
- మొత్తం ఆదాయం రూ. 13,351 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీ సేవల కంపెనీ టెక్‌మహీంద్రా ఈ ఏడాది జూన్‌తో ముగిసిన మొదటి క్వార్టర్ఫలితాలను ప్రకటించింది. ఖర్చులు నిలకడగా ఉండి, రాబడి పెరగడంతో ఈసారి నికర లాభం ఏడాది లెక్కన 34శాతం పెరిగింది. ఏప్రిల్–-జూన్ క్వార్టర్లో నికర లాభం రూ. 1,141 కోట్లకు చేరింది. ఇది గత ఏడాది ఇదే కాలంలో రూ. 852 కోట్ల లాభం వచ్చింది. కన్సాలిడేటెడ్ పద్ధతిలో రాబడి సంవత్సరానికి మూడుశాతం వృద్ధితో రూ. 13,351 కోట్లకు చేరుకుంది.
టెక్‌మహీంద్రా మొత్తం ఖర్చులు ఈ క్వార్టర్లో స్వల్పంగా రూ. 11,952 కోట్లకు తగ్గాయి. కంపెనీ మొత్తం టాప్‌లైన్‌లో దాదాపు సగం వాటా ఉన్న అమెరికా మార్కెట్ నుంచి వచ్చే ఆదాయం గత సంవత్సరంతో పోలిస్తే 5.9శాతం తగ్గింది. టెక్‌మహీంద్రా కొత్త బుకింగ్‌ల విలువ జూన్ క్వార్టర్లో 809 మిలియన్ డాలర్లకు పెరిగింది. మునుపటి క్వార్టర్లో వీటి విలువ 798 మిలియన్ డాలర్లు ఉంది. గత సంవత్సరం ఇదే కాలంలో 534 మిలియన్ డాలర్లుగా నమోదయింది. టెక్ మహీంద్రా షేర్లు బుధవారం ఎన్ఎస్ఈలో దాదాపు 2శాతం పెరిగి ఒక్కో షేరుకు రూ. 1,608.5 వద్ద ముగిశాయి.
పెరిగిన ఉద్యోగులు
జూన్ క్వార్టర్లో కంపెనీ ఐటీ ఉద్యోగుల సంఖ్య 79,987గా ఉంది. సీక్వెన్షియల్‌గా 622, ఏడాది లెక్కన 430 మంది ఉద్యోగులు పెరిగారు. కంపెనీ అట్రిషన్ ఒక క్వార్టర్ క్రితం 11.8శాతంతో పోలిస్తే ఈసారి 12.6శాతంగా ఉంది. ఇబిటా మార్జిన్ ఏడాది లెక్కన 260 బేసిస్పాయింట్లు పెరిగి 11.1శాతానికి చేరుకుంది. అయితే పీఏటీ మార్జిన్ ఏడాది లెక్కన 190 బేసిస్పాయింట్లు పెరిగి 8.5శాతానికి చేరుకుంది. కంపెనీ పెద్ద క్లయింట్ల సంఖ్య 26గా ఉంది. ఇది వార్షిక ప్రాతిపదికన 2 పెరిగింది.
ఫ్రీక్యాష్ఫ్లో 86 మిలియన్ డాలర్లు ఉంది. ఒక క్వార్టర్ క్రితం 150 మిలియన్ డాలర్లు ఉంది. టెక్‌మహీంద్రా సీఈఓ మేనేజింగ్ డైరెక్టర్ మోహిత్ జోషి మాట్లాడుతూ, “మా పనితీరు నిలకడగా బలోపేతం అవుతోంది. చివరి పన్నెండు నెలల ప్రాతిపదికన డీల్స్ 44శాతం పెరిగాయి.
అన్ని వెర్టికల్స్‌లో, అన్ని భౌగోళిక ప్రాంతాల్లో వృద్ధి కనిపిస్తోంది”అని అన్నారు. కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రోహిత్ ఆనంద్ మాట్లాడుతూ, తాము వరుసగా ఏడు క్వార్టర్లలో మార్జిన్ విస్తరణను సాధించామని, ఇది తమ సంస్థ అంతటా క్రమశిక్షణకు నిదర్శనమని చెప్పారు.