పరిపాలన.. ప్రక్షాళన .. టీం రేవంత్ ఫోకస్

పరిపాలన.. ప్రక్షాళన ..  టీం రేవంత్ ఫోకస్

హైదరాబాద్: ప్రగతి భవన్ కంచెలు బద్దలు కొట్టడం నుంచి ఇవాళ్టి టీఎస్పీఎస్సీ రివ్యూ వరకు ప్రతి రోజూ తమదైన శైలిలో దూసుకుపోతున్నది టీం రేవంత్. ఓ వైపు తమ శాఖల పరిధిలో రివ్యూలు నిర్వహిస్తూనే మరో వైపు వేటు వేయడం కూడా మొదలు పెట్టింది. ఈ నెల 7న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఓ వైపు బాధ్యతలు స్వీకరిస్తుండగానే మరో వైపు ప్రగతిభవన్ ముళ్లకంచెలు బద్దలయ్యాయి. మరుసటి రోజే ఆ భవనం జ్యోతిబాఫూలే ప్రజాభవన్ గా మారింది. అక్కడికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. క్యాబినెట్ సమావేశం నిర్వహించి..  ఆరింటిలో రెండింటిని గ్యారెంటీలను అమల్లోకి తెస్తున్నట్టు ప్రకటించారు. 

మరుసటి రోజే మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించారు. అదే రోజు రాజీవ్ ఆరోగ్య శ్రీ సాయాన్ని 10 లక్షలకు పెంచే పథకాన్ని ప్రారంభించారు. పరిస్థితిని గమనించిన జెన్ కో సీఈ ప్రభాకర్ రావు తన పదవికి రాజీనామా చేశారు. అయినా సీఎం విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నియమితులైన 54 కార్పొరేషన్ల చైర్మన్లను తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.  ఆ తర్వాత టీఎస్పీఎస్సీ.. రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలు పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు.  మరో వైపు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆర్థికశాఖపై రివ్యూ నిర్వహించి శ్వేత పత్రం విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇవాళ ఉదయం పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించి రేషన్ కార్డులు, పీడీఎస్ బియ్యం అందజేత తదితర అంశాలపై కీలక ప్రకటన చేశారు. 

హోంశాఖ నుంచే స్టార్ట్

సీఎం రేవంత్ రెడ్డి హోంశాఖ నుంచే బదిలీలకు శ్రీకారం చుట్టారు. ఇవాళ ఉదయం సిటీ పోలీసు కమిషనర్ గా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ని నియమించారు. నార్కొటిక్ బ్యూరో డైరెక్టర్ గా సందీప్ శాండిల్యను, సుధీర్ బాబును రాచకొండ కమిషనర్ గా, సైబరాబాద్ కమిషనర్ గా  అవినాశ్ మహంతిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఐపీఎస్ అధికారులు దేవేంద్రసింగ్ చౌహాన్, స్టీఫెన్ రవీంద్ర ను డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేశారు. 2003 బ్యాచ్ కు చెందిన షానవాజ్ ఖాసీం ను సీఎం సెక్రటరీగా నియమించారు. ఖాసీం ప్రస్తుతం హైదరాబాద్ రేంజ్ డీఐజీగా ఉన్నారు.