుల భారీ టార్గెట్ ను నిర్దేశించింది. అయితే లక్ష్య చేధనలో బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక భారీ టార్గెట్ ను చేధించే క్రమంలో బ్యాటర్లు తడబాటుకు గురై ఒక్కొక్కరు వికెట్లు సమర్పించుకున్నారు. టీమిండియా బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్ గా బంతులు వేయడంతో లంక బ్యాటర్లు టపా..టపా వికెట్లు సమర్పించుకున్నారు. దీంతో లంక 73 రన్స్ కే ఆలౌట్ అయ్యింది. మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బౌలింగ్ తో లంక ను కోలుకోలేని దెబ్బతీశాడు. ఒకానొక సమయంలో వికెట్లు కాపాడుకోవడమే కష్టంగా అనిపించింది. కొందరు బ్యాట్స్ మెన్స్ అయితే రెండంకెల స్కోరు చేయకుండానే వెనుదిరిగారు. 10 ఓవర్లకే ఆరు వికెట్లు కోల్పోయి లంక పీకల్లోతు కష్టాల్లో పడింది.  సిరాజ్ దెబ్బకు లంక బ్యాటర్లు ఒక్కొక్కరు పెవిలియన్ కు క్యూ కట్టారు. సిరాజ్ ఖాతాలో కీలకమైన నాలుగు వికెట్లు పడ్డాయి. మహ్మద్ షమీ కూడా లంక బ్యాట్స్ మెన్స్ ను క్రీజులో కుదురుకోనివ్వకుండా బంతులు విసిరి రెండు వికెట్లు తీసుకున్నాడు. కుల్దీప్  రెండు వికెట్లను పడగొట్టాడు. 

అంతకు ముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ లంక బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని  అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో రెండో సెంచరీ సాధించాడు.  ఇన్నింగ్స్ మొదటి నుంచి దాటిగా ఆడుతూ 89  బంతుల్లో 100 రన్స్‌ (13 ఫోర్లు, 2 సిక్స్ లు) చేశాడు. అయితే, గిల్‌కు వన్డేల్లో ఇదే రెండో శతకం. రోహిత్ శర్మ (42), శ్రేయస్‌ అయ్యర్‌ (38) రాణించారు. లంక బౌలర్లలో లహిరు కుమార, కసున్‌ రజిత తలో రెండు వికెట్లు పడగొట్టగా.. కరుణరత్నె ఒక వికెట్‌ తీశాడు. 

రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ  విశ్వరూపం చూపించాడు. మైదానంలో బెబ్బులిలా గర్జించి..లంక బౌలర్లను ఊచకోత కోశాడు. ఫోర్లు, సిక్స్ లతో మైదానం  మొత్తం పరుగుల వరద పారించాడు. స్పిన్,ఫాస్ట్ అనే తేడా లేకుండా లంక బౌలర్లపై కనికరం చూపించకుండా అందరినీ చితకబాదేశాడు.85 బంతుల్లో సెంచరీ చేసిన విరాట్.. తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి  20 బంతుల్లోనే అర్థశతకాన్ని పూర్తి చేశాడు. 110 బంతుల్లో విరాట్ 166 పరుగులు చేశాడు. అందులో 13 ఫోర్లు, 7 సిక్స్ లు ఉన్నాయి. కోహ్లీ బౌండరీ లైన్ కు బంతిని తరలించినప్పుడల్లా మైదానంలోని అభిమానులు కేరింతలు పెట్టారు.  విరాట్..విరాట్ అంటూ నినాదాలు చేశారు. బ్యాటింగ్ కు వచ్చినప్పటి నుంచి  లంక బౌలర్లపై ఎటాకింగ్ కు దిగాడు విరాట్ కోహ్లీ. 85 బంతుల్లో సెంచరీ చేసిన కోహ్లీకి వన్డేల్లో ఇది 46వ సెంచరీ కాగా..ఓవరాల్ గా 74  సెంచరీలు పూర్తి చేశాడు. 

మరోవైపు  విరాట్ కోహ్లీ మ‌రో మైలురాయి అధిగమించాడు. వ‌న్డేల్లో శ్రీ‌లంక మాజీ ఆట‌గాడు మ‌హేళ‌ జ‌య‌వ‌ర్దనే రికార్డును బ్రేక్ చేశాడు. జ‌య‌వ‌ర్దనే 418 ఇన్నింగ్స్‌ల్లో 12,650 ర‌న్స్ చేశాడు. కోహ్లీ 267 ఇన్నింగ్స్‌ల్లోనే 12,651 ర‌న్స్ స్కోర్ చేశాడు. దాంతో వ‌న్డే ఫార్మాట్‌లో అత్యధిక ప‌రుగుల చేసిన ఐదో ఆట‌గాడిగా నిలిచాడు. . ఈ జాబితాలో భార‌త మాజీ ఆట‌గాడు స‌చిన్ టెండూల్కర్ 18,426 ర‌న్స్‌తో ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. కుమార సంగ‌క్కర (శ్రీ‌లంక – 14,234), రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా – 13,704), స‌నత్ జ‌య‌సూర్య (శ్రీ‌లంక – 13,430) వ‌రుస‌గా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.