20 వేల టెక్​జాబ్స్​ ఊడే చాన్స్​..ఈ జాబ్స్ కు డిమాండ్

20 వేల టెక్​జాబ్స్​ ఊడే చాన్స్​..ఈ జాబ్స్ కు డిమాండ్

న్యూఢిల్లీ:టెక్,  స్టార్టప్ కంపెనీలు ఉద్యోగుల తొలగింపును కొనసాగిస్తూనే ఉన్నాయి. మిగులు ఉద్యోగులు ఉన్నారని, ఖర్చులు పెరుగుతున్నాయని, నిధులు రావడం లేదంటూ ఇది వరకే వేలాది మందిని ఇంటికి పంపించాయి. రాబోయే ఆరు నెలల్లో మరో 20వేల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఎక్స్​పర్టులు చెబుతున్నారు.  కరోనా టైంలో ఎడ్​టెక్ కంపెనీలు అనేక మంది ఆన్‌‌‌‌లైన్ ట్యూటర్లను నియమించుకున్నాయి. విద్యాసంస్థలు తిరిగి తెరుచుకోగానే వీళ్ల ఉద్యోగాలు ఊడాయి. కొన్ని ఎడ్​టెక్​ కంపెనీలు మాత్రం ఆఫ్‌‌‌‌లైన్ ట్యూటర్లను నియమించుకున్నాయి. నిధుల కొరత కారణంగా చాలా మందిని తొలగించాల్సి వచ్చిందని ఈ సంస్థలు అంటున్నాయి. ఈ విషయమై  స్టాఫింగ్ కంపెనీ  ఎక్స్‌‌‌‌ఫెనో కో–ఫౌండర్​ కమల్ కారంత్ మాట్లాడుతూ రెసిషన్​ ఎఫెక్ట్​, పాలనా విధానాలు సరిగ్గా లేకపోవడం, డబ్బులు అందకపోవడం వల్ల  ఫిన్‌‌‌‌టెక్, ఎడ్యుటెక్, అగ్రిటెక్, లాజిటెక్,  డైరెక్ట్ -టు- కన్జూమర్ కంపెనీలు ఎడాపెడా ఉద్యోగులను తొలగించాయని అన్నారు.  సేల్స్​, యాప్స్​ డెవెలప్​మెంట్​, సపోర్ట్​ స్టాఫ్​, అడ్మిన్​లో పనిచేసే వాళ్లు ఉపాధికి దూరం కావాల్సి వచ్చిందని వివరించారు. ప్రస్తుతం ఉద్యోగాల్లో కొనసాగుతున్న వాళ్లకు 
బోనస్,  వేరియబుల్ పేలను తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఈ కంపెనీల్లో జాబ్స్​కు ప్రయత్నించవచ్చు...

గ్లోబల్​ ఇంటర్నెట్ కంపెనీలు,  భారతీయ ఐటీ సంస్థలు సిబ్బందిని తగ్గించినా, ఇప్పటికీ మనదేశంలోని చాలా క్యాప్టివ్ సెంటర్లలో ఉద్యోగాలు ఉన్నాయి. ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​(ఏఐ),  మెషీన్ లెర్నింగ్‌‌‌‌లో స్కిల్స్​కు  డిమాండ్ బాగా ఉంది. స్టార్టప్‌‌‌‌లు మార్కెటింగ్,  సేల్స్‌‌‌‌లో యువతను బాగానే నియమించుకుంటున్నాయి. బ్యాంకింగ్,  బీమా కంపెనీల్లో రాజీనామాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి ఆపరేషన్స్​, అసెట్ మేనేజ్‌‌‌‌మెంట్,  మార్కెటింగ్ రోల్స్​ కోసం ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. కొన్ని విభాగాల్లో పనిచేసే వారికి మాత్రం ప్రమాదం లేదని ఎక్స్​పర్టులు అంటున్నారు. లీగల్  స్ట్రాటజీ విభాగంలో ఉన్న వారి జోలికి కంపెనీలు వెళ్లడం లేదు. మిడిల్ మేనేజ్‌‌‌‌మెంట్ సిబ్బందికి, ముఖ్యంగా బలమైన డిజిటల్ నైపుణ్యాలు ఉన్నవారికి రక్షణ ఉంటోంది. క్లయింట్-ఫేసింగ్ టీమ్‌‌‌‌లు కూడా సేఫ్​ అని చెప్పవచ్చు. ఎందుకంటే కంపెనీలకు ఇవి చాలా ముఖ్యం. ఐటీ సేవల కంపెనీల రన్నింగ్ ప్రాజెక్ట్‌‌‌‌లలో ఉన్న ఉద్యోగులు బెంచ్‌‌‌‌పై ఉన్నవారి కంటే చాలా మెరుగు! కొన్ని సంస్థలు ఇప్పటికే తమ క్లయింట్‌‌‌‌లకు రన్నింగ్ ప్రాజెక్ట్‌‌‌‌లలో బిల్లింగ్ చేయడం ప్రారంభించాయి. ఎడ్​టెక్​,  లాజిటెక్‌‌‌‌లో, ఫైనాన్స్,  సప్లై చైన్ ఉద్యోగాలు ప్రస్తుతానికి సురక్షితం.

ఈ పరిస్థితి ఇంకెంత కాలం?

 కంపెనీలు మరో ఆరు నెలలపాటు మిడిల్,  సీనియర్ నియామకాలను చేపట్టే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కొత్త వ్యాపారాల కోసం చూస్తున్న చాలా మంది సీఎక్స్​ఓ లకు మార్కెట్లు మెరుగుపడే వరకు వెంచర్లు నిలిపివేయాలని ఆదేశాలు అందుతున్నాయి.  పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ వర్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ను నియమించుకునే స్టాఫింగ్​ ఫర్మ్​లు మాత్రం ఎప్పట్లాగే చాలా రంగాలలో సిబ్బందిని తీసుకుంటున్నాయి. ఈ ఏడాది జూన్–-జూలై నాటికి మ్యాన్‌‌‌‌పవర్ ఎంతకావాలనే విషయమై స్పష్టమైన అవగాహన వస్తుందని కంపెనీలు చెబుతున్నాయి.


ఐటీ రంగంలో ఎవరికి ప్రమాదం?

అధిక జీతాలు ఐటీ సేవల కంపెనీల బ్యాలెన్స్ షీట్లను ప్రభావితం చేశాయి. క్లయింట్లకు సేవలు అందించే ఉద్యోగాలు మాత్రం పెద్దగా తగ్గలేదు.  ‘ఆన్​బెంచ్​’ ఉద్యోగులు, ఇంజినీర్లు,  సపోర్ట్ టీమ్స్​లో పనిచేసేవారు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు. ఈ టీమ్స్​లో ఉద్యోగాల కోతలకు అవకాశాలు ఎక్కువ. చాలా కంపెనీలు తమ కొత్త ఉద్యోగాలను తగ్గించాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్, ఇన్ఫోసిస్ లిమిటెడ్, విప్రో లిమిటెడ్,  హెచ్‌‌‌‌సిఎల్ టెక్ వంటి  ఐటి సంస్థల్లో మొత్తం ఉద్యోగుల సంఖ్య తగ్గింది. అధిక జీతభత్యాలు, ఖర్చుల వల్ల ఇబ్బందిపడుతున్నాయి.  క్యాంపస్ డ్రైవ్స్​లో ఎంపికైన వారికి జాబ్స్​ ఇస్తామని చెబుతున్నప్పటికీ, కొత్త రిక్రూట్‌‌‌‌మెంట్లకు కఠినమైన పరీక్షలను పెడుతున్నాయి.